Celle Nicetalu Nike Ceri Medegudidinna In Telugu – చెల్లె నీచేతలు నీకే చేరి మేడెగుడిదిన్న

ఈ పోస్ట్ లో చెల్లె నీచేతలు నీకే చేరి మేడెగుడిదిన్న కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

చెల్లె నీచేతలు నీకే చేరి మేడెగుడిదిన్న – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : చెల్లె నీచేతలు నీకే చేరి మేడెగుడిదిన్న
సంఖ్య : 412
పుట:277
రాగం: సామంతం

సామంతం

94 చెల్లె నీచేఁతలు నీకే చేరి మేడెగుడిదిన్న
నల్లదె కంటిమి నిన్ను హనుమంతరాయ

||పల్లవి||

జంగ చాఁచినట్టి నీసంగడి పాదములు
చెంగలించి యెత్తిన నీ శ్రీహస్తము
ముంగలిఁ బిడికిలించి మొలఁజేర్చినచేయి
అంగ నీసొబగు హనుమంతరాయ

||చెల్లె||

పెరిగినవాలము పెద్దైన పిరుఁదును
అరిగి జలధి దాఁటే యాయితమును
సిరుల బంగారు కాసె చెలఁగిన సింగారము
అరుదాయ నీవునికి హనుమంతరాయ

||చెల్లె||

స్వామికార్యపుఁజింత జానికి సేమపువార్త
దీమసాన మగుడి యేతెంచిన చేఁత
రామనామజపముతో రతి శ్రీ వేంకటపతి
కా మేటిబంటవైతివి హనుమంతరాయ

||చెల్లె||413

అవతారిక:

“మేడెగుడిదిన్న” అనే గ్రామములో వెలసిన హనుమంతుని సేవిస్తూ అన్నమాచార్యులవారు చెప్పిన అద్భుతమైన కీర్తననాస్వాదిద్దాము. నీ చేతలు నీకే చెల్లినవి స్వామీ! అని కీర్తిస్తున్నారు. ఇటువంటి కీర్తనలు కోకొల్లలున్నాయి! జానకి క్షేమసమాచారము రాముని కెరిగించిన ధీశాలియైన బంటు అని, శ్రీవేంకటేశ్వరునికి కూడా ఈయన మేటి బంటేనట. ఆయన వునికే అరుదాయెనట.

భావ వివరణ:

అల్లదె (అదిగో) ‘మేడెగుడిదిన్న’లో చేరి వెలసిన హనుమంతరాయా! నిన్ను కంటిమి (నీ వైభవమును చూచితిమి). నీచేతలు నీకె చెల్లె (నీసాహసములు ఇతరులకు అసాధ్యము. అవినీకే చెల్లినవి ప్రభూ!)

జంగ చినట్టి నీ సంగడిపాదములు (బారగా పంగజాచినటువంటి నీ పాదముల జంట) కనువిందు చేయుచున్నవి. చెంగలించి (అతిశయముగా) యెత్తిన నీ శ్రీహస్తము (మంగళకరమైన చేయి ముంగలి బిడికిలించితివి (మీదికెత్తి పిడికిలి బిగించియుంటివి). ఇంకొక చేయి నీ మొలజేర్చితివి (నడుముపై వుంచుకొంటివి). ఓ హనుమంతరాయా! ఈ విధముగా నీసొబగు (శోభ) అంగమాయస్వామీ! (చాలవైభవయుతముగా నున్నది).

పొడవుగా పెంచిన నీ వాలము (తోక) నీ పెద్దవైన పిరుదులమధ్య వ్రేలాడుచున్నది. తిరిగి (వెళ్ళి) నూరుయోజనముల జలధిని (సముద్రమును దాటే నీయాయితము (నిడపు… అంటే… దూకగల సామర్థ్యము…) ను యేమని పొగడగలము! బంగార రంగు కాసే (వస్త్రము) వైభవోపేతముగానున్నది. ఆభరణములతో నీ సింగారము చెలగినది (కన్నుల పండువగా వున్నది). ఓ హనుమంతరాయా! నీ వునికి (వున్నవిధానము) అరుదాయ (బహు అరుదుగా చూడగలుగుతాము) స్వామీ!

జానకి క్షేమసమాచారము యెంత త్వరగా శ్రీరామచంద్రునికి అందించగలనా అన్నదే నీ ఆశయము. అదే నీ చింత (ఆలోచన). దీమసాన మగుడియేతెంచిన చేత (లంకలో రాక్షసులను చితకబాది, లంకా దహనము చేసి, రావణునికే హితబోధ చేసి సీతాదేవి చూడామణితో తిరిగివచ్చిన… నీ సాహసము…) అసాధ్యము. రామనామ జపముతో, రతికెక్కితివి (ప్రసిద్ధుడవైతివి). ఓ హనుమంతరాయా! శ్రీవేంకటపతియైన నీ రామునికే మేటి బంటువైతివి స్వామీ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Leave a Comment