Paramavivekulala Bandhuvulala In Telugu – పరమవివేకులాల బంధువులాల

ఈ పోస్ట్ లో పరమవివేకులాల బంధువులాల కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

పరమవివేకులాల బంధువులాల – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : పరమవివేకులాల బంధువులాల
సంఖ్య : 475
పుట 320
రాగం: ధన్నాసి

ధన్నాసి

93 పరమవివేకులాల బంధువులాల
తెరదీసి మాకు నిది తెలుపరో

||పల్లవి||

యేడుజా నలమేనిలో నిందిరానాథుఁ డున్నాఁడు
వేడుకతో నతనిని వెదకరో
పూడిచి వున్నది మతిఁ బొందుగ వైకుంఠము
చూడరో ధ్యానముసేసి సోదించరో

॥పరమ ||

కొండుబయలలో గోవిందునినెలవఁట
చిడిముడితో నిట్టే చేరి పట్టరో
అడఁచి దాఁచివున్నది అందే బ్రహ్మానందము
విడువరో యీ ముడియ వెలయఁ జేపట్టరో

॥పరమ ||

వూని నల్లెఁడు నాలికలో నుండు శ్రీవేంకటేశుఁ-
డానుకొని బత్తితోడ నటు నిల్పరో
బెట్టివున్నది నామకీర్తనములందు
తానకముగా నేపొద్దుఁ దలఁచుకోరో

॥పరమ ||475

అవతారిక:

అన్నమాచార్యులవారు చెప్పిన ఈ కీర్తనలో సాటివారిని తమ మనస్సులలోని అజ్ఞానపు తెరలను తొలగించి శ్రీహరిని దర్శించమని వేడుకొంటున్నారు. ఇది కూడా తేలికగా కనుపించే క్లిష్టమైన కీర్తన. భావ వివరణ చదివినవారికి ఈ సంగతి వెంటనే అర్థమవుతుంది. గోవిందునికి మీమనస్సులో నెలవుగా వుంచితే బ్రహ్మానందము దానంతట అదే సిద్ధిస్తుంది. శ్రీ వేంకటేశ్వరుని నామసంకీర్తనము నాలికపై నుంటే, యే పొద్దునైనా ఆయననే తలుస్తుంటే… తప్పక ఒకనాటికి ఆ స్వామి దయకలుగుతుంది.

భావ వివరణ:

పరమవివేకులాల (విశిష్ఠమైన వివేకము గల జ్ఞానులారా!) బంధువులారా! మాకు తెరదీసి (వివేకము చూపి) ఇది (ఈసంగతిని) తెలియజేయండయ్యా!

ఏడు’జానలు’ పొడుగున్న ఈ శరీరంలో ఇందిరానాధుడైన శ్రీహరివున్నాడు. కాని ప్రయత్నించి వెదకకపోతే మాత్రం కనబడడు. వైకుంఠము అనేది వేరేయెక్కడో లేదు. మనస్సులో శ్రీహరి వున్నట్లే, వైకుంఠము కూడా మన మెదడులోనే పూడ్చివున్నది, దాగివున్నది). అది వూరకనే కనబడదు. ధ్యానముచేసి, పరిశోధించి వెతికి చూస్తేకాని కనుపించదు. అయ్యలారా! అట్లే సోధించరో!

నెలవు (వుండేచోటు) నిజంగా యెక్కడవున్నది? కొడు బయలులోనట (పుడిసిలిలో ఇమిడిన ఆకాశములో వున్నాడట. చిడిముడితో (తొట్రుబాటుతో కూడిన జాగ్రత్తతో) ఆయనను ఇట్టే పట్టరో (మీ వశము చేసికొనండి). అందే (ఆయనను వశపరచుకొనుటలోనే) బ్రహ్మానందము, అణచిదాచివున్నది (అణిగి దాగివున్నది). ఈ ముడియ (మాట)లో దాగి వున్న బ్రహ్మానందము విడువరో (బయట పెట్టండి). వెలయజేపట్టరో (బయటపడంగానే) మీలో భద్రపరచుకొనండి.

శ్రీవేంకటేశ్వరుడు యెక్కడవున్నాడు? పూనినల్లెడు నాలుకలోవున్నాడు (వహించి అటూఇటూ కదలే నాలుకలోనే, ఆయన వున్నాడు). ఆనుకొని (దరిజేరి) ఆయనను బత్తితో (భక్తితో) మనస్సులో నిల్పరో. శ్రీహరి | నామసంకీర్తనములో మీ మనస్సును నానబెట్టి (నిమగ్నముచేసి ) యే | వేళనైనా తానకము (స్థానము)గా ధ్యానించుడు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Leave a Comment