Talaledu Tokaledu Daivamani Mayalaku In Telugu- తలలేదు తోకలేదు దైవమానీ మాయలకు

ఈ పోస్ట్ లో తలలేదు తోకలేదు దైవమానీ మాయలకు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

తలలేదు తోకలేదు దైవమానీ మాయలకు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : తలలేదు తోకలేదు దైవమానీ మాయలకు
సంఖ్య : 368
పుట : 247
రాగం: కన్నడగౌళ

కన్నడగౌళ

90 తల లేదు తోఁక లేదు దైవమా నీమాయలకు
తెలిసియుఁ దెలియక తిరిగేము నేము

||పల్లవి||

తను వేఁటిదో యీ తలపోఁత లేఁటివో
యెనయు సంసార సుఖ మిది యేఁటిదో
వెనక ముం దేఁటిదో వివేక మెరఁగక
దినదినమును నేమో తిరిగేము నేము

||తల||

పుట్టు గిది యెక్కడో పోయేటి దెక్కడో
ఇట్టె యీ సిరులెల్లా నెక్కడెక్కడో
మట్టులేని హరినిర్మాణ చక్రములోన
దిట్టలమై యేమేమో తిరిగేము నేము

||తల||

నేరు పేదో నేర మేదో నిలిచిన దొకటేదో
వూరకే నీదాసులమై వున్నారము
చేరి నన్నేలినయిట్టె శ్రీవేంకటేశ్వర
గారవించి కరుణించి కావఁగదవే

||తల||368

అవతారిక:

చక్కటి వైరాగ్య దీపికవంటి కీర్తననావిష్కరిస్తున్న అన్నమాచార్యులవారిని ఆలకించండి. “ఓ దైవమా! నీమాయలకు తలతోక వుండవయ్యా! మేము మాత్రం తెలియనివాటిని తెలుసునని, తెలిసినవాటిని తెలియవని తలపోస్తూ తిరుగుతుంటాము. మాకు దేంట్లోనూ నేర్పులేదు. మాకు తెలిసిందల్లా నీ దాసులుగా వుండటం. మమ్మల్ని యెలాగో వొకలాగ ఒడ్డునపడవెయ్యవయ్యా! కరుణించు” అంటున్నారు.

భావ వివరణ:

ఓ దేవదేవా! నీ మాయలకు (లీలలకు) తలలేదు తోకలేదు (ఆరంభం యెప్పుడు జరుగుతుందో తెలియదు. ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు). నీమాయ ఆవరించినంతసేపూ, పిచ్చిపట్టినట్లు తెలిసీ తెలియక యేవేవో భ్రమలలో పడి, తిరుగాడుతూనే వుంటాము.

మా అంత పిచ్చివాళ్ళున్నారా ప్రభూ! మా ఈ శరీరం యెట్లా వచ్చిందో మాకు తెలియదు. దీనికి ఆలోచనలెలావస్తున్నాయో తెలియదు. సంసార సుఖము యెట్లా వుంటుందో తెలియదు. వెనక ముందేటిదో వివేకమెరుగము (పూర్వజన్మలో నేనెవరినో తెలియదు. మళ్ళీ నేను చచ్చాక యేమవుతానో తెలియదు). బ్రతికున్నంతకాలమూ ప్రతిరోజూ యేమో తిరుగుతూనే వుంటాము. ఏమిటి నీమాయ?

తల్లి కడుపులో యెప్పుడు యెలా పడ్డామో తెలియదు. ఏ క్షణాన గుటుక్కుమని కన్ను మూస్తామో తెలియదు. నాకు ధనమెలా వచ్చిందో, యెన్నాళ్ళుంటుందో, వున్నట్లుండి యెప్పుడు పోతాయో తెలియదు. శ్రీహరియొక్క ఈ “నిర్మాణ చక్రములో” మట్టు లేకుండా (పొందిక లేకుండా) తిరుగుతూనే వున్నాము. విచిత్రమేమంటే అట్లా తిరుగుతున్నా మేమే దిట్టలము (సమర్థులము) అని అనుకొంటుంటాము.

నీ కృపతో చివరికి ఒకనాటికి నాకు జ్ఞానోదయమయింది. నేర్వవలసిన దేమిటో తెలిసింది. ఇక నాకు నేర్పుతోను పనిలేదు. నిలిచినది వొక్కటేననే నేర్పు యేదో అది నా స్వంతమయింది. ఇక వూరకనే నీ దాసులమై వున్నారు. ఓ శ్రీవేంకటేశ్వరా! నీవే నన్ను వెదకి చేరుకుని నన్ను యేలినావు. ఇక నన్ను విడువకు. గారవించి కరుణించి కావగదవే (మన్నించి కరుణతో రక్షించుము తండ్రీ!) నాకు నీవే దిక్కు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Leave a Comment