ఈ పోస్ట్ లో శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 2
కీర్తన: శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును
సంఖ్య : 258
పుట: 175
రాగం: పాడి
పాడి
70 శిష్టరక్షణమును దుష్టనిగ్రహమును
సృష్టించె నొక్కవేళనే శ్రీజయంతినాఁడు.
||పల్లవి||
హరి కృష్ణావతార మందినయంతలోనే
పరమమునుల కెల్ల భయముడిగెను
తెరలి దైత్యులగుండె దిగులుచొచ్చె నత్తరి
సిరులమించినయట్టి శ్రీజయంతినాఁడు.
||శిష్ట||
గోవిందుఁడు వసుదేవుకొడుకైనయప్పుడే
గోవులు రంకెలు వేసె గొల్లపల్లెను
నోవితోడఁ గంసునికి నూరునిండెఁ జూడఁగానె
చేపలుమీరినయట్టి శ్రీజయంతినాఁడు
||శిష్ట||
నారాయణుఁడు భువి నరుఁడు దాఁ గాఁగానే
మేరఁ బాండవు లెచ్చిరి మేనవావిని
కౌరవులపని దీరె కమ్మి శ్రీవేంకటేశుఁడు
చేరువనే మెరయఁగ శ్రీజయంతినాఁడు.
||శిష్ట||
అవతారిక:
ఒకానొక శ్రీకృష్ణ జయంతి సందర్భంగా అన్నమాచార్యులవారు వినిపించిన కీర్తననాలకించండి. “శిష్టరక్షణమును, దుష్టశిక్షణమును భగవంతుడు శ్రీజయంతినాడు ఒకే సమయంలో సృష్టించె” అంటున్నారు. మునులను రక్షించాడు, దానవులను భక్షించాడు. గోవులను మేపాడు, కంసుని వేపాడు. పాండవులు యెచ్చిరి, కౌరవుల పనిదీరె అని కృష్ణావతారవైశిష్ట్యాన్ని కీర్తిస్తున్నారు. శ్రీవేంకటేశుడు కూడా ఆయన చేరువనే మెరసినాడట. గతంలో ఇటువంటి కీర్తనలు చూచినా దేని మాధుర్యం దానిదే.
భావ వివరణ:
ఓ భక్తులారా! ఈ శ్రీజయంతినాడు (శ్రీకృష్ణాష్టమినాడు) ఆ భగవంతుడు, శిష్టరక్షణము (మంచివారిని రక్షించుట), దుష్టనిగ్రహము (చెడ్డవారిని నిరోధించుట) ఒక్కవేళనే (ఒకే సమయంలో) సృష్టించెన్ (సిద్ధింపజేశాడు).
శ్రీహరి కృష్ణావతారమును పొందినప్పుడు పరమ మునీంద్రులకు అందరికీ దానవుల భయము వుడిగెను (అణగిపోయినది). తెరలి (కలతపడిన) దైత్యుల గుండెలు, అత్తరి (అప్పుడు) దిగులుచొచ్చె (దిగులుతో దిగాలుపడ్డాయి). ఈ శ్రీజయంతి సిరులుమించిన (వైభవములతిశయించిన) పండుగ అవటంచేత ఈనాడు అంతా జయమే.
ఆ గోవింద వసుదేవుని కొడుకైనప్పుడే కొడుకైనప్పుడే గొల్లపల్లెను (గోకులమునందున్న) గోవులన్నీ సంతోషంతో రంకె వేసినవి. ఎందుకంటే వాటికి భగవంతుడు తమ మూపురాలను ప్రేమగా నిమరటానికి రాబోతున్నాడని తెలిసిపోయింది. అక్కడ మధురలో కంసునికి నోవితోడ (వేదనతో) చూడగానే (యోగమాయ హెచ్చరిక విని జరిగింది చూడగా) భయంతో నూరునిండె (నూరేళ్ళు నిండాయి). ఈ శ్రీజయంతినాడు చేవలు మీరినయట్టి (అందరికీ ధైర్యంకలిగినట్టి ఈరోజున) కంసాదులకు కన్నీళ్ళొచ్చాయి.
నారాయణుడు భువిపై తాన్ నరుడు కాగానే (అవగానే మేం (క్రమముగా) మేనవావిని (మేనరికపు బంధుత్వమునందు) పాండవులు యెచ్చిరి (బలోపేతులయ్యారు). కౌరవులు (దుష్టరాజసమూహంగల కురుసేన) పనిదీరె (పనిముగిసినది). ఈ శ్రీజయంతినాడు ఆ కృష్ణలీల సంకేతముగా, శ్రీవేంకటేశుడు ఈ తిరుమల శిఖరాలపై కమ్మి మెరయగా (వ్యాపించి మెరిసిపోగా) చేరువనే (ఇక్కడే) పండుగ పరిమళించింది.
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: