Hariyavataramitadu Annamayya In Telugu – హరియవతారమితడు అన్నమయ్య

ఈ పోస్ట్ లో హరియవతారమితడు అన్నమయ్య కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

హరియవతారమితడు అన్నమయ్య – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన: హరియవతారమితడు అన్నమయ్య
సంఖ్య : 100
పుట:67
రాగం: శ్రీరాగం

శ్రీరాగం

80 హరియవతార మీతఁడు అన్నమయ్య
అరయ మాగురుఁ డీతఁ డన్నమయ్య

||పల్లవి||

వైకుంఠనాథునివద్ద వడిఁ బాడుచున్న వాఁడు
ఆకరమై తాళ్లపాక అన్నమయ్య
ఆకశపు విష్ణుపాదమందు నిత్యమై వున్నవాఁడు
ఆకడీకడఁ దాళ్లపాక అన్నమయ్య

||హరి||

క్షీరాబ్ధిశాయి నిట్టే సేవింపుచు నున్నవాఁడు
ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య
ధీరుఁడై సూర్యమండలతేజమువద్ద నున్నవాఁడు
ఆ రీతులఁ దాళ్లపాక అన్నమయ్య

||హరి||

యీవల సంసారలీల యిందిరేశుతో నున్నవాఁడు
ఆవటించి తాళ్లపాక అన్నమయ్య
భావింప శ్రీవేంకటేశుపాదములందె వున్నవాఁడు
ఆ (హా)వ భావమై తాళ్లపాక అన్నమయ్య

||హరి||100

అవతారిక:

తాళ్లపాక పెదతిరుమలాచార్యులవారు తన తండ్రి అన్నమాచార్యులవారిని కీర్తిస్తూ చెప్పిన కర్ణపేయమైన కీర్తననాస్వాదించండి. అన్నమయ్య శ్రీహరి అవతారమని చెబుతున్నారు. తన గురువు కూడా అన్నమయ్యయేనంటున్నారు. వైకుంఠవాసమునొందిన తనతండ్రి నిత్యమూ క్షీరాబ్ధిశయనుని సేవించుటలో ఆరితేరియున్నాడట. శ్రీవేంకటేశ్వరుని పాదముల చెంత తన హావభావములను ప్రకటిస్తూ అన్నమయ్య నేటికీ వున్నాడట.

భావ వివరణ:

ఈ అన్నమయ్య స్వయముగా శ్రీహరి అవతారమే. ఈయనే మాకు జన్మనిచ్చి శ్రీహరి భక్తియు నొసగిన గురుపుంగవులు.

వైకుంఠనాథునివద్ద ఆకరమై (స్థానమును పొందిన వాడై) ఈ తాళ్ళపాక అన్నమాచార్యులవారు వడి (వేగముగా) హరిని కీర్తించుచు పాడుచున్నారు. ఆకాశవీధిలో విష్ణుని పాదపద్మముల చెంత ఈయన నిత్యమై (శాశ్వతుడై) వున్నాడు. ఈ తాళ్ళపాక అన్నమయ్య ఆకడ (ఆ వైకుంఠసీమలోను) ఈ కడ (తిరుమల శిఖరాలచెంతను) హరి సేవలోనే గడుపుతున్నారు.

ఆరితేరిన (నిష్ణాతులైన) ఈ తాళ్ళపాక అన్నమయ్య, క్షీరసాగరశయనుడైన శ్రీహరిని ఇట్టే సేవింపుచూ వున్నవాడు. అదే ఆయనకు నిత్యకృత్యమైనది. సూర్యమండలపు దివ్యతేజస్సుతో వెలుగులు జిమ్మే చోట అన్నమయ్య ధీరుడై తేజో మూర్తియైయున్నాడు.

ఈవల (ఈ కలియుగంలో) సంసారలీల ప్రకారం ఇందిరానాథునితో ఈ తాళ్ళపాక అన్నమయ్య ఆవటించి (పొందికతో) యున్నవాడు. భావించిచూడగా శ్రీవేంకటేశ్వరుని పాదపద్మముల చెంతనే తన హావభావములను ప్రకటించుచు తేజోరూపుడై ఈ అన్నమాచార్యులవారు హరిసేవలో వున్నారు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment