Atani Nammale Ralpamatulu Bhuvi In Telugu – అతని నమ్మలే రల్పమతులు భువి

ఈ పోస్ట్ లో అతని నమ్మలే రల్పమతులు భువి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అతని నమ్మలే రల్పమతులు భువి – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన: అతని నమ్మలే రల్పమతులు భువి
సంఖ్య : 533
పుట: 358
రాగం: వసంతవరాళి

వసంతవరాళి

79 అతని నమ్మలే రల్పమతులు భువి
నతఁ డాద్యుఁడు పరమాత్ముఁడు

||పల్లవి||

సకలలోకపతి సర్వేశ్వరుఁడట
వొకఁడిఁక దొర మరి వున్నాఁడా
ప్రకటించఁగ శ్రీపతియే దాతట
వెకలి నియ్యఁ గొన వేరేకలరా.

||అత||

దివిజవందితుఁడు దిక్కుల హరియట
యివల మొక్క సురలిఁక వేరీ
కవ నంతర్యామి కరుణాకరుఁడట
వివిధభంగులను వెదకఁగనేలా.

||అత||

వేదాంగుఁడు శ్రీవేంకటపతియట
ఆదిమతము లిఁక నరసేదా
యేదెస నెవ్వరి కెప్పుడుఁ గలఁ డితఁ-
డీదేవుఁడె మన కిహపర మొసఁగ.

||అత||533

అవతారిక:

శ్రీహరి పరమాత్మ, ఆదిదేవుడు. కొందరు అల్పమతులు. ఈ సత్యమును నమ్మలేక చెడిపోతున్నారు. సర్వలోకపతి శ్రీపతియేనని తెలియకున్నారు. అందరి దిక్కూ ఆ దివిజవంద్యుడేనని అరయలెకున్నారు. వేదాంగములచే నేర్చి భావించవలసిన శ్రీవేంకటేశ్వరుని శరణని ఇహపరములను సాధించలేకున్నారు. కనుక మొదటి మెట్టు నమ్మం, చివరిమెట్టు శరణాగతి మధ్యలో అన్నీ నమ్మకాన్ని సడలించే జారుడుమెట్లే. కానీ భయపడకండి… కరివరదుని శరణని పరమునెరిగే దారి నరయండి.

భావ వివరణ:

భువిని (ఈభూమిమీద) అల్పమతులు (తెలివితక్కువవారు) ఆతని (ఆ శ్రీహరిని) నమ్మలేరు, (లేనేలేడంటారు). నిజమేమిటంటే అతడు ఆద్యుడు (అన్నిటికి ఆదియైనవాడు), పరమాత్ముడు.

ఆయన సకలలోకపతి, సర్వేశ్వరుడూ అతడేనట. ప్రకటించగ (వెల్లడిజేయగా) మరి దొర (మరివేరొక అధిపతి) వొకడిక (ఇంకావొకడు) వున్నాడా? శ్రీపతి యొక్కడే దాతట. వెకవినియ్యగా (ప్రత్యక్షమీయగ వేరొకరు కొనన్ (చిట్టచివర) కలరా?

అన్ని దిక్కులయందును మొక్కుటకు ఆదిక్పాలకులుంటారు. ఆ దివిజులందరికీ వంద్యుడు (పూజింపదగినవాడు) శ్రీహరియే. ఇవల (ఇటువైపున) ఇంకా అన్యులైన సురలేరీ? ఆక్రమించిన అంతర్యామి యెల్లరకు హరియే. ఆయన కరుణాకరుడట. మనలోనేవుండు వానిని, వివిధ భంగులను (రకరకములైన మార్గములలో) వెదకగనేలా (వెదుకుటెందులకు?)

శ్రీవేంకటేశ్వరుడు వేదాంగుడు (వేదములే అంగములుగా గలవాడు). ఆయన శరణాగతితో నేను ఆయన నాశ్రయించితిని (విశిష్టాద్వైతినైతిని). అటువంటప్పుడు “ఆది మతములికనరసేదా? (తొల్లిటి మతములను గురించి ఆలోచించుటెందులకు?) ఏదెస నెవ్వరి కెవ్వడుగలడు? (ఏ దిక్కుయైనా ఈ లోకంలో యెవ్వరికెవరున్నారు? అందరూ మధ్యలోవచ్చి మధ్యలో పోయేవారే కదా!) మనకు ఇహము, పరమునొసగెడివాడు ఈ దేవుడే. ఇంకెవ్వరూ లేరు, వుండరు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment