ఈ పోస్ట్ లో ఇందులోననే నెవ్వరిబోలుదు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
ఇందులోననే నెవ్వరిబోలుదు – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 3
కీర్తన: ఇందులోననే నెవ్వరిబోలుదు
సంఖ్య : 581
పుట: 390
రాగం: పాడి
పాడి
78 ఇందులోన నే నెవ్వరిఁబోలుదు
అంది నీవాఁడ నేననుకొంటిఁజుమ్మీ
||పల్లవి||
జలజనాభ నీ శరణనువారలు
అల నారదసనకాదులు
కెలన మరియు నీ కింకరవర్తులు
తెలిసినబ్రహ్మాదిదేవతలు
||ఇందు||
నోరార హరి నిను నుతించువారలు
చేరువనుండేటిశేషాదులు
ధారుణిలో నీదాసాన(ను?) దాసులు
మారుతిముఖ్యులు మహామహులు
||ఇందు||
బడి నీచే ముక్తివడసినవారలు
సుడిగొనుమునిజనశుకాదులు
కడఁగిన శ్రీవేంకటపతి నీవే
తడవి నన్ను దయదలఁచుమీ
||ఇందు||581
అవతారిక:
శ్రీమన్నారాయణుని ఆశ్రయించేవారిలో మూడు రకాలవారుంటారు. నారదమహర్షివంటి శరణాగతులు, ఆదిశేషునివంటి దాసులు, శుకమహర్షివంటి జీవన్ముక్తులు. వీరందరి ఆశయం ఒకటే అయినా అవలంభించిన మార్గాలలో భిన్నత్వమున్నది. ఇందులో నేనెవ్వరి బోలుదును స్వామీ! అని ప్రశ్నిస్తున్నారు అన్నమాచార్యులవారు. నేనుమాత్రం నీవాడను అనుకొంటూనే బ్రతుకు వెళ్ళమారుస్తున్నానని అంటున్నారు. తడవి నన్ను దయచూడుము ప్రభూ! నవవిధ భక్తిలో యేదోఒక విధమున తనను కడతేర్చమని బ్రతిమిలాడుతున్నారు అన్నమాచార్యులవారు.
భావ వివరణ:
ఓ దేవదేవా! ఈ క్రిందివారిలో నేనెవ్వరి బోలియున్నానో తెలుపుము ప్రభూ! అంది (స్థిరపడి) ఇంతవరకు నేను నీవాడనే అని అనుకొంటున్నాను సుమా!
ఓ జలజనాభా! (పద్మనాభా) ఆనాటి నారదుడు సనకసనందనాది ఋషులు కెలన (దిక్కు) నీవే అన్నారు. వారు నీ శరణాగతులు. శరణని నిన్ను ఆశ్రయించినవారు. మరియు తెలిసిన (విఖ్యాతులైన) బ్రహ్మాదిదేవతలు నీ కింకరవర్తులు (భృత్యులు) వీరంతా ఆవిధముగా నీ శరణాగతులై నిశ్చింతగానున్నారు.
ఓ శ్రీహరీ! ఆదిశేషుడు నీ చేరువనే వుండి నీకు పానుపువలె సేవించుచు, నోరార (వేయినోళ్ళతో) నిన్ను కీర్తించుచు నీవాడైనాడు. మారుతి (ఆంజనేయుడు) మొదలైన మహామహులు ఈ ధారుణిలో (భూమిపై) నీదాస్యమును తరించే మార్గముగా నెంచుకొన్నారు. వారంతా నీ దాసానుదాసులుగావుండి నీ భక్తులకు యెన్నో వుపకారాలు చేస్తున్నారు.
ఓ పరమపురుషా! శుకమహర్షి, భారతము వ్రాసిన తన తండ్రి వ్యాసునివలె, తను కూడా భాగవతము వినిపించి బడి (శీఘ్రముగా) నీచే ముక్తిని బడసినాడు. వారంతా సుడిగొను (చుట్టుకొని) నీవద్దనే వుండే జీవన్ముక్తులు. ఓ శ్రీవేంకటేశ్వరా! నీవే నన్ను కడగి (యత్నించి) తడవి (గ్రహించి) దయదలచవయ్యా! ఎందుకంటే నేను నీవాడను తండ్రీ!
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: