ఈ పోస్ట్ లో దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 2
కీర్తన: దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ
సంఖ్య: 518
పుట: 348
రాగం: నాట
నాట
71 దొరతనములతోడ తొడపై శ్రీసతితోడ
కేరలీఁ బంతముల సుగ్రీవనారసింహము.
||పల్లవి||
నిక్కినకర్ణములతో నిట్ట చూపుగుడ్లతో
మిక్కుటమైన పెద్దమీసాలతోడ
వెక్కసపునోరితోడ వెలయుబుగ్గలతోడ
క్రిక్కిరిసీ నవ్వుల సుగ్రీవనారసింహము.
||దొర||
చల్లునూరుపులతోడ సంకుఁజక్రములతోడ
మొల్ల మైనసహస్రకరములతోడ
తెల్లనిమేనితోడ దిండైనపిరుఁదుతోడ
కెల్లరేఁగీఁ గరుణ సుగ్రీవనారసింమము.
||దొర||
విరులపాదాలతోడ వెలయుసొమ్ములతోడ
తిరమైనకోటిసూర్యతేజముతోడ
విరులదండలతోడ వేడుక శ్రీవేంకట
గిరిమీఁద వెలసె సుగ్రీవనారసింహము.
||దొర||
అవతారిక:
సహజత్వం వుట్టిపడేలా వర్ణనలు కీర్తనలో జొప్పించటం అన్నమాచార్యుల వారికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన నరసింహుని వర్ణిస్తుంటే మనకళ్ళయెదుట ఆ స్వామి నిలుచున్నట్లే వుంటుంది. “దొరతనంతోడ, తొడపై శ్రీసతితోడ ఈ సుగ్రీవనరసింహుడు పంతములకేరలీ” అంటున్నారు. ఈయన కంఠము సుగ్రీవమట. అందంగావున్న కంఠస్వరం అన్నమాట. ఈయన పాదాలు పువ్వుల్లా వున్నాయట. వేంకటగిరి మీదనున్న సుగ్రీవనరసింహుని కీర్తించండి అంటున్నారు.
భావ వివరణ:
దొరతనముతోడ (సర్వేశ్వరుని ఠీవితో) తనతొడపై శ్రీదేవితో ఈ సుగ్రీవనారసింహుడు (చక్కటి కంఠధ్వనిగల నరసింహుడు), కేరడి పంతములవాడు (మిక్కుటమైన పట్టుదలగలవాడు).
ఈయన యెలావున్నాడో చూడండి. ఇతను నిక్కిన కర్ణములతో (నిక్కపొడుచుకొనిన చెవులతో) నిట్టచూపుగుడ్లతో (మిడిగుడ్లతో). దట్టమైన పెద్ద మీసాలతో, వెక్కసపు (భీతినిగొలుపు) నోటితోను, వెలయు (మెరయుచున్న) బుగ్గలతోను, క్రిక్కిరిసిన నవ్వులతోనూ (దట్టమైన నవ్వులు చిందించుచూ) ఈ సుగ్రీవ నారసింహుడు దర్శనమొసగుచున్నాడు.
ఈయన చల్లునూరుపులతో వున్నాడు. (వెలువడునప్పుడు విస్తరించుచున్న నిశ్వాసములతో వున్నాడు.) వున్నాడు.) ఈ చతుర్భుజుని, రెండుచేతులలో శంఖచక్రములన్నవి. అధికముగ వేయి కరములతో ఈ స్వామి వెలసియున్నాడు. ఈయన తెల్లని మేనితో (దేహంతో) దిండ్లవంటి పిరుదులతోనున్నాడు. ఈయన కెల్లురేగిన (పెల్లుబికిన) కరుణ మూర్తీభవించినట్లున్నాడు. ఈ సుగ్రీవనారసింహుని చూచి తరించండి.
ఈ దేవదేవుడు విరులవంటి (పుష్పములవలె సున్నితమైన) పాదములను కలిగియున్నాడు. విరివిగానున్న సొమ్ములు (ఆభరణములతోనున్నాడు). తిరమైన (స్థిరమైన) కోటి సూర్యులకాంతితో వెలుగొందుచున్నాడు. మెడలో ఈ స్వామి అనేక పుష్పహారములను ధరించియున్నాడు. వింతగా ఈ సుగ్రీవనారసింహుడు వేడుకతో శ్రీ వేంకటగిరిమీద వేంకటేశ్వరుడై వెలసియున్నాడు. ఈ స్వామిని చూచి భక్తితో మొక్కండి.
మరిన్ని అన్నమయ్య కీర్తనలు: