Vovo Raakaasulaala Voddu Sundi Vairamu In Telugu – వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము

ఈ పోస్ట్ లో వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 15
కీర్తన: వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము
సంఖ్య : 140
పుట: 93
రాగం: గౌళ

గౌళ

69 వోవో రాకాసులాల వొద్దు సుండి వైరము
దేవుని శరణనరో తెలుసుకోరో

||పల్లవి||

జగములో రాముఁడై జనియించే విష్ణుఁ డిదె
అగపడి లక్ష్మి సీత యయి పుట్టెను
తగు శేషశంకచక్ర దైవసాధనము లెల్ల
తగిలి లక్ష్మణ భరత శత్రుఘ్నులయిరి

||వోవో||

సురలు వానరు లైరి సూర్యుఁడు సుగ్రీవుఁడు
మరిగి రుద్రుఁడు హనుమంతుఁడాయెను
సరుస బ్రహ్మదేవుఁడు జాంబవంతుఁడైనాఁడు
వెరవరి నలుఁడే విశ్వకర్మ నుండి

||వోవో||

కట్టిరి సేతు వప్పుడే ఘను లెల్లా దాఁటిరి
ముట్టిరి లంకా నగరమును దళము
అట్టి శ్రీవేంకటేశుఁ డాతఁడే యీతఁడై
వొట్టుచు వరము లిచ్చె వొనర దాసులకు

||వోవో||

అవతారిక:

పెదతిరుమలాచార్యులవారు చెప్పిన ఈ కీర్తనలో రాక్షస స్వభావం కలిగినవారిని హెచ్చరిస్తున్నారు. ఒరే రాకాసుల్లారా! మీకు మాతో వైరము వద్దురా. మేము ఈ ఏడుకొండలవాడిని శరణని హాయిగా వున్నవాళ్ళం. మీరూ అదేపని చేయండి. ఆ నాడు త్రేతాయుగంలో మీ రావణాసురుని చంపటానికి ఆ విష్ణువు తన పరివారంతో సహా భూమ్మీద అవతరించి మిమ్మల్నందరినీ మట్టికరిపించాడు. దుష్ట శిక్షణాకార్యక్రమం పూర్తిచేసికొని నేడు తన శరణాగతులకు అంతులేని వరములనిస్తున్నాడు. మీరంతా మీ ప్రవర్తన మార్చుకోండిరా! అంటున్నారు.

భావ వివరణ:

ఓరోరీ! రాక్షసులారా! సన్మార్గులతో వైరము (శతృత్వం) వద్దు సుండీ (సుమా!) ఈ శ్రీవేంకటేశ్వరుడే దేవుడు (భగవంతుడు). ఈ సంగతి తెలుసుకోండిరా! ఈ దేవదేవుని శరణు అనండిరా!

(ఈయనే ఆదిదేవుడైన శ్రీమహావిష్ణువు. రావణుడు నరులను వానరులను తన కాలిగోటికి సరిరారని భావించి, బ్రహ్మను వరములడిగేటప్పుడు దేవ, దానవ, యక్ష, కిన్నెర, కింపురుష మొదలైన వారితో తనకు మృత్యువు రాకూడదన్నాడు. వాడిని చంపటానికి విష్ణువు తన పరివారంతో సహా భూమిపై నర వానరులుగా తల్లి కడుపులద్వారా పుట్టి వాడిని నిర్జించాడు. వాళ్ళంతా యెవరెవరు యెలా పుట్టారో తెలుసుకొని ఆనందించండి.)

ఆ శ్రీమహావిష్ణువు భూమిపై రామునిగా జన్మించాడు. అగపడి (తానూ సిద్ధమై) లక్ష్మీదేవి సీతయై పుట్టింది. ఆయన పరివారమైన ఆదిశేషుడు, సుదర్శన చక్రము, పాంచజన్య శంఖమూ ఆ రాముని సోదరులు లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నులవలె జన్మించారు.

ఆ శ్రీహరి పరివారమంతా రాముని పరివారంగా యెలా వానరజన్మలెత్తారో తెలిసి ఆనందించండి. సూర్యుడే సుగ్రీవునిగా అవతరించాడు. రుద్రుడు (శంకరుడు) మహా బుద్ధిమంతుడైన హనుమతుడయ్యాడు. బ్రహ్మదేవుడు భల్లూకపతియైన జాంబవంతునివలె అవతరించాడు. వారధిని నిర్మించిన నలుడే దేవశిల్పి విశ్వకర్మ సుమా!

ఆ తరువాత కథ మీ అందరికీ తెలిసిందే కదా! వారంతా రావణ వధ కోసం ఘనులై అప్పుడే సేతువును కట్టి, దాటి, లంకానగరమును ముట్టిరి (ముట్టడించిరి). ఆ తిరుమల శ్రీవేంకటేశ్వరుడె ఈనాడు, ఇక్కడ శ్రీరామచంద్ర మూర్తిగా వెలసి ఒనర (ఒప్పునట్లుగా) తనదాసులకు ఒట్టుచు (శపధముతో) అనేక వరములిస్తున్నాడు. రాండర్రా! మీరు వచ్చి ఈయనను ఆశ్రయించండి.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Leave a Comment