Samamatinani Nive Catuduvu In Telugu- సమమతినని నీవే చాటుదువు

ఈ పోస్ట్ లో సమమతినని నీవే చాటుదువు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

సమమతినని నీవే చాటుదువు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 4
కీర్తన : సమమతినని నీవే చాటుదువు
సంఖ్య : 366
పుట : 246
రాగం: వరాళి

వరాళి

95 సమమతినని నీవే చాటుదువు
రమణ నేరుపునేరము నెవ్వరివి

||పల్లవి||

రావణాదులైన రాక్షససమితిలో
నీవే దేవతలలో నీవేకావా
భావింప నసురలు పగ నీకు నేలైరి
యీవల సురులెల్ల (లేల?) హితులైరి

||సమ||

సకలజంతువులకుఁ జైతన్యుఁడవు నీవే
వొకరు నీకుపకారమొనరించేరా
అకట కొందరిఁ బాపాత్ములఁగాఁ జేసి
వెకలిఁ గొందరిఁ బుణ్యవిధులఁ జేసితివి

||సమ||

అటుగాన ఇట్టాయ నట్టాయనననేల
యిటు నీచిత్తముకొలఁ దింతేకాక
గటియించి శ్రీవేంకటపతి నీదాసు
లిటువలె ఘనులై రిదివో నీకృపను

||సమ||366

అవతారిక:

ఆ దేవదేవుడే మనందరి తండ్రి. రాక్షసులైన, దేవతలైన, మనబోటి నరులైనా, జంతుజాలములైనా, క్రిమికీటకములైన ఆయనబిడ్డలే. కాని వీరందరి బ్రతుకు ఒక్కలాగున లేవు. కొందరు సుఖిస్తుంటే కొందరు దు:ఖిస్తున్నారు. ఆయన కొందరికి మేలు చేస్తున్నట్లు కొందరిని శిక్షిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆయనకు ‘సమమతి’ (సమానంగా చూచే బుద్ధి) లేదేమో అనిపిస్తుంది. అన్నమాచార్యులవారు ఈ కీర్తనలో ‘నీవే సమమతినని చాటుకొంటావు. రమణ నేరుపులెవ్వరివి, నేరములెవ్వరివి? నీకు దేవతలు చేసిన మంచేమిటి, రాక్షసులు చేసిన చెడేమిటి? వాళ్ళనెందుకు రక్షించావు, వీళ్ళనెందుకు శిక్షించావు? అంతా నీ చిత్తము మా ప్రాప్తము అంటున్నారు.

భావ వివరణ:

ప్రభూ! నీవే సమమతివని (పక్షపాతములేక అందరినీ సమానముగా చూచే బుద్ధికలవాడినని) చాటుకొంటావు. అట్లయినచో, రమణ నేరుపులెవరివి (ఆ చక్కని నేర్పుగల పనులు యెవరికి దక్కుతున్నవి) మరియు నేరములెవ్వారివి (చెడ్డపనులు యెవరికి దక్కుతున్నవి?)

రావణుడు మొదలైన రాక్షసులలో ఆత్మరూపుడవై వున్నదెవరు? నీవేకదా! దేవతలలో వున్నదీ నీవే కాదా? మరి భావించుటకు నీకు, అసురులు పగవారెందుకయ్యారు? మరి ఇటు చూస్తే సురులు నీకు యెట్లు హితులు అయ్యారు, ఇంతా చేసి ఇద్దరూ నీ సంతానమే కదా! ఎందుకు దేవతల్ని రక్షిస్తున్నావు, రాక్షసులనెందుకు భక్షిస్తున్నావు?

జంతువులన్నింటిలోనూ వున్న చైతన్య పదార్థాం ఒక్కటే. దాన్నే ప్రాణము అంటారు కొందరు. అది నీవే కదా! అటువంటప్పుడు ఒకరు నీకు ఉపకారమొనరించిరా అకట (అయ్యో!) కొందరిని పాపాత్ములను చేసినావే? వెకలి (ఆసక్తితో) కొందరిని పుణ్యవిధులు చేసే వారిగ నొనరించితివే? ఎందుకీ బేధ భావము నీకు కలుగుతున్నది? | ఒకర్మించేమిటి, ఇంకొకరి చెడేమిటి?

దీనికి కొందరు విధి అని పేరుపెట్టి, కర్మ అనే ఒక సిద్ధాంతం తీసికొనివచ్చి, అందుకని ఇట్లా అయింది. ఇందుకని అట్లా అయింది అని యేవేవో కారణాలు చెబుతారు. అసలేమిటంటే అంతా నీ చిత్తము మా ప్రాప్తము అంతేకాక ఇంకేమిటి? అవునా? ఓ శ్రీవేంకటేశ్వరా! ఏది ఏమైనా నీ దాసులు మాత్రం నీ కృపవల్ల ఘనులయ్యారు తండ్రీ! నీవు గటియించినచో (తలచుకొంటే) మేము తప్పక ఘనులమవుతాము.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Leave a Comment