ఈ పోస్ట్ లో శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.
శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి – అన్నమయ్య కీర్తనలు
సంపుటి: 15
కీర్తన: శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి
సంఖ్య : 169
పుట : 112
రాగం: బౌళి
బౌళి
49 శంకమ నీవు సాక్షి చక్రమ నీవు సాక్షి
వంకలాడ భుజముల వ్రాసుకొంటి మిమ్మును
॥పల్లవి||
నారాయణా యని యిట్టె నరకములు తరించితి
శ్రీరామా అని పొందితి జీవన్ముక్తి
దూరించి గోవిందా యని తోలితి పాపము లెల్ల
ధీరుఁడనై వళుకెల్ల తిద్దుకొంటి నిదిగో
||శంకమ||
దామోదరా అని తొల్లి దాటితి దు:ఖము లెల్ల
వామనా అని కర్మములు వంగఁ దొక్కితి
భూమిరమణా యని పుట్టుగులు గెలిచితి
వేమరు నితరులకు వెరవ నే నింకను
||శంకమ||
హరి యచ్చుతా యని ఆపదల నణఁచితి
పురుషోత్తమా యని పుణ్యము లెల్లా మీఱితి
అరుదైనా శ్రీవేంకటేశ యని లోకముల మించితి
తొరలి సంసారపుదూరు చక్కఁబెట్టితి
||శంకమ||
అవతారిక:
“వంకలాడ” అంటే వంకరలు దిద్దగా అని అర్థం. అన్నమాచార్యులవారు ఈ కీర్తనలో తన భుజములపై వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ముద్రింపజేసికొన్న శంఖ చక్రముద్రలతో “మిమ్మల్ని సాక్షులుగా నాభుజములపై వ్రాయించుకొంటిని” అంటున్నారు. ఎట్లా వ్రాయించుకొన్నారంటే “వంకలాడ” వ్రాయించుకొన్నారట. ఆపైన, విష్ణునామ సంకీర్తన మధురాతి మధురంగా చేస్తున్నారు. ఆశ్రీహరి నామ సంకీర్తన “తొరలి సంసారపు దూరు చక్కబెడుతుందట. కీర్తన పాడినవారికి విష్ణునామ పారాయణ పుణ్యం దక్కుతుందని విడిగా చెప్పనక్కరలేదు కదా! అన్నట్లు వళుకు – అంటే తగవు అని అర్థం.
భావ వివరణ:
ఓ శంకమా (పాంచజన్య శంఖమా!) నీవే మాకు సాఓఇ. ఓ చక్రమా! (సుదర్శన చక్రమా!) నీవే మాకు సాక్షి. నేను విష్ణువునకు చెందిన వాడనని మిమ్మును (మిమ్మల్ని) నా భుజములపై వంకలాడ (వంకరలు దిద్దగా) వ్రాయించుకొంటి (కాల్చి వాతలవలె ముద్రింపజేయించుకొంటిని). కనుక మీరే నాకు చెఱపలేని సాక్ష్యము.
నేను మా ఆచార్యుల కృప జేత వైష్ణవుడనై ఎట్లా తరించానో చెప్తాను వినండి. నేను “నారాయణ” అని యెలుగెత్తి అనగానే నరకద్వారములను దాటి నాను. శ్రీరామా అని చెప్పగానే జీవన్ముక్తిని పొందాను. దూరించి (ఉద్యుక్తుడనై గోవిందా గోవిందా అని గొంతెత్తి యని నేను చేసి కొనిన అశేష పాపాలను తోలివేశాను. ఇదివో నేను ఆ విధంగా ధీరుడనై (విద్వాంసుడనై) వళుకెల్లా (మత్సరమునంతా) దిద్దుకొంటి సవరించుకొంటిని.
దామోదరా అని తనివిదీరా పలికి, నా తొల్లిటి (ఇదివరకు నాకున్న) దు:ఖములను తొలగించుకొంటిని. వేమనా అనే విష్ణు నామమును పలికి నేను చేసిన కర్మల వంగదొక్కితి (అణగద్రొక్కితిని). భూరమణా అనే నామము చెప్పి పురుగులు (జన్మల చక్రవ్యూహమును) గెలిచితిని. నేను ఇక ఇతరములకు (మానవమాత్రులైన అధిపులకు) వేమరు వెరవను (ప్రతిదానికీ భయపడను).
“హరి అచ్యుతా” అనే నామోచ్ఛరణతో నేను నా ఆపదలనన్నింటినీ అణచివేశాను. పురుషోత్తమా అ పుణ్యముల నెల్లా మీఱితి (అతిశయించితిని). శ్రీహరి నామాలలో అరుదైన నామము శ్రీ వేంకటేశ. ఆ నామము నిరంతరం నా నాలికపై నుండగా లోకముల మించితి (సర్వశ్రేష్ఠుడనైతిని) తొరలి (ఈమారు) సంసారపు దూఱు (ప్రాపంచిక లంపటములను) చక్కబెట్టితి (సరిజేసుకొంటిని). ఇది నా ఘనత కాదు తండ్రీ! నీ అపారమైన కరుణయే కారణము.
మరిన్ని అన్నమయ్య కీర్తనలు
- తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము
- అంజినీదేవి కొడుకు హనుమంతుడు
- అప్పడైన హరియెక్కె నదివో తేరు
- అడియా నడియనయ్య యఖిలలోకైకనాథ
- చేకొని కొలువరో శ్రీనరసింహము
- రామకృష్ణ నీవు నందే రాజ్యమేలుచుండుదువు
- ఆదివిష్ణు వీతఁడే యటరమ్మా
- కరేణ కిం మాం గృహీతుం తే
- చిఱునవ్వు మెఱుఁగారు సిగ్గుల మోముతోడ