కిష్కింధాకాండ చతుర్వింశః సర్గంలో, సుగ్రీవుడు రాముని దయతో కిష్కింధా పట్టణాన్ని తిరిగి పొందతాడు. సుగ్రీవుని పట్టాభిషేకం ఘనంగా జరుగుతుంది. సుగ్రీవుడు రాజు అవడంతో వానరులు ఆనందంగా ఉంటారు. వాలి భార్య తార సంతాపంతో రాముని వద్దకు వెళ్లి వాలి పాపాలు క్షమించాలని కోరుతుంది. రాముడు ఆమెకు సాంత్వన చెప్పి వాలి అర్హతను గుర్తించి, సుగ్రీవుడు మంచి రాజుగా ఉంటాడని హామీ ఇస్తాడు. సుగ్రీవుడు రాజ్యపాలనలో న్యాయం, ధర్మం పాటించడానికి రాముని ఆశీర్వాదం తీసుకుంటాడు. రాముడు సీతను రాక్షసుల చెరనుండి విముక్తం చేసేందుకు సుగ్రీవుని సహాయంపై ఆధారపడి, తన ప్రయత్నాలను కొనసాగించడానికి సిద్ధమవుతాడు.
సుగ్రీవతారాశ్వాసనమ్
తాం చాశ్రువేగేన దురాసదేన
త్వభిప్లుతాం శోకమహార్ణవేన |
పశ్యంస్తదా వాల్యనుజస్తరస్వీ
భ్రాతుర్వధేనాప్రతిమేన తేపే || ౧ ||
స బాష్పపూర్ణేన ముఖేన వీక్ష్య
క్షణేన నిర్విణ్ణమనా మనస్వీ |
జగామ రామస్య శనైః సమీపం
భృత్యైర్వృతః సంపరిదూయమానః || ౨ ||
స తం సమాసాద్య గృహీతచాప-
-ముదాత్తమాశీవిషతుల్యబాణమ్ |
యశస్వినం లక్షణలక్షితాంగ-
-మవస్థితం రాఘవమిత్యువాచ || ౩ ||
యథాప్రతిజ్ఞాతమిదం నరేంద్ర
కృతం త్వయా దృష్టఫలం చ కర్మ |
మమాద్య భోగేషు నరేంద్రపుత్ర
మనో నివృత్తం సహ జీవితేన || ౪ ||
అస్యాం మహిష్యాం తు భృశం రుదంత్యాం
పురే చ విక్రోశతి దుఃఖతప్తే |
హతేఽగ్రజే సంశయితేఽంగదే చ
న రామరాజ్యే రమతే మనో మే || ౫ ||
క్రోధాదమర్షాదతివిప్రధర్షా-
-ద్భ్రాతుర్వధో మేఽనుమతః పురస్తాత్ |
హతే త్విదానీం హరియూథపేఽస్మిన్
సుతీవ్రమిక్ష్వాకుకుమార తప్స్యే || ౬ ||
శ్రేయోఽద్య మన్యే మమ శైలముఖ్యే
తస్మిన్నివాసశ్చిరమృశ్యమూకే |
యథా తథా వర్తయతః స్వవృత్త్యా
నేమం నిహత్య త్రిదివస్య లాభః || ౭ ||
న త్వాం జిఘాంసామి చరేతి యన్మా-
-మయం మహాత్మా మతిమానువాచ |
తస్యైవ తద్రామ వచోఽనురూప-
-మిదం పునః కర్మ చ మేఽనురూపమ్ || ౮ ||
భ్రాతా కథం నామ మహాగుణస్య
భ్రాతుర్వధం రాఘవ రోచయేత |
రాజ్యస్య దుఃఖస్య చ వీర సారం
న చింతయన్ కామపురస్కృతః సన్ || ౯ ||
వధో హి మే మతో నాసీత్స్వమాహాత్మ్యవ్యతిక్రమాత్ |
మమాసీద్బుద్ధిదౌరాత్మ్యాత్ప్రాణహారీ వ్యతిక్రమః || ౧౦ ||
ద్రుమశాఖావభగ్నోఽహం ముహూర్తం పరినిష్ఠనన్ |
సాంత్వయిత్వా త్వనేనోక్తో న పునః కర్తుమర్హసి || ౧౧ ||
భ్రాతృత్వమార్యభావశ్చ ధర్మశ్చానేన రక్షితః |
మయా క్రోధశ్చ కామశ్చ కపిత్వం చ ప్రదర్శితమ్ || ౧౨ ||
అచింతనీయం పరివర్జనీయ-
-మనీప్సనీయం స్వనవేక్షణీయమ్ |
ప్రాప్తోఽస్మి పాప్మానమిమం నరేంద్ర
భ్రాతుర్వధాత్త్వాష్ట్రవధాదివేంద్రః || ౧౩ ||
పాప్మానమింద్రస్య మహీ జలం చ
వృక్షాశ్చ కామం జగృహుః స్త్రియశ్చ |
కో నామ పాప్మానమిమం క్షమేత
శాఖామృగస్య ప్రతిపత్తుమిచ్ఛన్ || ౧౪ ||
నార్హామి సమ్మానమిమం ప్రజానాం
న యౌవరాజ్యం కుత ఏవ రాజ్యమ్ |
అధర్మయుక్తం కులనాశయుక్త-
-మేవంవిధం రాఘవ కర్మ కృత్వా || ౧౫ ||
పాపస్య కర్తాఽస్మి విగర్హితస్య
క్షుద్రస్య లోకాపకృతస్య చైవ |
శోకో మహాన్ మామభివర్తతేఽయం
వృష్టేర్యథా నిమ్నమివాంబువేగః || ౧౬ ||
సోదర్యఘాతాఽపరగాత్రవాలః
సంతాపహస్తాక్షిశిరోవిషాణః |
ఏనోమయో మామభిహంతి హస్తీ
దృప్తో నదీకూలమివ ప్రవృద్ధః || ౧౭ ||
అంహో బతేదం నృవరావిషహ్య
నివర్తతే మే హృది సాధు వృత్తమ్ |
వివర్ణమగ్నౌ పరితప్యమానం
కిట్టం యథా రాఘవ జాతరూపమ్ || ౧౮ ||
మహాబలానాం హరియూథపానా-
-మిదం కులం రాఘవ మన్నిమిత్తమ్ |
అస్యాంగదస్యాపి చ శోకతాపా-
-దర్ధస్థితప్రాణమితీవ మన్యే || ౧౯ ||
సుతః సులభ్యః సుజనః సువశ్యః
కుతః సుపుత్రః సదృశోఽంగదేన |
న చాపి విద్యేత స వీర దేశో
యస్మిన్భవేత్ సోదరసన్నికర్షః || ౨౦ ||
యద్యంగదో వీరవరార్హ జీవే-
-జ్జీవేచ్చ మాతా పరిపాలనార్థమ్ |
వినా తు పుత్రం పరితాపదీనా
తారా న జీవేదితి నిశ్చితం మే || ౨౧ ||
సోఽహం ప్రవేక్ష్యామ్యతిదీప్తమగ్నిం
భ్రాత్రా చ పుత్రేణ చ సఖ్యమిచ్ఛన్ |
ఇమే విచేష్యంతి హరిప్రవీరాః
సీతాం నిదేశే తవ వర్తమానాః || ౨౨ ||
కృత్స్నం తు తే సేత్స్యతి కార్యమేత-
-న్మయ్యప్రతీతే మనుజేంద్రపుత్ర |
కులస్య హంతారమజీవనార్హం
రామానుజానీహి కృతాగసం మామ్ || ౨౩ ||
ఇత్యేవమార్తస్య రఘుప్రవీరః
శ్రుత్వా వచో వాల్యనుజస్య తస్య |
సంజాతబాష్పః పరవీరహంతా
రామో ముహూర్తం విమనా బభూవ || ౨౪ ||
తస్మిన్ క్షణేఽభీక్ష్ణమవేక్ష్యమాణః
క్షితిక్షమావాన్ భువనస్య గోప్తా |
రామో రుదంతీం వ్యసనే నిమగ్నాం
సముత్సుకః సోఽథ దదర్శ తారామ్ || ౨౫ ||
తాం చారునేత్రాం కపిసింహనాథం
పతిం సమాశ్లిష్య తదా శయానామ్ |
ఉత్థాపయామాసురదీనసత్త్వాం
మంత్రిప్రధానాః కపివీరపత్నీమ్ || ౨౬ ||
సా విస్ఫురంతీ పరిరభ్యమాణా
భర్తుః సకాశాదపనీయమానా |
దదర్శ రామం శరచాపపాణిం
స్వతేజసా సూర్యమివ జ్వలంతమ్ || ౨౭ ||
సుసంవృతం పార్థివలక్షణైశ్చ
తం చారునేత్రం మృగశాబనేత్రా |
అదృష్టపూర్వం పురుషప్రధాన-
-మయం స కాకుత్స్థ ఇతి ప్రజజ్ఞే || ౨౮ ||
తస్యేంద్రకల్పస్య దురాసదస్య
మహానుభావస్య సమీపమార్యా |
ఆర్తాఽతితూర్ణం వ్యసనాభిపన్నా
జగామ తారా పరివిహ్వలంతీ || ౨౯ ||
సా తం సమాసాద్య విశుద్ధసత్త్వా
శోకేన సంభ్రాంతశరీరభావా |
మనస్వినీ వాక్యమువాచ తారా
రామం రణోత్కర్షణలబ్ధలక్షమ్ || ౩౦ ||
త్వమప్రమేయశ్చ దురాసదశ్చ
జితేంద్రియశ్చోత్తమధార్మికశ్చ |
అక్షయ్యకీర్తిశ్చ విచక్షణశ్చ
క్షితిక్షమావాన్ క్షతజోపమాక్షః || ౩౧ ||
త్వమాత్తబాణాసనబాణపాణి-
-ర్మహాబలః సంహననోపపన్నః |
మనుష్యదేహాభ్యుదయం విహాయ
దివ్యేన దేహాభ్యుదయేన యుక్తః || ౩౨ ||
యేనైకబాణేన హతః ప్రియో మే
తేనేవ మాం త్వం జహి సాయకేన |
హతా గమిష్యామి సమీపమస్య
న మామృతే రామ రమేత వాలీ || ౩౩ ||
స్వర్గేఽపి పద్మామలపత్రనేత్రః
సమేత్య సంప్రేక్ష్య చ మామపశ్యన్ |
న హ్యేష ఉచ్చావచతామ్రచూడా
విచిత్రవేషాప్సరసోఽభజిష్యత్ || ౩౪ ||
స్వర్గేఽపి శోకం చ వివర్ణతాం చ
మయా వినా ప్రాప్స్యతి వీర వాలీ |
రమ్యే నగేంద్రస్య తటావకాశే
విదేహకన్యారహితో యథా త్వమ్ || ౩౫ ||
త్వం వేత్థ యావద్వనితావిహీనః
ప్రాప్నోతి దుఃఖం పురుషః కుమారః |
తత్త్వం ప్రజానన్ జహి మాం న వాలీ
దుఃఖం మమాదర్శనజం భజేత || ౩౬ ||
యచ్చాపి మన్యేత భవాన్మహాత్మా
స్త్రీఘాతదోషో న భవేత్తు మహ్యమ్ |
ఆత్మేయమస్యేతి చ మాం జహి త్వం
న స్త్రీవధః స్యాన్మనుజేంద్రపుత్ర || ౩౭ ||
శాస్త్రప్రయోగాద్వివిధాచ్చ వేదా-
-దాత్మా హ్యనన్యః పురుషస్య దారాః |
దారప్రదానాన్న హి దానమన్య-
-త్ప్రదృశ్యతే జ్ఞానవతాం హి లోకే || ౩౮ ||
త్వం చాపి మాం తస్య మమ ప్రియస్య
ప్రదాస్యసే ధర్మమవేక్ష్య వీర |
అనేన దానేన న లప్స్యసే త్వ-
-మధర్మయోగం మమ వీర ఘాతాత్ || ౩౯ ||
ఆర్తామనాథామపనీయమానా-
-మేవంవిధామర్హసి మాం నిహంతుమ్ |
అహం హి మాతంగవిలాసగామినా
ప్లవంగమానామృషభేణ ధీమతా || ౪౦ ||
వినా వరార్హోత్తమహేమమాలినా
చిరం న శక్ష్యామి నరేంద్ర జీవితుమ్ |
ఇత్యేవముక్తస్తు విభుర్మహాత్మా
తారాం సమాశ్వాస్య హితం బభాషే || ౪౧ ||
మా వీరభార్యే విమతిం కురుష్వ
లోకో హి సర్వో విహితో విధాత్రా |
తం చైవ సర్వం సుఖదుఃఖయోగం
లోకోఽబ్రవీత్తేన కృతం విధాత్రా || ౪౨ ||
త్రయో హి లోకా విహితం విధానం
నాతిక్రమాంతే వశగా హి తస్య |
ప్రీతిం పరాం ప్రాప్స్యసి తాం తథైవ
పుత్రస్తు తే ప్రాప్స్యతి యౌవరాజ్యమ్ || ౪౩ ||
ధాత్రా విధానం విహితం తథైవ
న శూరపత్న్యః పరిదేవయంతి |
ఆశ్వాసితా తేన తు రాఘవేణ
ప్రభావయుక్తేన పరంతపేన |
సా వీరపత్నీ ధ్వనతా ముఖేన
సువేషరూపా విరరామ తారా || ౪౪ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే చతుర్వింశః సర్గః || ౨౪ ||
Kishkindha Kanda Sarga 24 Meaning In Telugu
వాలి బతికి ఉన్నప్పుడు వాలి చావాలి అని కోరుకున్న సుగ్రీవుడు వాలి మృతదేహము చూడగానే దుఃఖము ఆపుకోలేక పోయాడు. రాముని వద్దకు వెళ్లి ఇలా అన్నాడు.
“రామా! మిత్రమా! ఏదో ఆవేశంలో నా అన్న వాలిని చంపమని నిన్నుకోరాను. కానీ ఇప్పుడు నా అన్న మృతదేహాన్ని ప్రత్యక్షంగా చూస్తుంటే నాకు నా జీవితమే వ్యర్ధము అనిపిస్తూ ఉంది. ఇహలోక భోగముల మీద ఆసక్తి పోయింది. కిష్కింధకు మహారాజు వాలి మరణించాడు. కిష్కింధా మహారాణి తార, భర్త దేహము మీద పడి ఏడుస్తూ ఉంది. కిష్కింధా నగరమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. అంగదుని భవిష్యత్తు ఏమిటో తెలియడం లేదు. ఇవన్నీ చూస్తుంటే నాకూ రాజ్యాభిలాష చచ్చిపోయింది.
రామా! పూర్వము వాలి నా భార్యను అపహరించి, నన్ను రాజ్యము నుండి వెళ్ల గొట్టాడని అతని మీద పట్టరానికోపం ఉండేది. కానీ ఇప్పుడు చచ్చిపడి ఉన్న వాలిని చూస్తుంటే ఆ కోపం అంతా మటుమాయం అయింది. కోపం స్థానంలో దుఃఖము ఆవరించింది. కిష్కింధలో ఉండి రాజ్యము చేసే దాని కన్నా ఇదివరకు మాదిరి ఋష్యమూక పర్వతము మీద కందమూలములు, ఫలములు ఆరగిస్తూ ప్రశాంత జీవనం గడపడం మేలు అనిపిస్తూ ఉంది. నా అన్న వాలి లేకపోయిన తరువాత నాకు స్వర్గ సుఖములు కూడా వృధా అనిపిస్తూ ఉన్నాయి.
రామా! నా అన్న వాలి నన్ను ఎన్నడూ చంపాలి అని అనుకోలేదు. “పోరా పో! ఎక్కడైనా ప్రాణాలతో బతుకు పో” అని అనేవాడు. కాని నేను నా అన్న వాలిని చంపాలని అనుకున్నాను. అది ఆయన గొప్పతనం. ఇది నా అల్పబుద్ధి.
రామా! ఎంత రాజ్యము మీద కోరిక ఉన్నా, అన్నను చంపి రాజ్యము చేయాలనే కోరిక నాకు ఏనాడూ లేదు. నా అన్న వాలి తన ఉదార బుద్ధితో నన్ను చంపడానికి ఏనాడూ ఇష్టపడలేదు. కానీ నేను నా బుద్ధి పెడతోవబెట్టి నా అన్నను చంపడానికి నిన్ను ఆశ్రయించాను. నేను తప్పు చేసినపుడు నా అన్న నన్ను చిన్న చెట్టు కొమ్మతో కొట్టి బుద్ధి చెప్పేవాడు. కాని నేను నా క్రోధముతో, వక్రబుద్ధితో, వానరస్వభావముతో నా అన్ననే చంపడానికి పూనుకున్నాను. నా అన్నను చంపి ఎనలేని పాపమును మూటకట్టుకున్నాను. ఆ పాపము ఈ జన్మలో తీరేది కాదు. జన్మజన్మలకూ నన్ను వెంటాడుతూ ఉంటుంది.
పూర్వము ఇంద్రుడు విశ్వరూపుని చంపి బ్రహ్మహత్యా పాతకము మూటగట్టుకున్నాడు. ఆ పాపమును భూమికి, జలానికి, వృక్షములకు, స్త్రీలకు, పంచి పెట్టాడు. కాని నేను నాఅన్నను చంపిన పాపమును స్వీకరించడానికి ఎవరు ఉన్నారు రామా! నేను స్వయంగా అనుభవించాలి తప్పదు.
నా అన్నను చంపి నేను అధర్మానికి ఒడిగట్టాను. లోక నిందకు పాల్పడ్డాను. నేను రాజ్యాధికారమునకు అర్హుడను కాను. నేను చేసిన పాపము ఏనుగు రూపంలో నన్ను కకావికలు చేస్తూ ఉంది. నా శరీరంలో మంచితనము మృగ్యము అయి పోయింది.
పాపం ప్రవేశించింది. తండ్రిని పోగొట్టుకొని అంగదుడు జీవించలేడు. కొడుకును పోగొట్టుకొని తార జీవించలేదు. నా అనే వాళ్లు అందరినీ పోగొట్టుకొని నేను జీవించడం ఎందుకు వృధా. నేను నా అన్న వాలితో పాటు అగ్నిలో ఆహుతి అవుతాను. ఈ వానరులు సీతను వెదకడంలో నీకు సాయపడతారు. నేను మరణించినా నీ కార్యము మాత్రం సిద్ధిస్తుంది. కులనాశమునకు కారణమైన నేను ఈ లోకంలో జీవించడం వృధా. నేను మరణించడానికి అనుమతి ఇవ్వండి.” అని రాముని ముందు దీనంగా వేడుకున్నాడు.
సుగ్రీవుని మాటలు విని రాముడు కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. రాముడు, భర్త శవం మీద పడి ఏడుస్తున్న తార వంక చూచాడు. తార తల ఎత్తి రాముని వంక చూచింది. చేతిలో ధనుర్బాణములను ధరించి ఠీవిగా నిలబడి ఉన్న సూర్యుని వంటి తేజస్సుతో వెలిగిపోతున్న రాముడిని చూచింది. తన భర్తను చంపిన రాముడు అతడే అని గుర్తించింది. తార, భర్త శవం పక్కనుండి లేచి, రాముని వద్దకు వెళ్ళింది.
“రామా! నీవు ధర్మపరుడవు. ఇంద్రియములను జయించిన వాడవు. కీర్తివంతుడవు. అమితమైన పరాక్రమ వంతుడవు. ధనుర్బాణములను ధరించిన వాడవు. నా పట్ల కూడా నీ ధర్మం నెరవేర్చు. భర్తలేనిదే భార్యకు జీవితం లేదు. ఏ బాణంతో నా భర్త ప్రాణం తీసావో అదే బాణంతో నా ప్రాణం కూడా తియ్యి. నన్ను నా భర్త వద్దకు పంపు. దయచేసి ఆ పుణ్యం కట్టుకో. ఎందుకంటే నా భర్త స్వర్గానికి పోయినా అక్కడ ఉన్న అప్సర స్త్రీల వంకచూడడు. నా కోసం ఎదురు చూస్తుంటాడు. నేను దగ్గర లేకపోతే వాలికి స్వర్గం కూడా నిస్సారంగా కనిపిస్తుంది. కాబట్టి నన్ను కూడా చంపి నా భర్త వద్దకు పంపు. నేను స్త్రీ అనీ, స్త్రీని చంపితే స్త్రీ హత్యా పాతకము చుట్టుకుంటుందని సందేహించకు. నేను కూడా వాలినే అనుకో. అప్పుడు నీకు ఆ దోషం అంటదు. ఒకసారి వివాహము అయిన తరువాత భర్త, భార్య వేరు కాదు. ఇరువురి శరీరాలు ఒకటే. ఇది వేదములలో చెప్పబడినది. కాబట్టి వేదవిహితమైన కార్యము దోషము కాదు కదా!
ఓ రామా! ఈ పెద్దలు నన్ను నా భర్తను వేరు చేస్తున్నారు. ఇది న్యాయం కాదు. నువ్వు నన్ను చంపితే నేను కూడా సత్వరమే నా భర్త వద్దకు చేరుకుంటున్నాను. నీవు ఇప్పుడు నన్ను చంపకపోయినా, వాలి లేకుండా నేను ఎక్కువ కాలము జీవించలేను. కాబట్టి నన్ను వెంటనే చంపు.” అని రాముని దీనంగా వేడుకుంది తార.
దీనాలాపనలు విని రాముడు చలించి పోయాడు. ఆమెను చూచి ఇలా అన్నాడు. “అమ్మా తారా! నువ్వు వీరుని భార్యవు. ఇలా బేలగా మాట్లాడటం తగదు. నువ్వు విపరీతంగా మాట్లాడుతున్నావు. ఈ ప్రపంచాన్ని బ్రహ్మ సృష్టించాడు. సృష్టిలోని అన్ని జాతులకూ సుఖ దు:ఖాలను పెట్టాడు. ఎవరు కూడా బ్రహ్మ సృష్టిని అతిక్రమించ లేరు. కాబట్టి దు:ఖము మాని ఓర్పు వహించు.
కిష్కింధా రాజ్యానికి నీ కుమారుడు యువరాజుగా పట్టాభిషిక్తుడవుతాడు. నీవు వీర పత్నివి. వీర మాతవు. ఇది బ్రహ్మ విధించిన అందరికీ సమ్మతమైన విధానము. దీనిని ఎవరూ అతిక్రమించలేరు. నీ వంటి వీర పత్ని ఇలా విలపించరాదు.”అని రాముడు తారతో చెప్పాడు.
(తార ఇలా సుదీర్ఘంగా విలపించడం ప్రాచ్యపాఠములో లేదని, ఎవరో తదుపరి చేర్చారని పండితుల అభిప్రాయము. అదే కాదు, తార రామునికి ఒక శాపం ఇచ్చినట్టు ప్రాచ్య పాఠంలో ఉందని, ” నాకు నా భర్తకు అకాల వియోగం కల్పించావు కాబట్టి, నీకు తాత్కాలికంగా నీ భార్య లభించినా, శాశ్వతంగా భార్యావియోగం కలుగుతుంది” అని తార రామునికి శాపం ఇచ్చినట్టు ప్రాచ్యపాఠంలో ఉందని పండితుల అభిప్రాయము.)
శ్రీమద్రామాయణము,
కిష్కింధా కాండము ఇరువది నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్