Anganalala Manache Nadinchukonegani In telugu – అంగనలాల మనచే నాడించుకొనెగాని

ఈ పోస్ట్ లో అంగనలాల మనచే నాడించుకొనెగాని కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అంగనలాల మనచే నాడించుకొనెగాని – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 1
కీర్తన : అంగనలాల మనచే నాడించుకొనెగాని
సంఖ్య : 454
పుట: 304
రాగం: శంకరాభరణం

శంకరాభరణం

44 అంగనలాల మనచే నాడించుకొనెఁ గాని
సంగతెఱిఁగిన నెరజాణఁ డితఁడే

||పల్లవి||

వొడలులేనివాని కొక్కఁడే తండ్రాయఁ గాని
తడయక పురుషోత్తముఁ డితఁడే
బడబాగ్నిజలధికిఁ బాయ కల్లుఁడాయఁ గాని
వెడలించె నమృతము విష్ణుఁ డితఁడే

॥ అంగ||

పులిగూడు దిన్నవాని పొందొక్కటే సేసెఁగాని
నలువంక లక్ష్మీనాథుఁ డితఁడే
చలికిఁ గోవరివానిసరుస బావాయఁ గాని
పలుదేవతల కెల్ల ప్రాణబంధుఁ డితఁడే

॥ అంగ||

యెక్కడో గొల్లసతుల కింటిమగఁ డాయఁ గాని
తక్కక వెదకే పరతత్వ మితఁడే
మిక్కిలి శ్రీవేంకటాద్రిమీఁద మమ్ము నేలెఁ గాని
తక్కక వేదముచెప్పే దైవ మీతఁడే.

॥ అంగ||

అవతారిక:

“ఓ అంగనలారా! ఈ పిల్లాడు ఇట్లా మనచేత ఆడింపబడుతున్నాడు కాని అసలు సంగతి తెలుసుకొంటే ఇతడే గొప్ప నెరజాణమ్మా!” అని ఆలాపిస్తున్నారు మన అన్నమాచార్యులవారు. ఇందులో వున్న ప్రహేళికలు (చిక్కు ప్రశ్నలు) జాగ్రత్తగా సమాధానాలు ఆలోచించి భావవివరణతో సరిజూసుకోండి. ఇదొక ‘క్విజ్ ప్రోగ్రాం’ అన్నమాట. తినబోయేముందు ఇది రుచి చూడండి… పులిగూడు దిన్నవాడెవడు? వాని పొందొక్కటే సేనుగాని. అంటే యేమిటి? ఆలోచించండి. ఎక్కడో గొల్లసతులకు ఇంటిమగడయ్యిం దెవరు? చలికిఁ గోవరివాడెవడు? అనుకున్నంత తేలికకాదు అని తెలుసుకోండి, మరి.

భావ వివరణ:

ఓ అంగనలారా (రమణుల్లారా!) ఈనాడు ఈయన మన చేత ఆడించబడుతున్నాడు. కాని, సంగతెరిగిన (అసలు విషయం తెలుసుకొంటే) ఇతడే గొప్ప నెరజాణ (అన్నీ తెలిసిన చతురుడు).

ఒడలు లేనివానికి (శరీరం లేనివాడికి) ఒక్కడే, తండ్రియైన వాడు (ఎవరు? (మన్మథుని తండ్రియైన శ్రీహరి). తడయక ఆలస్యములేక రక్షించే పురుషోత్తముడు కూడా ఇతడే. బడబాగ్నిని తనలో దాచుకున్న సముద్రునికి, పాయక (కోరి) అల్లుడైన వాడే, కాని అమృతాన్ని అందించినవాడు. ఈయనే | విష్ణువు.

ఈయన పులిగూడుతిన్నవాని పొందొక్కటే చేశాడు (భిక్షాటన చేసి ఆ భిక్ష భుజించేవాని స్నేహం చేసేవాడు)… అంటే (పరమశివుని మిత్రుడైన శ్రీహరి). అయినా ఈయన భిక్ష యెత్తడండీ. ఎందుకంటే అప్లైశ్వర్యములున్న లక్ష్మీదేవికి మగడండీ ఈయన. ఈయన చలికిన్ కోవరి వాని బావ. అంటే చల్లదనాన్నిచ్చే చంద్రునికి బావగారు అయిన శ్రీకాంతుడు. అంతేకాదు దేవతలందరికీ ప్రాణబంధువు.

ఎక్కడో రేపల్లెలో వున్న గొల్లపడుచులకి “ఇంటి మగడు” ఒకే ఇంటిపేరుండేట్లు చేసిన మగడు. యోగులందరూ తక్కక (వెనుదీయక) వెదకే పరతత్వము (పరబ్రహ్మ) ఇతడే. ఇవన్నీ అటుంచి శ్రీవేంకటాద్రి మీద వెలసి మమ్మల్ని యేలే దేవుడు ఈయనే. కానీ వేదాలన్నీ శ్లాఘించే పరాత్మరుడు కూడా ఈ దేవుడే.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు

Leave a Comment