మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ – చతుశ్చత్వారింశః సర్గలో, విశ్వామిత్రుడు రాముడు, లక్ష్మణులతో సిద్దాశ్రమానికి చేరుకుంటాడు. రాముడు యజ్ఞానికి రక్షణగా ఉంటాడు. అప్పుడు మారీచుడు, సుబాహుడు దానవ సైన్యంతో యజ్ఞాన్ని భంగం చేయడానికి వస్తారు. రాముడు మారీచుడిని దూరం పంపి, సుబాహును చంపేస్తాడు. రాముని శక్తి విశ్వామిత్రుని ఆనందపరుస్తుంది. రాముడు ధైర్యం, కర్తవ్యం, ధర్మపరిపాలనతో యజ్ఞాన్ని రక్షిస్తాడు.
సాగరోద్ధారః
స గత్వా సాగరం రాజా గంగయాఽనుగతస్తదా |
ప్రవివేశ తలం భూమేర్యత్ర తే భస్మసాత్కృతాః ||
1
భస్మన్యథాప్లుతే రామ గంగాయాః సలిలేన వై |
సర్వలోకప్రభుర్బ్రహ్మా రాజానమిదమబ్రవీత్ ||
భగీరథుని మనోరథమునెరవేరినది. గంగా జలము సగర పుత్రుల భస్మరాసుల మీద ప్రవహించినది. వారిని పునీతులను చేసినది. వారందరికీ స్వర్గలోక ప్రాప్తి కలిగించినది. అప్పుడు బ్రహ్మదేవుడు భగీరథునితో ఇలా పలికాడు.
” నీవు కోరినట్టు గంగ సగరపుత్రుల భస్మరాసుల మీదుగా ప్రవహించినది. 60,000 మంది సగర కుమారులు స్వర్గమునకు వెళ్లినారు. సాగరములు ఉన్నంత వరకూ వారు స్వర్గములో ఉండగలరు. గంగను నీవు స్వర్గము నుండి భూమికి తీసుకొని వచ్చావు కాబట్టి ఆమె నీకు పుత్రికతో సమానము. అందుకని గంగ ఇప్పటి నుండి భాగీరథి అనే పేరులో పిలువబడుతుంది. ఈ గంగ దేవ లోకము నుండి భూలోకమునకు అక్కడి నుండి పాతాళమునకు ప్రవహించింది కాబట్టి గంగకు త్రిపధ అనే పేరుతో కూడా పిలువ బడుతుంది.
ఓ భగీరథా! ఈ పవిత్ర గంగా జలముతో నీ పితరులకు తర్షణములు విడిచి నీ మాట నిలబెట్టుకో. ఎందుకంటే పూర్వము సగర చక్రవర్తి మనుమడు అంశుమంతుడు, దిలీపుడు, ఎవరూ ఈ పని చేయలేకపోయారు. దేవలోకములో ఉన్న గంగను భూలోకమునకు తీసుకొని వచ్చి మహోపకారము చేసావు. అఖండ మైన కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నావు. ఈ రోజు నుండి ప్రతిరోజూ ఈ పుణ్య గంగాజలములలో స్నానము చేసి పునీతుడవు కా! నీకు పుణ్యం వస్తుంది.” అని పలికాడు ‘బ్రహ్మ.. తరువాత బ్రహ్మ తనలోకమునకు వెళ్లిపోయాడు.
తరువాత భగీరథుడు తన పితరులకు, పితామహులకు, ప్రపితామహులకు జల తరణములు విడిచి వారికి పుణ్యలోకములు ప్రాప్తించేటట్టు చేసాడు.
ఓ రామా! ఇదీ గంగావతరణము కథ. ఈ గంగావతరణము కథ చదివిన వాడు, విన్న వాడు పాపములు నశించి పుణ్యలోకములు పొందుతాడు. రామా! సంధ్యాకాలము అయినది. వెళ్లి సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వర్తించెదము.” అని పలికాడు విశ్వామిత్రుడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ ఏకచత్వారింశః సర్గ రామాయణంలోని ఒక ముఖ్యమైన అధ్యాయం. ఈ సర్గలో, రాముడు తన పిత దశరథ మహారాజు మరణ వార్త తెలుసుకుంటాడు. ఈ వార్త రాముడు, సీత మరియు లక్ష్మణులను మరింత దుఃఖంలోకి నెట్టివేస్తుంది. ఈ సర్గలో, రాముడు తన పిత ను స్మరించుకుంటూ, ఆయనతో గడిపిన అనుభవాలను తలుచుకుంటాడు. ఇది రాముడి వ్యక్తిత్వంలోని మరిన్ని పార్శ్వాలను మరియు అతని జీవితంలో కష్టకాలాలను పరిచయం చేస్తుంది. ఈ సంఘటనలు, రాముడి ధైర్యం, విధి నిష్ఠను, మరియు అతని ధార్మికతను ప్రతిఫలింపజేస్తాయి.
ఎప్పుడైతే రాముడు అంత:పురస్త్రీలకు అందరికీ నమస్కరించి బయటు దేరాడో, వారందరూ ఏడవడం మొదలుపెట్టారు.
“ఇంత కాలమూ రాముడు మాకు రక్షకుడుగా ఉండేవాడు. ఆ రాముడు ఇప్పుడు ఏడీ! మనము ఎలా బతకాలి!” అని వాపోతున్నారు. రాముని మంచి గుణములను తలచుకుంటూ ఏడుస్తున్నారు.
“రాముడికి అసలు కోపమే రాదు. ఎవరి మీద కోపగించడు. ఒకవేళ ఎవరన్నా రాముని మీద కోపించిన, తిరిగి వారి మీద కోపింపడు. అటువంటి ఉత్తముడు రాముడు. అందరి కష్టసుఖములు తనవిగా అనుకొని ఆదరించెడి వాడు రాముడు. రాముడు తన తల్లి కౌసల్యను ఏ మాదిరి ఆదరించేవాడో మా అందరిని కూడా అంతే గౌరవంతో ఆదరించేవాడు. ఈ నాడు ఈ కైకేయి వలన మాకు రాముని అండలేకుండా పోయింది. అయినా కైక వరాలు కోరిందే అనుకో. మహారాజుగారు ఏదో ఒక వరం ఇచ్చి సరిపుచ్చవచ్చుకదా. ఆమె మాట విని రాముని వనములకు పంపాలా! బుద్ధిలేకపోతే సరి!” అని దశరథుని కూడా నిందిస్తున్నారు.
అసలే రాముడు అడవులకుపోయిన దుఃఖంతో ఉన్న దశరథునికి అంత:పుర స్త్రీల సూటిపోటీ మాటలు భరించరానివిగా ఉన్నాయి. కానీ ఏమీ అనలేడు. తను చేసిన పని అటువంటిది కదా!
రాముడు లేని అయోధ్యలో బ్రాహ్మణులు అగ్నిహోత్రములు వెలిగించలేదు. ఎవరి ఇంట్లో కూడా పొయ్యి వెలిగించలేదు. రాముడే లేని మాకు అన్నము ఎందుకు అని అనుకున్నారు ప్రజలు. వారి మూలపురుషుడైన సూర్యుడు కూడా మొహం చాటేసాడా అన్నట్టు ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. ఏనుగులు ఆహారం తీసుకోలేదు. ఆవులు తమ దూడలకు పాలు ఇవ్వలేదు.
అయోధ్యలో ఉన్న ప్రజలలో ఎవరి మొహంలోనూ సంతోషము ఆనందమూ కనపడలేదు. అందరూ రాముని గురించే ఆలోచిస్తున్నారు. అయోధ్యావాసులందరూ తమ తమ దైనందిన పనులు చెయ్యడంలో ఆసక్తి చూపడం లేదు. రామునికి ఏమవు తుందో ఏమో అని దిగులుతో ఉన్నారు. ఇంక రాముని స్నేహితులు అయితే ఏకంగా మంచానికి అతుక్కుపోయారు. లేవడానికి కూడా వారికి ఓపిక లేదు. రాముడు లేని అయోధ్య ప్రాణం లేని శరీరంలాగా తయారయింది. రాముని వియోగము భరించలేక అయోధ్యలోని ప్రజలేకాదు, పశువులు, ఏనుగులు, గుర్రములు, పక్షులు కూడా ఆహారం ముట్టకుండా విలపిస్తున్నాయి.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని త్రయస్త్రింశః సర్గలో కుశనాభ కుమార్తెలు వాయుదేవుని చేష్టల గురించి నివేదిస్తారు. వారి ప్రవర్తనకు సంతోషించిన కుశనాభుడు ఆలోచించి, సాధువు రాజు బ్రహ్మదత్తతో వారి వివాహానికి ఏర్పాట్లు చేస్తాడు. వివాహానంతరం, బ్రహ్మదత్తుని చేతి స్పర్శతో ఆడపిల్లలు తమ వికృతమైన శరీరాలను వదిలించుకుని, వారు మళ్లీ గొప్ప అందగాళ్లవుతారు.
తండ్రి మాటలు విన్న కుమార్తెలు ఆయనకు నమస్కరించి ఇలా అన్నారు.
“వాయుదేవుడు ధర్మము తప్పి మమ్ములను వివాహము చేసుకుంటాను అని అన్నాడు. మేము తిరస్కరించాము. మా తండ్రి గారు ఉన్నారు. మేము అస్వతంత్రులము. మా తండ్రి గారిని అడుగు.”అని అన్నాము. దానికి ఆయన కోపించి మమ్ములను దుర్బలులుగా చేసాడు. ఇదీ జరిగిన సంగతి.” అని చెప్పారు.
వారి మాటలు విన్న కుశ నాభుడు వారితో ఇలా అన్నాడు.
“కుమార్తెలారా! మీరు మంచి పని చేసారు. మీ ఓర్పును మెచ్చుకుంటున్నాను. మీరు వాయుదేవుని క్షమించి విడిచి పెట్టారు. పురుషులకు, స్త్రీలకు ఓర్పు అలంకారము. ఓర్పు దానము, ఓర్పు యజ్ఞము, ఓర్పు సత్యము, ఓర్పు కీర్తి. ఓర్పు ధర్మము. ఓర్పు మీదనే ఈ ధరణి అంతా నిలిచి ఉంది. కాని దేవతలకు ఓర్పు ఉండదు. కాబట్టి మీ ఓర్పును ప్రశంసిస్తున్నాను.” అని పలికాడు.
తరువాత కుశధ్వజుడు మంత్రులతో తన కుమార్తెల వివాహముల గురించి మంతనాలు సాగించాడు. ఆ సమయమున చూళి అనే మహర్షి తపస్సు చేస్తున్నాడు. ఆయనకు సోమద అనే గంధర్వ కాంత పరిచర్యలు చేస్తూ ఉంది. ఆ గంధర్వ కన్య పరిచర్యలకు చూళి చాలా సంతోషించాడు.
“ఓ కన్యా! నీకు ఏమి కావాలో కోరుకో!” అని అడిగాడు.
“ఓ మహర్షీ! నాకు పుత్ర సంతానము కావాలి. కాని నాకు భర్త లేడు. నేను ఎవరికీ భార్యను కాను. అందుకే మీకు సేవలు చేస్తున్నాను. తమ వలన నాకు బ్రహ్మ తేజస్సు కలిగిన పుత్రుడు కలిగే వరమును ప్రసాదించండి.” అని అడిగింది.
చూళి ఆమె కోర్కెను మన్నించాడు. ఆమెకు తన తేజస్సుతో ఒక కుమారుడిని ప్రసాదించాడు. ఆయనే చూళి మానస పుత్రుడు. ఆయన పేరు బ్రహ్మదత్తుడు. సోమద కుమారుడైన బ్రహ్మదత్తుడు కాంపిల్య నగరంలో నివసిస్తున్నాడు.
ఇది ఇలా ఉండగా కుశనాభుడు తన నూర్గురు కుమార్తెలను బ్రహ్మదత్తునికి ఇచ్చి వివాహము చేయవలెనని నిశ్చయించుకున్నాడు. ఆ విషయం బ్రహ్మ దత్తునితో సంప్రదించాడు. ఈ వివాహానికి బ్రహ్మ దత్తుడు ఒప్పుకున్నాడు. కుశనాభుడు తన నూర్గురు కుమార్తెలను బ్రహ్మ దత్తునికి ఇచ్చి వివాహం జరిపించాడు.
బ్రహ్మ దత్తుని చేతి స్పర్శ తగలగానే వారికి వాయుదేవుని వలన కలిగిన దుర్బలత్వము తొలగిపోయింది. పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రకాశించారు.
బ్రహ్మ దత్తుడు తన నూర్గురు భార్యలతో కాంపిల్యల నగరం చేరుకున్నాడు. సోమద తన కోడళ్లను చూసి మురిసిపోయింది. వారి అందచందాలను చూసి ఎంతో సంతోషపడింది.
శ్రీమద్రామాయణము
బాల కాండ
ముప్పది మూడవ సర్గ సంపూర్ణము.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ – ద్విచత్వారింశః సర్గలో, రాముడు విశ్వామిత్రుని వెంట యజ్ఞాన్ని రక్షించేందుకు సిద్దమవుతాడు. యాత్రలో, వారు తాడకాతో ఎదురవుతారు. తాడక, దానవుల రాణి, యజ్ఞాలను దుష్ప్రభావం చేస్తుంది. రాముడు తన ధైర్యం మరియు శక్తితో తాడకను సమరంలో సంహరిస్తాడు. ఈ సంఘటన రాముని శక్తి, ధర్మనిరతత, మరియు గురుభక్తిని చూపిస్తుంది.
భగీరథవరప్రదానమ్
కాలధర్మం గతే రామ సగరే ప్రకృతీజనాః |
రాజానం రోచయామాసురంశుమంతం సుధార్మికమ్ ||
1
స రాజా సుమహానాసీదంశుమాన్రఘునందన |
తస్య పుత్రో మహానాసీద్దిలీప ఇతి విశ్రుతః ||
సగర చక్రవర్తి మరణించిన తరువాత ఆయన మనుమడు అంశు మంతుడు చక్రవర్తి అయ్యాడు. అంశు మంతుని కుమారుడు దిలీపుడు. అంశు మంతుడు దిలీపునకు రాజ్యము కట్టబెట్టి తాను తపస్సు చేసుకోడానికి అరణ్యములకు వెళ్లాడు.
దిలీపుడు తన పితామహులకు స్వర్గ లోక ప్రాప్తి కలిగించుటకు ఆకాశ గంగను భూమి మీదికి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాడు. కాని తగిన ఉపాయము దొరకలేదు. ఆ మనోవ్యధతోనే దిలీపుడు మరణించాడు.
ఆ దిలీపుని కుమారుడు భగీరథుడు. భగీరథునికి పుత్ర సంతానము లేదు. భగీరథునికి సంతానము కావలెనని తీవ్రమైన కోరిక కలిగింది. దానికి తోడు తన ప్రపితామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించుట. ఈ రెండు కోరికలతో భగీరథుడు బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేసాడు. భగీరథుని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు.
” ఓ భగీరథా! నీ తపస్సుకు మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో” అని అడిగాడు బ్రహ్మ.
“దేవా! నాకు పుత్ర సంతానము ప్రసాదించండి. తరువాత ఆకాశ గంగను భూమీ మీదకు పంపండి. ఆ ఆకాశ గంగతో నా ప్రపితా మహులకు జలతర్పణము వదులుతాను.” అని కోరుకున్నాడు.
” ఓ భగీరథా! నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. కాని ఆకాశ గంగను భూమి మీదికి తేవడం అత్యతం కష్టమైన పని. కాని నీవు కోరావు కాబట్టి ఆ వరం కూడా ప్రసాదిస్తున్నాను. గంగాదేవి హిమవంతుని పెద్దకుమార్తె. హిమవంతుని రెండవ కుమార్తె ఉమను సదాశివుడు వివాహమాడాడు. ఆకాశము నుండి భూమి మీదికి దూకే గంగానదిని భరించే శక్తి ఆ మహేశ్వరునికి తప్ప వేరే ఎవరికీ లేదు. ఎందుకంటే ఆకాశము నుండి భూమి మీదికి దిగే గంగాప్రవాహాన్ని భరించే శక్తి భూమికి లేదు. మధ్యలో మహేశ్వరుడు ఆ గంగను భరించాలి. కాబట్టి నీవు మహేశ్వరుని ప్రార్థించి గంగాదేవిని వహించమని కోరాలి.” అని అన్నాడు బ్రహ్మదేవుడు.
బ్రహ్మదేవుడు ఈ విషయం గంగాదేవితో కూడా చెప్పాడు. ఆమె అనుమతి కూడా తీసుకున్నాడు. తరువాత బ్రహ్మదేవుడు తన లోకమునకు వెళ్లిపోయాడు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకత్రింశః సర్గలో ఋషి విశ్వామిత్రుడు మిథిలా రాజ్యానికి జనక రాజు యొక్క ఆచారానికి హాజరయ్యేందుకు మరియు యుగాల నుండి జనకుని రాజభవనంలో పూజించబడుతున్న శివుని పవిత్రమైన విల్లును చూడటానికి కూడా ప్రయాణిస్తాడు. ఇతర ఋషులు రాముడికి సూచించారు, అతను కూడా తమతో పాటు ఆ అద్భుత విల్లును చూడమని అక్కడికి వెళ్ళవచ్చు. వారంతా సిద్ధ ఆశ్రమం నుండి గంగా నదికి ఉపనది అయిన సోనా నది వైపు వెళ్లి ఒక రాత్రి దాని ఒడ్డున విడిది చేస్తారు.
యాగమును సంరక్షించాము అన్న ఆనందంతో రామలక్ష్మణులు ఆ రాత్రి సుఖంగా నిద్రించారు.
మరునాడు ప్రాత:కాలమునే లేచి సంధ్యావందనాది కార్యములు పూర్తి చేసుకొని రామలక్ష్మణులు విశ్వామిత్రుడు, తదితర ఋషుల వద్దకు వెళ్లారు. వారు విశ్వామిత్రునికి భక్తితో నమస్కరించి ఇలా అన్నారు.
“ ఓ మహర్షీ! మేము నీ భటుల మాదిరి వచ్చినిలిచి ఉన్నాము. ఏమి చేయవలెనో ఆజ్ఞాపించండి.” అని చేతులుకట్టుకొని వినయంగా నిలబడ్డారు.
వారిని చూచిన మహర్షులు విశ్వామిత్రుని అనుమతితో ఇలా అన్నారు. ” ఓ రామా! మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఒక యజ్ఞము చేయుచున్నాడు. మేము అందరమూ ఆ యజ్ఞమునకు పోవుచున్నాము. మీరు కూడా మా వెంట మిథిలకు వచ్చినచో అక్కడ ఉన్న ఒక మహాధనుస్సును చూడవచ్చును. ఆ ధనుస్సు సామాన్యమైనది కాదు. చాలా బలము కలది. భయంకరమైనది. ఆ ధనుస్సును
పూర్వము యజ్ఞములో దేవతలు జనకునికి ఇచ్చారు. దానిని దేవతలు, గంధర్వులు, అసురులు,రాక్షసులు ఎవరు కూడా ఎత్తలేరు. ఎక్కుపెట్టలేరు. ఇంక మానవుల సంగతి చెప్ప పనిలేదు కదా! అంతటి బలమైనది ఆ ధనుస్సు. ఎందుకంటే ఎంతో మంది రాజులు ఆ ధనుస్సును ఎత్తబోయి విఫలమయ్యారు. ఎవరూ ఆ ధనుస్సును ఎక్కుపెట్టలేకపోయారు. ప్రస్తుతము ఆ మహత్తర ధనుస్సు జనక మహారాజు పూజా మందిరములో పూజింపబడుతూ ఉంది.” అని పలికారు.
తరువాత విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో, తదితర ఋషులతో కూడా కలిసి మిథిలకు ప్రయాణము అయ్యాడు. అందరూ ఉత్తర దిక్కుగా వెళుతున్నారు. దాదాపు నూరు బండ్లలో అందరూ వెళు తున్నారు.
చాలా దూరము ప్రయాణము చేసి అందరూ శోణ నదీ తీరము చేరుకున్నారు. ఆ రాత్రికి అక్కడే గడపాలను కున్నారు. సాయంకాలము చేయవలసిన సంధ్యావందనము, అగ్ని కార్యములను పూర్తి చేసుకొని అందరూ విశ్వామిత్రుని ముందు కూర్చున్నారు. ఆ సమయంలో రాముడు విశ్వామితుని ఇలా అడిగాడు.
“ఓ మహర్షీ! ప్రస్తుతము మనకు ఉన్న వనము ఫలములతోనూ పుష్పములతోనూ శోభిల్లుచున్నది. ఈ వనము పేరు ఏమి? దీని గురించి నాకు తెలియజేయండి.” అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు.
శ్రీమద్రామాయణము
బాల కాండ
ముప్పది ఒకటవ సర్గ సంపూర్ణము.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ – చత్వారింశః సర్గః:, విష్ణుమూర్తి వామనావతారం స్వీకరిస్తాడు మరియు మహాబలిని ఎదుర్కొంటాడు. వామనుడు మహాబలిని మూడు అడుగుల భూమి యాచిస్తాడు. మహాబలి తన దానాన్ని పునీతం చేసేందుకు వామనునికి ఆర్ద్రతతో అందివ్వాలని నిర్ణయిస్తాడు. వామనుడు రెండు అడుగులతో భూమి, ఆకాశాన్ని కవర్ చేస్తాడు. మూడవ అడుగు ఎక్కడ వేయాలో అడిగితే, మహాబలి తన తల వంచి ఆ అడుగును వేయమంటాడు.
భయంతో వణికి పోతున్న దేవతలతో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు.
” ఓ దేవతలారా! భయపడకండి. ఈ భూమి ఆ సర్వేశ్వరుడు విష్ణువుకు చెందినది. ఆయన కపిలావతారములో ఈ భూమిని రక్షిస్తున్నాడు. ఆ సగర కుమారులను ఆయనే శిక్షిస్తాడు. ఆ సగర కుమారుల చావు కపిలుని చేతిలో ఉంది.” అని అన్నాడు.
ఆ మాటలు విన్న దేవతలు తమ తమ స్థానములకు వెళ్లిపోయారు. సగర కుమారులు భూమిని తవ్వుతూనే ఉన్నారు. కాని వారికి యజ్ఞాశ్వము కనపడలేదు. కాని వారికి ఒక పెద్ద శబ్దము వినిపించింది. కాని వారు ఆ శబ్దమును లక్ష్యపెట్టలేదు. తమ తండ్రి సగరుని వద్దకు తిరిగి వచ్చారు.
“తండ్రీ! మీరు చెప్పినట్టు మేము భూమి అంతా తవ్వాము. యక్ష, గంధర్వ, నాగ జాతులను చంపాము. కాని మాకు యజ్ఞాశ్వము కనపడలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి.” అని అడిగారు.
కుమారుల మాటలు విన్న సగరుడికి కోపం మిన్నుముట్టింది.
“మీరు ఇంకా భూమిని తవ్వండి. అశ్వమును పట్టండి. అశ్వము లేకుండా తిరిగిరాకండి.” అని ఆజ్ఞాపించాడు సగరుడు.
సగరకుమారులు మరలా భూమిని తవ్వడం మొదలెట్టారు. అందరూ పాతాళ లోకము చేరుకున్నారు.
వారికి భూమండలమును మోస్తున్న విరూపాక్షము అనే ఏనుగు కనపడింది. సగరకుమారులు దానికి నమస్కరించి మరలా తవ్వనారంభించారు. వారికి తూర్పుదిక్కుగా మరొక ఏనుగు కనిపించింది. దాని పేరు మహాపద్మము అనే దిగ్గజము. అది కూడా తన శిరస్సు మీద భూమండలమును మోస్తున్నది. ఆ ఏనుగును చూచి సగర కుమారులు ఆశ్చర్య పోయారు. సగరకుమారులు ఆ ఏనుగుకు కూడా ప్రదక్షిణము చేసి నమస్కారము చేసారు. ఆ సారి పశ్చిమ దిక్కుగా తవ్వసాగారు. పశ్చిమ దిక్కున కూడా వారికి భూమండలము తన శిరస్సున మోస్తున్న సౌమనసము అనే దిగ్గజము కనిపించింది. వారు ఆ దిగ్గజమునకు కూడా నమస్కరించి, ఉత్తర దిక్కుగా త్వరం భించారు. ఉత్తరదిక్కున కూడా వారికి భూమండలము ను మోస్తున్న భద్ర అనే దిగ్గజము కనిపించింది. సగర కుమారులు ఆ దిగ్గజమునకు కూడా పూజాదికములు నిర్వహించి నమస్కరించారు.
తరువాత వారు ఈశాన్య దిక్కుగా తవ్వనారంభించారు. ఈశాన్య దిక్కుగా వారికి గడ్డిమేయుచున్న యజ్ఞాశ్వము కనిపించింది. ఆ అశ్వమునకు కొంత దూరంలో మహావిష్ణు అవతారమైన కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించాడు.
అశ్వమును చూడగానే వారి శరీరాలు కోపంతో కంపించాయి. ఆ కపిలుడే తమ అశ్వమును దొంగిలించాడు అని అనుకొని తమ వద్దఉన్న ఆయుధములతో కపిలుని మీదికి దూకారు.
“ఓరీ! నీవేనా మా యజ్ఞాశ్వమును దొంగిలించినది. మేము ఎవరమో తెలియునా! మేము సగర చక్రవర్తి కుమారులము. మా యజ్ఞాశ్వమునే దొంగిలిస్తావా!” అంటూ కపిలుని చుట్టుముట్టారు.
కపిలుడు కళ్లు తెరిచాడు. వారిని చూచాడు. ఒక్కసారి కోపంతో హుంకరించాడు. ఆ కపిలుని హుంకారం లోనుండి పుట్టిన అగ్నిలో సగరుని కుమారులు 60,000 మంది భస్మం అయిపోయారు.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. బాలకాండ లోని ఏకోనత్రింశః సర్గలో, రాముడు మరియు లక్ష్మణులు పూర్వ అధ్యాయంలో సిద్ధ ఆశ్రమాన్ని, సిద్ధ ఆశ్రమాన్ని విచారించారు, దీని కోసం ఋషి విశ్వామిత్రుడు ఆ సన్యాసం వారసత్వం గురించి తెలియజేస్తాడు, ఎందుకంటే అది ఒకప్పుడు వామ్నా అవతారంలో విష్ణువుకు చెందినది. విశ్వామిత్రుడు దాని గురించి మరియు వామన అనే మరుగుజ్జు సన్యాసి బాలుడు భూమిపై చెడును ఎలా నిర్మూలించాడో వివరిస్తాడు. ఈ రామావతారంలో కూడా అలాగే చేయమని విశ్వామిత్ర మహర్షి నుండి రాముడికి ఒక సూచన.
రాముడు ఆ వనమును గురించి ప్రశ్నించగా, విశ్వామిత్రుడు ఇలా బదులు చెప్పాడు.
” ఓ రామా! ఈ ప్రదేశములోనే శ్రీ మహా విష్ణువు వంద యుగముల పాటు తపస్సు చేసాడు. వామనావతారమునకు ముందు శ్రీ మహా విష్ణువు ఇక్కడనే నివసించేవాడు. కశ్యపుడు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందినందువలన, దీనిని సిద్ధాశ్రమము అని అంటారు. శ్రీ మహా విష్ణువు ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్న కాలంలో బలి చక్రవర్తి దేవత లందరినీ జయించి ముల్లోకములనూ పరిపాలిస్తున్నాడు. ఆ బలి చక్రవర్తి ఒక సారి యాగము చేస్తున్నాడు. ఆ సమయంలో దేవతలందరూ ఇక్కడ తపస్సు చేస్తున్నా విష్ణు మూర్తి దగ్గరకు వచ్చి ఇలా అన్నారు.
ఓ విష్ణూ! బలి చక్రవర్తి యజ్ఞము చేస్తున్నాడు. అది పూర్తి అయే లోపలనే మన కార్యము పూర్తి కావాలి. ఈ యాగ సమయములో బలి చక్రవర్తి ఎవరు ఏది అడిగితే దానిని కాదు లేదు అనకుండా ఇస్తున్నాడు.
ఓ దేవా! నీవు దేవతల మేలు కోరి, వామనుడిగా బలి చక్రవర్తి యొద్దకు పోయి, మాకు మేలు చేయుము. ” అని ప్రార్థించారు.
అదే సమయంలో కశ్యపుడు తన భార్యా సమేతంగా వేయి సంవత్సరములు విష్ణువును గూర్చి తపస్సు చేసాడు. తరువాత విష్ణువును ఇలా ప్రార్థిస్తున్నాడు.
” ఓ పురుషోత్తమా! నీవు తపోమయు డవు. తపోరాశివి. తపోమూర్తివి. తపమే నీ రూపము. అట్టి నిన్ను నా తపో మహిమ వలన చూడగలుగుతున్నాను. నీకు ఆది, అంతము లేదు. నీవు సర్వాంతర్యామివి. నిన్ను శరణు వేడుచున్నాను. ” అని ప్రార్థించాడు.
అప్పుడు విష్ణువు కశ్యపునకు ప్రత్యక్షమయ్యాడు. ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు కశ్యపుడు ఇలా అడిగాడు.
“భగవాన్! నీవు నాకు అదితికి పుత్రుడుగా జన్మించు. దేవేంద్రునికి తమ్ముడుగా జన్మించు. దేవతలకు మేలు కలిగించు. నా ఇన్ని సంవత్సరములు తపస్సు ఫలిస్తుంది. నీ అనుగ్రహంతో ఈ ప్రదేశము సిద్ధాశ్రమము అని ప్రసిద్ధి చెందుతుంది. హే భగవాన్! నాకు పుత్రుడుగా జన్మించి నన్ను కృతార్ధుడిని చెయ్యి” అని ప్రార్థించాడు కశ్యపుడు.
కశ్యపుడు కోరుకున్నట్టు విష్ణు మూర్తి, కశ్యపునకు అదితికి వామనుడిగా జన్మించాడు. వెంటనే బలిచక్రవర్తి వద్దకు వెళ్లాడు. తనకు మూడు అడుగుల స్థలము కావాలి అని అడిగాడు. బలి చక్రవర్తి వెంటనే వామనుడు అడిగిన మూడు అడుగుట స్థలమును ఇస్తూ నీటిని ధారపోసాడు. వామనుడు బలి చక్రవర్తి నుండి మూడు అడుగుల స్థలమును గ్రహించాడు. వెంటనే త్రివిక్రముడిగా పెరిగాడు. ముల్లోకములను ఆక్రమించాడు. బలి చక్రవర్తిని ఓడించాడు. స్వర్గాధిపత్యమును మరలా మహేంద్రునికి అప్పగించాడు. దాంతోముల్లోకములు మరలా మహేంద్రుని అధీనంలోకి వచ్చాయి. వామనుడి మీద ఉన్న భక్తి చేత నేను కూడా ఇదే ఆశ్రమములో నివసిస్తున్నాను. ఇక్కడనే నేను యజ్ఞము చేస్తున్నాను. రాక్షసులు ఇక్కడకు వచ్చి నా యజ్ఞమును పాడు చేస్తున్నారు. నీవు వారిని ఇక్కడే సంహరించాలి.
రామా! ఇప్పుడు మనము సిద్ధాశ్రమములో ప్రవేశిస్తున్నాము. రామా! ఈ ఆశమములో నీవు స్వేచ్ఛగా ఉండవచ్చు. ” అని అన్నాడు ఈ విశ్వామిత్రుడు.
రామ లక్ష్మణులు విశ్వామిత్రుని ఆశ్రమములో ప్రవేశించారు. విశ్వామిత్రుడు రావడం చూచి ఆ ఆశ్రమములో ఉన్న మునులందరూ వచ్చి విశ్వామిత్రుని, రామలక్ష్మణులను సాదరంగా లోపలకు తీసుకొని వెళ్లారు. వారిని పూజంచారు. అతిథి సత్కారములు చేసారు. రామ లక్ష్మణులు కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నారు.
తరువాత వారు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నారు.
“ఓ విశ్వామిత్ర మహర్షీ! తమకుశుభం కలుగుతుంది. తమరు ఈ రోజునుండే యాగము ప్రారంభించండి. మేము యాగ రక్షణ చేస్తాము.” అని అన్నారు.
ఆ మాటలు విన్న విశ్రామిత్రుడు ఎంతో సంతోషించాడు. యాగ దీక్షను స్వీకరించాడు. రామ లక్ష్మణులు ఆ రాత్రి అంతా జాగరూకతతో ఉన్నారు. మరునాడు ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని ప్రాత:కాల సంధ్యావందనము ఆచరించి, విశ్వామిత్రుని వద్దకు వచ్చి ఆయనకు నమస్కరించి, ఆయనతో ఇలా అన్నారు.
వాల్మీకి విరచిత
రామాయణ మహాకావ్యములో
బాలకాండలో ఇరవై తొమ్మిదవ సర్గ సంపూర్ణము.
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండ దశమ సర్గ రామాయణంలో ముఖ్యమైన భాగం. ఈ సర్గలో రాముడు, సీత, మరియు లక్ష్మణులు వనవాసం కోసం అయోధ్యను విడిచి వెళ్ళిన తరువాత జరిగే సంఘటనలు చిత్రించబడ్డాయి. వారి వనవాస ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, కష్టాలు, మరియు వారు కలసిన వ్యక్తులను ఈ సర్గ వివరంగా వర్ణిస్తుంది. అలాగే, అయోధ్యలో ఉన్న దశరథ మహారాజు మరియు ఇతర కుటుంబ సభ్యుల మనోభావాలను కూడా ఈ సర్గ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ సర్గ ద్వారా రాముడు మరియు అతని కుటుంబం ఎదుర్కొనే దుఃఖం, త్యాగం, మరియు ధైర్యం వంటి అంశాలు పాఠకుల హృదయాలను తాకుతాయి.
కైక, మంధర, ఏమి చెయ్యాలో ఎలా చెయ్యాలో దశరథుడు వస్తే ఇలా మాట్లాడాలో మరొకసారి వివరంగా మాట్లాడు కున్నారు. తరువాత కైక కోపగృహంలో ప్రవేశించింది. ఆభరణాలు అన్నీ విసిరికొట్టింది. వెంట్రుకలు గట్టిగా ముడివేసింది. మాసిన బట్టలు కట్టుకుంది. నేలమీద బోర్లాపడుకొని తెచ్చిపెట్టుకున్న బాధను అభినయిస్తూ ఉంది.
ఇంతలో మరునాడు జరగ వలసిన రామ పట్టాభిషేకమునకు చేయవలసిన ఏర్పాట్ల గురించి తగు సూచనలు ఇచ్చిన దశరథుడు, వసిష్ఠుడు వామదేవుడు మొదలగు పెద్దల అనుజ్ఞ తీసుకొని, ఈ విషయమును ముందుగా కైకకు తెలుపవలెనని, వడి వడిగా కైక ఉన్న మందిరమునకు వచ్చాడు.
ఎప్పుడూ కళకళలాడే కైకేయీ మందిరము నిశ్శబ్దముగా ఉంది. శయన మందిరములో కైక కనిపించలేదు. దాసదాసీలు అటు ఇటు తిరుగుతున్నారు. కానీ కైక జాడ మాత్రం కానరాలేదు. ఎప్పుడెప్పుడు కైకతో రామ పట్టాభిషేక వార్త చెబుదామా అని వచ్చిన దశరథ మహారాజు కైక కనపడకపోయేసరికి నిరాశపడ్డాడు. అన్ని గదులు తిరిగాడు. ఎక్కడా కైకజాడ లేదు.
ఎప్పుడూ తను వస్తున్న వర్తమానము ముందుగానే తెలుసు కొని కైక తనకు ఎదురు వచ్చి స్వాగతించి లోపలకు తీసుకొని వెళ్లేది. కాని ఈ మాదిరి ఎప్పుడూ జరగలేదు. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు దశరథుడు. అక్కడ నిలబడి ఉన్న కైక ఆంతరంగిక పరిచారికలను పిలిచి కైక గురించి అడిగాడు. నిజానికి అలా అడగడం అవమానం. కాని తప్పలేదు. అడిగాడు.
వారు దశరథునికి నమస్కరించి వినయంగా “మహారాజా! కైకేయీ మహారాణీవారు. కోపగృహంలో ఉన్నారు.”అని చెప్పారు.
ఆశ్చర్యపోయాడు దశరథుడు. కైకేయికి తన మీద కోపమా! ఎందుకు! ఏమీ కారణము! అని తనలో తాను తర్కించుకుంటున్నాడు. దశరథుడు. మెల్ల మెల్ల గా కైకేయీ పడుకొని ఉన్న కోపగృహమునకు వెళ్లాడు. నేలమీద పడుకొని ఉన్న తన ప్రియమైన భార్య కైకను చూచి దశరథునికి దుఃఖము ముంచుకొచ్చింది. దెబ్బతగిలిన లేడిలాగా, దేవలోకము నుండి విసిరివేయబడ్డ దేవకన్యలాగ నేలమీద పడి ఉన్న కైకను చూచి చలించిపోయాడు. వెళ్లి ఆమె పక్కనే నేల మీద కూర్చున్నాడు. ఆమె శరీరాన్ని తన చేతితో మెల్లిగా నిమిరాడు. నెమ్మది అయిన స్వరంతో ఆమెతో ఇలా అన్నాడు.
“దేవీ! ఏమిటీ ఈ అలుక. దేనికి ఈ అలుక. నామీద కోపం ఎందుకు. నేను చేసిన అపరాధము ఏమి? నిన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారా! లేక ఎవరన్నా నిన్ను అవమానించారా! నిన్ను ఈ పరిస్థితిలో చూస్తుంటే నాకు దుఃఖము ముంచుకొస్తూ ఉంది. నీవు ఏం కోరితే అది తీర్చే నేను ఉండగా నీకు ఈ కోపమేల? నీ మనసు ఎందుకు కష్టపెట్టుకుంటావు?
అయ్యో ఇన్ని అడుగుతున్నాను. నీ ఆరోగ్యము సంగతే అడగ లేదు. నీకు ఆరోగ్యము సరిగా లేదా! రాజ వైద్యులను పిలిపించనా! నీకు శరీరంలో ఉన్న బాధ ఏమిటో చెప్పు. పోనీ నీకు ఎవరికైనా మేలు చెయ్యాలని అనుకొంటున్నావా. ఎవరైనా సరే వాళ్లకు ఏం కావాలంటే అది ఇస్తాను. పోనీ నీకు ఎవరి మీదనన్నా కోపం ఉందా చెప్పు. వాళ్లను కఠినంగా శిక్షిస్తాను.
అయ్యో దేవీ! ఏమీ చెప్పకుండా ఎందుకు ఇలా నీ శరీరాన్ని శోషింపచేసుకుంటావు. ఇదిగో ఒకే మాట. చెబుతున్నాను విను. నీవు కోరితే చంప కూడని వాడి నన్నా ఒక్క క్షణంలో చంపేస్తాను. లేక ఉరిశిక్ష వేసినవాడినన్నా నిర్దోషిగా వదిలేస్తాను. కటిక దరిద్రుడిని సకల ఐశ్వర్యవంతుడిని చేస్తాను. లేక ధనవంతుడిని వాడి ధనం అంతా లాక్కొని వాడిని బికారిని చేస్తాను.
దేవీ! నన్ను ఆజ్ఞాపించు. సంభవాన్ని అసంభవంగానూ, అసంభవాన్ని సంభవంగానూ చేస్తాను. కాని నీ కోపం మాత్రం విడిచిపెట్టు. ఇంతెందుకు. నేను నా మంత్రులు, పరివారమూ ఈ రాజ్యము అంతా నీ అధీనమే కదా. నీకు అడ్డేముంది. మేమంతా నీ ఆజ్ఞకు బద్ధులమే కదా! ఇంకా ఈ దిగులు ఎందుకు దేవీ. ఇంతకూ నీకు ఏం కావాలో చెప్పు. నీ కోరికను నా ప్రాణాలు ఇచ్చి అయిన సరే నెరవేరుస్తాను.
నేను యజ్ఞయాగములు చేసి సంపాదించిన పుణ్యఫలము మీద ఒట్టుపెట్టు కొని చెబుతున్నాను. నీ కోరిక ఏదో చెప్పు. నెరవేరుస్తాను. ఈ దేశమే నీది. ఈ రాజ్యమే నీది. ఇందులో ఉన్న సమస్త సంపదలు నీవి. నీకు అడ్డేముంది. కోరుకో! నీ ఇష్టం వచ్చినవి కోరుకో!
నీకు మన రాజ్యము ఎంత ఉందో తెలుసు కదా! ఈ భూమి మీద రథచక్రములు ఎంత మేర తిరుగుతాయో అంత భూమి నా అధీనంలో ఉంది. తూర్యు దిక్కున ఉన్న అన్ని రాజ్యములు, సింధు దేశము. సౌవీర దేశము, సౌరాష్ట్ర దేశమూ, దక్షిణమున ఉన్న అన్ని రాజ్యములు, ఇంకా వంగ, అంగ, మగధ, మత్స్య దేశములు, కాశీరాజ్యము, కోసల రాజ్యమూ అన్నీ మన అధీనములు. ఈ రాజ్యములలో ఉన్న సమస్త సంపదలు మన అధీనములు. ఆ సంపదలలో నీకేది కావాలో కోరుకో ఇస్తాను.
ఓ లలనా మణీ! ఇంతకూ నీ దుఃఖ కారణము, భయ కారణము ఏమి. నాకు చెప్పవా. చెబితేనే కదా నాకు తెలిసేది. ఏం జరిగిందో చెప్పకపోతే నేనేం చేయను చెప్పు.” అని సకలవిధాలా అనునయించాడు దశరథుడు.
దశరథుని మాటలు అన్నీ విన్న కైక “ఇనుము బాగా కాలి సమ్మెటదెబ్బలకు అనుకూలంగా ఉంది. మనం ఎలా వంచితే అలా వంగుతుంది.” అని మనసులో అనుకొంది కైక.
ఇప్పుడు తన మనసులోని మాట మెల్ల మెల్లగా నేర్పుగా బయట పెట్టడానికి ఉద్యుక్తురాలయింది కైక.
(ఇంతకుముందు సర్గలో మనకు మంధర పాత్ర వచ్చింది. ఈ సర్గలో దశరథుని పాత్ర ప్రాముఖ్యం వహించింది. మంధర కైకేయి దాసి. పుట్టింటి నుండి వచ్చింది. సాధారణంగా మంథర మాటకు విలువ ఇస్తుంది కైక. కాని కైకకు రాముడు అంటే చిన్నప్పటినుండి ఎంతో ప్రేమ, మక్కువ. తన కుమారుడు భరతుని తో పాటుపెంచింది. రామునికి పట్టాభిషేకము అంటే ఎంతో సంతోషించింది. ఆ మాట చెప్పిన మంథరకు బహుమానం కూడా ఇచ్చింది.
కైక దశరథుని భార్య. బాగా చదువుకున్నది. విచక్షణా జ్ఞానం కలది అనుకోవాలి. కాని చెప్పుడు మాటలకు మోసపోయింది. ఒకే విషయం పదే పదే చెప్పడం వల్ల అది నిజం అవుతుంది అంటారు పెద్దలు. రాముడు అయోధ్యలో ఉంటే భరతునికి భవిష్యత్తులేదు అనేమాటను పదే పదే వల్లించింది మంథర. రకరకాలుగా వర్ణించి చెప్పింది. అది దాని ఆలోచన. ఒక దాసి అంతకన్నా ఉన్నతంగా ఎలా ఆలోచించగలదు! కాని ఆ మాటలను గుడ్డిగా నమ్మేసింది కైక.
చెప్పుడు మాటలు వినరాదు అని మనకు అందరికీ తెలుసు. కాని సోదాహరణంగా నిరూపించాడు వాల్మీకి. ఎందరో ఎన్నో చెబుతుంటారు. కాని ప్రతివాడూ తన విచక్షణా జ్ఞానం ఉపయోగించాలి.
ఒకాయన ఆఫీసుకు వెళ్లాడు. ఆయన భార్యకు ఆమె తల్లి హాస్పిటల్ లో చేరిందని ఫోన్ వస్తుంది. ఆమె హడావిడిగా బయటకు వస్తుంది. పక్కింటి రామారావు తన బైక్ మీద అప్పుడే బయటకు వెళు తుంటాడు. హాస్పిటల్ దాకా లిఫ్టుఅడుగుతుంది ఆమె. ఆయన సరే అంటాడు. ఆయన వెనక బైక్ మీద కూర్చుని హాస్పిటలుకు వెళుతుంది. వీళ్లిద్దరూ బైక్ మీద వెళ్లడం ఒక అనుమాన పక్షిచూస్తాడు. దానికి కాస్త మసాలా తగిలించి ఆమె భర్తకు “నీ భార్య ఎవరితోనో తిరుగుతూ ఉంది” అని నూరిపోస్తాడు. వాడు నమ్మేస్తాడు. వ్యవహారం విడాకుల దాకా వెళుతుంది. ఇది సర్వసాధారణం. అతడు కాస్త విచక్షణా జ్ఞానం ఉపయోగించి “నాతో ఇన్నాళ్లు పవిత్రంగా నమ్మకంగా కాపురం చేసిన భార్య ఈనాడు సడన్ గా ఎందుకు పరాయివాడితో తిరుగుతుంది” అని కొన్ని క్షణాలు తర్కించుకుంటే నిజానిజాలు బయటపడతాయి. వాళ్ల కాపురంలో కలతలు రావు. అలాగే “రాముడు నా కుమారుడికి ఇంత ద్రోహం చేస్తాడా. మంథర మాటలలో నిజం ఎంత” అని కైక కొంచెం ఆలోచించి ఉంటే రామాయణం మరొక విధంగా ఉండేది. కాబట్టి చెప్పుడు మాటలు వినడం, తొందరగా నిర్ణయాలు తీసుకోడం ఆత్మహత్యాసదృశం అని మనకు బోధ చేస్తుంది రామాయణం.
తరువాత ఈ సర్గలో దశరథుని పాత్ర. దశరథుడు అయోధ్యకు మహారాజు. ఎన్నో యజ్ఞములు యాగములు చేసాడు. వసిష్ఠుని పురోహితునిగా కలవాడు. జ్ఞానవృద్ధుడు వయోవృద్ధుడు. ఆయన భార్య కైక. మూడో భార్య కైక మీద ఆయనకు అధికమైన ప్రేమ ఉందని, ఆయనకు ముద్దులభార్యఅని నానుడి. కాని ఆ విషయం మనకు ఎక్కడా కనపడలేదు. పైగా పాయసం పంచడంలో కైకకు ఎనిమిదవ వంతు మాత్రమే ఇచ్చాడు దశరథుడు. అదీ ఒక వంతు మాత్రం ఇచ్చాడు. రెండవ ఎనిమిదవ భాగం సుమిత్రకు ఇచ్చాడు. దశరథునికి కైక మీద అత్యధిక ప్రేమ ఉంటే సగభాగం ఇచ్చి ఉండేవాడు కదా! కాబట్టి కైక మీద దశరథునికి అధికమైన ప్రేమ ఉంది అనడానికి ఆధారాలు లేవు.
కాని రాబోవు సర్గలలో ఒక విషయం ప్రస్ఫుటంగా అర్థం. అవుతుంది. కౌసల్య పేరుకు పట్టపు రాణి అయినా ఆమెను దశరథుడు నిరాదరించాడు. ఏనాడూ తక్కిన భార్యలతో సమానంగా చూడలేదు. అందుకే కౌసల్య సవతులందరిలో నిరాదరణకు గురి అయింది. రాముడు వనవాసమునకు వెళితో సవతులు తనను బతకనివ్వరు అనివాపోతుంది. దీనిని బట్టి దశరథుడు కైకను ఎక్కువగా ఆదరించాడు అని మనకు తెలుస్తూ ఉంది.
అలాంటి కైక మంథర మాటలు విని కోపగృహంలో పడుకొని ఉంది. దశరథుడు కోపగృహం ప్రవేశించాడు. కోపకారణం అడిగాడు. ఆమె బదులు చెప్పలేదు. అప్పుడు మొదలెట్టాడు. ఈ రాజ్యం నీది అన్నాడు. నేను, నా పరివారము, నీకు దాసులము అన్నాడు. చంపదగని వాడినికూడా నువ్వు కావాలంటే చంపుతాను అన్నాడు. చంపదగిన వాడిని కూడా నువ్వు ఊ అంటే వదిలేస్తాను అన్నాడు. (అంటే నీ కోసం హంతకులను వదిలేస్తాను, నిరపరాధులను ఉ రితీస్తాను అని అర్థం). నువ్వు ఏం కావాలంటే అది ఇస్తాను అంటాడు.
దశరథుడు లాంటి చక్రవర్తి తన భార్య కేవలం కోపంతో ఉంది అన్నంత మాత్రాన ఇంత దిగజారిపోవాలా! పోనీ అన్నీ అబద్ధాలు చెప్పాడు అని అనుకుంటే ఆయన సత్యసంధుడు అని పేరు. మరి వాల్మీకి ఎందుకు అలా రాసాడు? కారణం స్పష్టంగా కనపడుతూనే ఉంది. ఎంతటివారలైనా కాంత దాసులే. రాబోవు కాలంలో జరగబోయే పరిణామాన్ని త్రేతాయుగంలోనే చెప్పాడు వాల్మీకి. నేడు మనం ఎన్నో స్త్రీ సంబంధమైన స్కాండల్సు వింటున్నాము. చూస్తున్నాము. ఎంతటి గొప్పవారైనా తాను కోరుకున్న స్త్రీ ముందు దాసోహం అంటారు. సమస్తం ధారపోయడానికి సిద్ధపడతారు . వాళ్లు చదువుకున్న ఉన్నత విద్యలు, పదవులు, సంస్కారము, ఏవీ గుర్తుకురావు. అడ్డురావు. సమస్తం ఆమెతోడిదే లోకం అన్నట్టు ప్రవర్తిస్తారు. చివరకు ఊబిలో పడిపోతారు. అలాంటి ప్రమాదాల నుండి జాగ్రత్త పడమని వాల్మీకి ఈ సంఘటనల ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు.
అలాగే అహల్య వృత్తాంతం కూడా. అహల్య తన భర్త గౌతముని కాకుండా పరాయి పురుషుడితో కామక్రీడలు కొనసాగించింది. ఫలితం వెంటనే అనుభవించింది. కొన్ని వందల సంవత్సరాల పాటు అచేనంగా ఒంటరిగా దుమ్ము ధూళిలో పడి ఉంది. ఈరోజుల్లో కూడా పరాయి పురుషుడి మోజులో పడిన స్త్రీలు, స్వంత భర్తను, పిల్లలను హతమార్చడం లాంటి సంఘటనలు వింటున్నాము. వెంటనే కటకటాల పాలవుతున్నారు. శిక్షలు అనుభవిస్తున్నారు.
ఈ రోజుల్లో స్త్రీలు పతివ్రతలు కానక్కరలేదు. కనీసం భర్తకు విధేయతగా ఉంటేచాలు. సంసారం సాఫీగా గడిచిపోతుంది. ఈ సందేశాన్ని మనకు అహల్య వృత్తాంతం ద్వారా అందించాడు వాల్మీకి.
రామాయణం కేవలం ఆధ్యాత్మిక కావ్యంగా కాకుండా ఒక సామాజిక గ్రంధంగా చదవగలిగితే ఇలాంటి సూక్తులు ఎన్నో మనకు మన దైనందిన జీవితంలో ఉపకరిస్తాయి అని నా భావన.)
మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. అయోధ్యాకాండం లోని నవమ సర్గ, రామాయణంలోని ఒక ప్రధాన భాగం. ఈ సర్గలో రాముడు అయోధ్యను విడిచిపోవడం మరియు ఆ క్రమంలో జరిగిన సంఘటనలు చిత్రీకరించబడ్డాయి. రాముడి పుట్టుక, బాల్యము, మరియు రాజ్యాభిషేకము వరకు జరిగిన సంఘటనలు అయోధ్యాకాండలో ప్రస్తావించబడినవి. నవమ సర్గలో రాముడు, సీత, మరియు లక్ష్మణులు అయోధ్య నుండి వనవాసానికి బయలుదేరుతారు. ఈ సందర్భంలో దశరథ మహారాజు, కౌసల్యా మరియు అయోధ్య ప్రజలు అనుభవించిన దుఃఖాన్ని ఈ సర్గలో వివరించబడింది. కుటుంబబాంధవ్యాలు, విధి, మరియు త్యాగం వంటి ముఖ్యమైన విషయాలు ఈ సర్గలో ప్రధానంగా ఉంటాయి.
ఒక అబద్ధాన్ని పదే పదే వల్లిస్తే అదే నిజం అని నమ్మే పరిస్తితి వస్తుంది. ఇది ఏ ఒక్కరికీ పరిమితం కాదు. విద్వాసుల దగ్గరినుంచీ నిరక్షరాస్యులవరకూ జరుగుతుంది. కైక విద్వాంసురాలు. దశరథుని భార్య. కేకయ దేశపు రాకుమార్తె. కాని మంథర మాటలకు లోబడి పోయింది. రాముడు పుట్టినప్పటినుండి, రాముని తన కుమారునికన్న ఎక్కువ గారాబంగా పెంచింది. రాముడు అంటే కైకకు ప్రాణం. కాని మంథర చెప్పుడు మాటల ముందు ఇన్నాళ్లు తాను రాముని మీద పెంచుకున్న ప్రేమ అనురాగము ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఒక్కసారిగా రాముని మీద ద్వేషము అసూయ ప్రబలాయి.
మంథర చెప్పిన మాటలు వినగానే కైకకు కోపం తారస్థాయికి చేరుకుంది. రోషంతో మంథరతో ఇలా అంది.
“మంధరా! ఆలోచించగా నీవు చెప్పినదే నిజము అనిపిస్తూ ఉంది. ఇంక ఆలస్యము చేసి ప్రయోజనము లేదు. రాముడు ఉన్నంత వరకూ భరతునికి భవిష్యత్తు లేదు. రాముడు అడవులకు వెళ్లాలి, భరతుడు యువరాజుగా పట్టాభిషిక్తుడు కావాలి. ఇదే నా తక్షణ కర్తవ్యము. మంథరా! నాకు ఏమీ తోచడం లేదు. ఎలాగైనా రేపటి పట్టాభిషేకము ఆగిపోవాలి. భరతుడు రాజ్యాభిషిక్తుడు కావాలి. దీనికి తగిన ఉపాయం చెప్పు.” అని అడిగింది కైక.
తన పాచిక పారినందుకు మంథర లోలోపల సంతోషించింది. ఇందులో మంథరకు లాభించింది ఏమీ లేదు. రాముడు పట్టాభిషేకం ఆగిపోతే మంధరకు ఒరిగింది ఏమీ లేదు. కాని మహారాణి కైక తన మాటకు విలువ ఇచ్చింది. అదే మంథరకు పదివేలు. మంథర రెచ్చిపోయి కైకతో ఇలా అంది.
“నా మాటలకు విలువ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉ దమ్మా. ఏ పని అయిన చెయ్యడం కష్టం కాని చెడగొట్టడం ఎంత సేపు. రేపు జరగబోయే పట్టాభిషేకము పటాపంచలు చేసే ఉపాయము ఒకటి చెబుతాను. సావధానంగా విను. అయినా నీకు తెలియదటమ్మా! నేను చెప్పాలా చెప్పు. నీకు అన్నీ తెలుసు. ఈ ముసలి దాన్ని పరీక్ష చేస్తున్నావు కదూ. అయినా అడిగావు కాబట్టి చెప్పాలి కదా!” అంది మంథర
వెంటనే కైక తాను కూర్చున్న ఆసనము మీది నుండి లేచి మంథర దగ్గరగా వచ్చింది. “లేదే మంథరా. నాకు ఏ ఉపాయమూ తట్టడం లేదు. భరతునికి పట్టాభిషేకం జరగాలి. అది ఎలాగో చెప్పు.” అని అడిగింది కైక.
“దానికే వస్తున్నానమ్మా! నీవు ఒకసారి నాతో ఒక విషయం చెప్పావు గుర్తుందా. అదేనమ్మా! దేవాసుర యుద్ధంజరిగింది కదా. అప్పుడు ఇంద్రుడికి సాయంగా నీ భర్త దశరథుడు కూడా వెళ్లాడు. ఆయనతో పాటు నువ్వు కూడా వెళ్లావు. మీరంతా దండకారణ్యంలో నివాసం ఉన్న తిమిరధ్వజుడు అనే రాక్షసుని మీదికి యుద్ధానికి వెళ్లారు. ఆ అసురుడు మాయావి. దేవతలనందరినీ ఓడించాడు. ఇంద్రునితో కూడా యుద్ధము చేసాడు. పగలంతా యుద్ధం చేసిన దేవతలు తీసుకుంటున్నారు. నిశాచరులైన రాక్షసులు రాత్రి రాత్రికి రాత్రి దేవతలను ఊచకోత కోసారు. అప్పుడు దశరథ మహారాజు ఆ అసురులతో యుద్ధానికి దిగాడు. కాని రాక్షసులు దశరథుని ఒళ్లంతా తూట్లు పడేట్టు కొట్టారు. నీ భర్త కిందపడి నీ పోయాడు. స్పృహ కోల్పోయాడు.
అప్పుడు నీవు నీ భర్తను రణరంగము నుండి దూరంగా తీసుకొని పోయి కాపాడావు కదా! కాని రాక్షసులు మిమ్ములను వెంబడించి యుద్ధం చేసారు. మరలా నీవు నీ భర్తను రణరంగంనుండి రాక్షసుల కంట పడకుండా దూరంగా తీసుకొని పోయి కాపాడావు. అలా నీ భర్తను రెండు సార్లు ప్రాణాపాయం నుండి రక్షించావు. నీవు చేసిన మహోపకారమునకు నీ భర్త దశరథుడు ఎంతో సంతోషించాడు. నీకు రెండు సార్లు ఆయన ప్రాణాలు కాపాడావు కాబట్టి నీకు రెండు వరాలు ఇస్తాను అని అన్నాడు. వాటిని నీవు కోరుకోకుండా నీ ఇష్టంవచ్చినప్పుడు కోరుకుంటాను అని అన్నావు. ఇదంతా నీవు చెబితేనే నాకు తెలిసింది.
ఇప్పుడు ఆ వరాలతో పని పడింది. ఆ వరాలను ఇప్పుడు కోరుకో. ఒక వరంగా రామునికి 14 ఏళ్ల వనవాసము. రెండవ వరంగా భరతునికి యౌవరాజ్య పట్టాభిషేకము. దానితో రామ పట్టాభిషేకము ఆగిపోతుంది. నీ కోరిక నెరవేరుతుంది. రాముడు రాజ్యంలో లేకపోతే భరతుడు ప్రజలకు దగ్గర అవుతాడు. వారి ప్రేమ అభిమానములను చూరగొంటాడు. అయోధ్యావాసులు భరతుని తమ ప్రభువుగా అంగీకరిస్తారు. రాముని మరిచిపోతారు. భరతుడు రాజుగా స్థిరపడతాడు. నీవు రాజమాతగా వెలిగిపోతావు. ఇదీ పధకము.
ఈ పథకము అమలు చేయడానికి ముందు నీవు కోపగృహము అలంకరించాలి. మాసిన వస్త్రములు కట్టుకొని, తలకు కట్టుకట్టుకొని నేలమీద పడుకోవాలి. కొంచెం కష్టమే అయినా తప్పదు కదా! దశరథుడు నీ దగ్గరకు వచ్చినపుడు పెద్దపెట్టున ఏడిచి గోల చేయాలి. ఆయన వంక చూడను కూడా చూడకూడదు. మాట్లాడ కూడదు. ఆయన మాట్లాడించినా ఎడమొహం పెడమొహంగా ఉండాలి.
నువ్వు అంటే దశరథునికి ఎంతో ప్రేమ అభిమానము. నీ కోసం ఏమి చెయ్యమన్నా చేస్తాడు. ఆఖరుకు నిప్పుల్లో దూకమన్నా దూకుతాడు. నువ్వు బాధతో ఉంటే చూడలేడు. నువ్వు ఏం అడిగినా ఇస్తాడు. తుదకు తన ప్రాణాలు ఇవ్వమన్నా సంతోషంగా ఇచ్చేస్తాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దేవాసుర యుద్ధంలో నీకు ఇస్తానన్న రెండు వరాలు ఇప్పుడు అడుగు. నీకు మణులు, రత్నాలు ఆభరణాలు ఇస్తానని ప్రలోభ పెడతాడు. కాని వాటికి ఆశపడవద్దు. రెండు వరాలు జాగ్రత్తగా కోరుకో.
మొదటి వరం రాముని పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసమునకు పంపడం. రెండవ వరము గా భరతుని యువరాజుగా పట్టాభిషిక్తుని చేయడం. రాముడు రాజ్యములో ఉంటే నీ కుమారుని ఎవరూ రాజుగా అంగీకరించరు. రాముడు అడవులకు వెళితే క్రమక్రమంగా భరతుడు రాజుగా వేళ్లూనుకొని స్థిరపడతాడు. రాముడు వనవాసమునకు వెళ్లడం ఒక వరంగా కోరాలి. లేకపోతే రాముడు అయోధ్యలోనే ఉండే ప్రమాదం ఉంది. రాముడు వనములకు వెళితే ప్రజలు రాముని మరిచిపోతారు. నీ కుమారుడు భరతుని రాజుగా అంగీకరిస్తారు. రాముడు ఒక వేళ వనవాసము నుండి తిరిగి వచ్చినా భరతుడు రాజ్యమును ఇయ్యడు. కాబట్టి ముందు రామ పట్టాభిషేకమును ఆపించవలెను.” అని మంథర కైకకు ఒకటికి పది సార్లు చెప్పిందే చెప్పి నూరిపోసింది.
మంథర దుర్బోధలు బాగా తలకెక్కాయి కైకకు. తన కొడుకు భరతుడు అప్పుడే యువరాజు అయినట్టు కలలు కంటోంది. తన శ్రేయస్సు కోరి ఇంతగా తనకు ఆలోచనలను చెప్పిన మంథరను మనసులోనే అభినందించింది.
(ఇక్కడ వాల్మీకి ఒక వాక్యం రాసాడు. కైకేయి స్వతాహాగా మంచి గుణములు కలది అయినా తన దాసి మంథర దుర్బోధలను విని ఏమీ తెలియని అమాయకురాలైన బాలిక వలె చెడుతోవలో నడిచింది. అని. ఇలాంటి మంధరలు మనకు ప్రతి ఇంటా కనపడతారు. వాళ్లు మన బంధువులైనా కావచ్చు లేక పక్కింటి వాళ్లు ఎదురింటి వాళ్లు కావచ్చు. వారి చెప్పుడు మాటలకు లోబడి సంసారాలు చెడ గొట్టుకొనే కైకలు ఎంతో మంది మన కళ్లముందే కనపడతున్నారు.)
“ఆ హా మంధరా! నీకు ఎన్ని విషయాలు తెలుసే. నాకు ఎన్ని మంచి విషయాలు చెప్పావు. నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయని నాకు ఇంతవరకూ తెలియదు. నీమేలు ఎన్నటికీ మరువలేను. మంథరా! అసలు నువ్వు చెప్పకపోతే నాకు మహారాజు మనసులో ఏముందో తెలిసి ఉండేది కాదు. నీవు రూపానికి కుబ్జవే కాని బుద్ధిలో బృహస్పతివి. నువ్వు చెప్పినట్టు రాముడు అడవులకు పోయి నా కొడుకు భరతుడు రాజైతే నీ ఒళ్లంతా బంగారు తొడుగు వేయిస్తానే. నువ్వు నాకు ఎలా సేవలు చేస్తున్నావో, ఇతర దాసీల చేత నీకు అలా సేవలు చేయిస్తాను. ఆ కౌసల్య దాసీలు నిన్ను చూచి అసూయపడేలా చేస్తాను.” అని మంథరను పొగిడింది.
తన రాణి కైక తనను అలా పొగుడుతుంటే మంథర పొంగి పోయింది. “ఏంటమ్మా ఇంకా ఇలాగే ఉన్నావా. నేను చెప్పినవి అన్నీ అప్పుడే మరిచిపోయావా” అంది మంథర.
“లేదు లేవే. అన్నీ గుర్తున్నాయి.” అంటూ తన అలంకారములు అన్నీ ఒకటి ఒకటిగా తీసేసింది. పట్టు బట్టలు విప్పి మాసిన చీర కట్టుకుంది. తలకు కట్టు కట్టింది. నేలమీద పడుకుంది.
“మంథరా! రాజుగారు వస్తే ఇలా చెప్పు. భరతుడు రాజైనా కావాలి. లేకపోతే నేను చావనన్నా చావాలి. అదే నా కోరిక అని చెప్పు. ఇంకా ఏమంటావంటే అక్కడ రాముడికి పట్టాభిషేకం జరిగితే ఇక్కడ నా ప్రాణాలు పోతాయి అని చెప్పు.” అని పలికింది.
“అవన్నీ నాకు తెలుసు లేవమ్మా. నువ్వు మాత్రం రాజుగారితో ఖచ్ఛితంగా ఉండు. రాముని అరణ్య వాసము, భరతుని పట్టాభిషేకము ఇవి రెండే కావాలి అని చెప్పు.” అని చెప్పింది మంథర.
“అంతా నువ్వు చెప్పినట్టే చేస్తాను లేవే.” అని పలికింది కైక.
అయోధ్యాకాండము పంచత్రింశః సర్గము (35వ సర్గ) రామాయణంలో భావోద్వేగభరితమైన భాగం. ఈ సర్గలో, రాముడు, సీత, లక్ష్మణులు చీరలను ధరించి, గంగా నదిని చేరుకుంటారు. అక్కడ నదిని దాటేందుకు గుహ అనే గిరిజన రాజును కలుస్తారు. గుహ, రామునికి తన భక్తిని, ప్రేమను ప్రదర్శిస్తాడు. రాముడు, సీత, లక్ష్మణులకు సేవ చేస్తాడు. వారు అరణ్యవాసం ప్రారంభం చేసేందుకు నదిని దాటుతారు. ఈ సర్గ రాముని వినయాన్ని, సీతా, లక్ష్మణుల సహనాన్ని, గుహ భక్తిని మరియు దాతృత్వాన్ని చూపిస్తుంది. రాముడు ధర్మాన్ని పాటిస్తూ ప్రజల కోసం త్యాగం చేసే వ్యక్తిగా ఇక్కడ ప్రదర్శించబడతాడు.
అప్పటి దాకా జరిగినది అంతా మౌనంగా చూస్తున్నాడు సుమంత్రుడు. అతని మనస్సు కోపంతో రగిలిపోతూ ఉంది. చేతులు నులుముకుంటున్నాడు. మాటి మాటికీ తల కొట్టుకుం టున్నాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ఇంక తట్టుకోలేక పోయాడు. కైకను చూచి ఇలా అన్నాడు.
“ఓ కైకా దేవీ! మీరు మా మహారాజు భార్య అని ఇంతవరకూ గౌరవించాము. మీరు మా మహారాజునే వదిలి పెట్టాము అన్నారు. మా మహారాజునే వదిలిన మీరు ఎంతకైనా తెగించగలరు. మా మహారాజును నీ దుర్మార్గపు పనుల వలన చిత్రవధ చేసి చంపుతున్నావు. నీవు ఇక్ష్వాకు కులమును నాశనం చేయడానికి వచ్చావు. మహారాజుగారు నీవుకోరిన వరాలు ఇస్తానన్నాడు కదా. ఇలాంటి వరాలు కోరాలా! స్త్రీలకు భర్త కంటే వేరు దైవము లేరని తెలియదా! రాజుగారు మరణించినపుడు జ్యేష్టుడు రాజ్యాధి కారము వహిస్తాడు. ఈ ధర్మము నీకు తెలియదా! నేడు ఆ రాజధర్మమును ఎందుకు మార్చాలని ప్రయత్నిస్తున్నావు. నీ కుమారుడు భరతుడే రాజైతే మేమందరమూ రామునితో పాటు అడవులకు వెళుతాము. నీవు చేస్తున్న దుర్మార్గాలనూ ధర్మవిరుద్ధమైన పనులనూ చూస్తూ బ్రాహ్మణుడు ఎవరూ అయోధ్యలో ఉండడు. అయోధ్యలో ఉన్న బ్రాహ్మణులు ప్రజలా అంతా రాముని అనుసరించి వెళ్లాక, నీవు, నీకొడుకు ఒంటరిగా ఈ నిర్మానుష్యమైన అయోధ్యను ఏలుకోండి. ఈ శ్మశానాన్ని ఏలుకుంటూ నీవు ఏమి ఆనందాన్ని పొందుతావో నేనూ చూస్తాను.
నీవు ఇన్ని దుర్మార్గాలు చేస్తుంటే ఈ భూమి ఎందుకు బ్రద్దలయి నిన్ను తనలో కలుపుకోలేదో నాకు ఆశ్చర్యంగా ఉంది. రాముని అరణ్యములకు పంపుతున్నావు అన్న వార్త విని నిన్ను ఛీ కొట్టుచున్న వారి శాపములతో నీవు ఇంకా ఎందుకు భస్మం కాలేదా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. వేపచెట్టుకు పాలుపోసి పెంచినా దాని చేదు పోనట్టు మా మహారాజుగారు నిన్ను ఎంత ప్రేమగా చూచినా ఆయన పట్ల నువ్వు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావు. ఈ క్రూరత్వము నీకు జన్మతా వచ్చినదా అని సందేహాము గా ఉంది. ఎందుకంటే నీ తల్లి నీ కన్నా క్రూరురాలు అని మేము విన్నాము.
నీ తండ్రికి ఒక ఋషి ఒక వరం ఇచ్చాడు. దాని ప్రభావం వలన ఆయనకు అన్ని జంతువుల భాషలూ అర్ధం అయ్యేవి. ఒకరోజు నీ తండ్రి పడుకొని ఉండగా నేల మీద పాకుచున్న చీమ మాటలు విని, పక్కున నవ్వాడు. ఆ విషయము తెలియని నీ తల్లి తనను చూచి ఎగతాళిగా నవ్వుతున్నాడు అని అనుకొంది. “నన్నుచూచి ఎందుకు నవ్వుతున్నావు,కారణమేమి” అని నీ తండ్రిని నిలదీసింది. “దేవీ! నా నవ్వుకు కారణం చెబితే నాకు మరణం సంభవిస్తుంది. అందుకని దాని గురించి నన్ను అడగవద్దు.” అని అన్నాడు. అప్పుడు నీ తల్లి ఏమన్నదో తెలుసా! “నీవు బతికితే బతుకు, లేకపోతే చావు. కాని నన్ను పరిహసించి నవ్విన దానికి కారణం చెప్పి తీరాలి” అనిపట్టుబట్టింది. అప్పుడు నీ తండ్రి ఏమన్నాడో తెలుసా! “నీ పట్టుదల కోసం నా ప్రాణాలు పోగొట్టుకోలేను. నువ్వు ఉంటే ఉండు పోతే పో. నేను మాత్రము చెప్పను.” అని అన్నాడు.
ఓ కైకా! నీకూ నీ తల్లి బుద్ధులు వచ్చినట్టున్నాయి. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు. మా మహారాజు నీ తండ్రి వలె ప్రవర్తించకపోవడం వల్లనే రాముడు అరణ్యములకు వెళుతున్నాడు. కొడుకులకు తండ్రి గుణాలు, కూతుళ్లకు తల్లి గుణాలు వారసత్వంగా సంక్రమిస్తాయి అని నీవల్ల ఋజువు అయింది. కనీసం ఇప్పటి కన్నా నీ బుద్ధి మార్చుకొని, నీ పట్టుదల మాని, నీ వరములు ఉపసంహరించుకో. ఈ అయోధ్యను, ప్రజలను కాపాడు.
మరి ఇది నీవు పుట్టిన బుద్ధి లేక ఎవరి చెప్పుడు మాటలు విన్నావో తెలియదు కానీ నీచేతల వలన మా మహారాజును అధర్మపరుడిగా చేయకు. మా మహారాజు నీకు ఇస్తానన్న వరాలు ఇస్తాడు. కానీ నీవే నీ మాట మార్చుకో. వేరే ఏవైనా కోరుకో. జ్యేష్టుడైన రామునికి పట్టాభిషేకము జరిపించు. అలా కాకుండా రాముడు అరణ్యములకు వెళితే ఈ లోకంలో నీకు తీరని అపవాదు కలుగుతుంది. ఇంతకాలము బాగా బతికి ఇప్పుడు ఎందుకు ఇంతటి అపవాదును మూటగట్టుకుంటావు. నా మాట విను. రామ పట్టాభి షేకము జరిపించు. తన పూర్వీకుల మాదిరి దశరథుడు సంతోషంగా తపస్సుచేసుకోడానికి అడవులకు వెళతాడు.” అని సుమంత్రుడు నయానా భయానా కైకకు నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. కాని కైకకు సుమంత్రుడి మాటలు రుచించలేదు. తన పట్టు వీడలేదు. రాముడు అరణ్యములకు వెళ్లాల్సిందే అని మొండిగా వాదించింది.