ఒకానొక నృసింహ జయంతి సందర్భంగా అన్నమాచార్యులవారు చెప్పిన కీర్తననాస్వాదించండి. “ఓనరులారా! నేటిదినముననే స్తంభములో నరసింహుడు వుదయించి హిరణ్యకశిపుని తుదముట్టించి దేవతలకు శుభములను ఆనందమును యొసగినాడు” అని, ఆయన ప్రహ్లాదుని రక్షించిన వైనం కీర్తిస్తున్నారు. శ్రీవేంకటగిరి ఆదిమ పురుషుడైన ఆ ఏడుకొండలవాడే ఈయనైనందువలన వంచన సేయక మంచి వరాలిస్తాడు అని అంటున్నారు. ఈ ఔభళేశుడు (అహెూబల నరసింహుడు) గురుతరమైన బ్రహ్మాండ గుహలో వెలసినాడట.
భావ వివరణ:
ఓ నరులారా! నేడే నృసింహ జయంతి. ఈ నరసింహ జయంతి నాడే ఆయన స్తంభమున వెలసి హిరణ్యకశిపుని వధించి సురులకు ఆనందము కలిగించి శుభములనొసగినాడు.
ఈ ఔభళేశుడు (అహోబలేశ్వరుడు) సందించి (పూని) వైశాఖ శుద్ధ చతుర్ధశినాడు, శనివారము రోజున సంధ్యా సమయమున ఆవిర్భవించినాడు. చక్కగా ఆ హిరణ్యకశిపుని వరముల ననుసరించియే కంభములో పొడమి (స్తంభములోనుంచి పుట్టాడు కాబట్టి యే తల్లిదండ్రికి పుట్టనివాడైనాడు). ఒక కడపమీద వాడిని చంపాడు (కాబట్టి ఇంటా బయటా కాని చోటనే వాడు చచ్చాడు). కందువ (సామర్థ్యంతో) తనవాడియైన గోళ్ళతో (యే ఆయుధముతోను వాడికి చావులేదు కాబట్టి) చీల్చి ఆ కనకకశిపుని (హిరణ్య కశిపుని) వధించినాడు.
ఈయనయెట్లా వున్నాడో ఒకసారి చూడండి. ఈయనది నరమృగరూపము (తల సింహానిది శరీరము నరునిది), నానాహస్తములు (చాలా చేతులు వున్నందున నరుడు కూడా కాదు). అరిది (ఉపయోగింపబడని) శంఖచక్రములు ఆయన హస్తభూషణములుగా వున్నవి. గరిమ (అద్భుతముగా) తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుని కాపాడి రక్షించి నిలిచినాడు. ఎక్కడ? బ్రహ్మాండమైన ఈ అహెూబలం కొండ గుహలో నిలిచినాడు.
ఎట్లా నిలిచాడో గమనించండి. ఆ దనుజుని వధానంతరం వెంటనే బంగారు గద్దెపై (సింహాసనముపై) మించుగ (వున్నతముగా) ఇందిరను (శ్రీలక్ష్మిని) తన తొడపై కూర్చుండబెట్టుకొని కొలువైయున్నాడు. ఈయనే అంచె (ఆ తరువాత) శ్రీవేంకటగిరి మీద ఆది పురుషుడు శ్రీవేంకటేశ్వరుడై నిలిచాడు. వంచన సేయక (నమ్మిన తన భక్తులను వంచించక) మంచి మంచి వరములనిస్తున్నాడు. అదిగో ఆయనకు మ్రొక్కండి.
జానపదులు కోలాటములాడుతూ పాడే మధురమైన కీర్తన అన్నమాచార్యులవారి ద్వారా ఆస్వాదించండి. అల్లోనేరేడు పళ్ళవలె మధరములైన నెయ్యములు (స్నేహములు) ఒయ్యన (తిన్నగా) వువ్విళ్ళురు చున్నవి. ఇది ఆట ప్రధానమైన కీర్తన. బాహుమూలములలో పలచని చెమటల గురించి వర్ణించగలిగిన సత్తా అన్నమయ్యకు మాత్రమే వున్నదని వేరే చెప్పక్కరలేదు. ఇది సుగ్రాహ్యము అనుకోవడానికి వీలులేని కీర్తన. జాగ్రత్తగా చదివితేకాని అర్థంకాదు, మరి.
భావ వివరణ:
మా నెయ్యములు (స్నేహము) అల్లోనేరేడు పండ్లవలె మధురమైనవి. ఒయ్యన (తిన్నగా) వువ్విళ్ళూరెడ్డి మా అనుబంధం దినదిన ప్రవర్ధమానమవుగాక!
బాహుమూలములలో పరిఢవిల్లిన లే చిత్తడి చెమటల చెలమలలో అందములు అలంకార ప్రాయమైనవి. ఈ నృత్యమువలన చెమట ఇంకా అధికమై, థళథళమను (తళతళమని) మెరయు ముత్యములను చెరుగు సురటి (విసనకఱ్ఱ), దులిపేటి నీళ్ళతుంపరల వలె వున్నవి.
ఈ గోవిందుడు తన విరహంతో ఆమెనెంత బాధిస్తున్నాడంటే, ఆమె కన్నుల నుండి తొట తొటమని కన్నీరు కురియుచున్నది. ఆమె అది తాళలేక అలుక వహించినది. ఆ చిటిపొటి (చిన్న చిన్న) అలుకలు చివరికి చిరునవ్వులై రావిపండురంగులోనున్న నీ వన్నెల అధరమునాస్వాదించి | గుక్కిళ్ళువేయుచూ (గుటకలు మింగించినది). అలుకలు మరింత మధురమైనవి.
ఓ గరగరికల (నిర్మలుడవైన) వేంకటేశ్వరా! నీ కౌగిటిలో పరిమళములు వెదజల్లు మీ ఒంటిపై పూతలు ఒండొరులకు ఎలా వున్నాయంటే మన్మథుని వింటినుండి వెలువడిన కమ్మని పుష్పబాణములు కూడా గురిగా తాకునట్లు మీపై వేసిన ఇనుప గుగ్గిళ్ళవలెనున్నవి.
దైవం బలవత్తరం భువనే
నైవ రోచతే నర్మ మయి
ఏవమేవ భవదిష్టం కురు కురు
శ్రీ వేంకటాద్రి శ్రీనివాస.
||అంజలి||
అవతారిక:
చక్కటి సంస్కృత కీర్తన వినిపిస్తున్నారు అన్నమాచార్యులవారు. నాయిక శ్రీవేంకటేశ్వరునిపై అలిగింది. నీకు దండం పెడతాను నన్నెందుకు మాటలతో ఏడిపిస్తావు. అని రుసరుసలాడిందామె. నీవెవరివి? నేనెవరిని? పోపోవయ్యా! అని పోట్లాడింది. కాని ఆయన లేకుండా క్షణం |వుండలేదామె. చివరికి నీ ఇష్టం మహాప్రభో! అని లొంగిపోయింది.
భావ వివరణ:
నీకు ఈ నమస్కారములు, వందనములు. నాకు నీ మాటలతో యెందుకు దుఃఖమును కలిగిస్తున్నావు?
దేవా! నన్నెందుకు తలచెదవు? నాతో నీకేమిటి? నీవెవరవు? నీకు నేనేమవుతాను? నీవు నాకేమవుతావు? పనివున్నదయ్యా? నాపై నీకు శంకలేకుంటే ఇక్కడికెందుకు వచ్చావు?
ఓ మనసిజ జనకా! (మన్మధునికి తండ్రీ) నీ వినయపు మాటలకు నేను యోగ్యురాలనా? కానయ్యా! నీవు మరల మరల పూజింపదగిన వాడివైయున్నావు. దినదినమూ జరిగే ఈ కలహాలతో నీకేమి పనిలే? ఓ | రమారమణా! నేను దీనితో విసిగిపోయాను.
భువనములో దైవమే బలవత్తరమైనది. నాయందు నీవంచనలు నాకు రుచించవు. పోనీలే, నీకేది ఇష్టమో అదేచేయుము. ఓ వేంకటాద్రిపైనున్న శ్రీనివాసా! నేనేమనగలను?
అంగదునివలె నేను ఆడవము బట్టనేర
సంగరమున సుగ్రీవునివలె సాధింపనేర
గాలిపక్షివలెనేను తాలిమిగమోయ నేర
బలిమితో హనుమంతునివలె పాటుపడనేర
||రామ||
లీలతో శబరివలె లాలించి విందిడ నేర
మేలిమిగ సీతవలె మెప్పిరంపనేర
గజరాజువలె నేను గట్టిగా మొరపెట్టనేర
విజయుని సతివలె వినుతింపనేర
గురిగ జాంబవంతునివలె కోరిభజింపగ నేర
॥రామ||
చేరి విభీషణునివలె శరణననేర
వరజటాయువలె ప్రాణములియ్యనేర
కరము నహల్యవలె గీర్తింపనేర
నేను రామదాసులవలె పూని మిము భజియింపనేర
నన్ను రక్షింపు భద్రాచల రామధీర
॥రామ||
67. పున్నాగవరాళి ఆదితాళము
పల్లము : రామప్రభో నీదయ నామీదను రాదేమయా శ్రీరామ
పామరుడను జడుడను తామసుడను
నేను వర్ణితంబగు నరపశువును నీ మహత్మ్య మెన్న నెంతటి వాడను
॥రామ||
రామ రామ యనిదలతు నిరంజన రామ
పరుల వేడనంటి నీ పదయుగ్మములే నమ్మి యుంటిని
నన్నరమర చేయవద్దంటిని శ్రీహరియని వేడుకొంటి
అద్భుతమైన సంస్కృత కీర్తననావిష్కరిస్తున్నారు అన్నమాచార్యులవారు. కృష్ణుని మాయమాటలు నమ్మి మోసపోయాననుకొని చింతిస్తున్న నాయిక నిర్వేదంతో అంటున్న పలుకులివి. ఎందుకు ప్రేలాపనలవంటి మాటలు మాట్లాడతావు. దానివల్ల యేమిలాభం? పోపోవయ్యా! అని ఆవిడ విసుక్కొంటున్నది. నీకు నమస్కరించినందువల్ల ప్రయోజనమేమిటి అనేంత నిస్పృహకు లోనైంది ఆమె.
ఇతర వధూటీమణులయందు వ్యామోహము గలిగిన నీకు హితవు బోధించాలని చూడటం ఎంత అవివేకమైన పని? నిన్నే నమ్ముకొన్న నన్ను కల్లబొల్లి కబుర్లతో ప్రసన్నురాలను చేయాలని చూచెదవు, యెందుకు? | గతజల సేతుబంధనము వలన కలిగే ప్రయోజనమేమిటి?
నీవు కపటివి. కపట వినయములు. నీవు దుర్మతివైన విటుడవు. నీకు సున్నితమైన స్తుతులవలన ప్రయోజనమేమిటి? నాయందు గొప్ప | క్రోధమును ప్రకటిస్తున్నావు. ఇదంతా చర్వితచరణమే.
నీయందు స్థిరమైనట్టి నా నమస్కారములు, విరసాలాపనలు అవుతుంటే… యేమి ప్రయోజనము కలుగుతుంది? ఓ తిరువేంకటగిరి దేవా! నీయందు విరహవేదన నిష్ప్రయోజనమవుతున్నది ప్రభూ!
కిన్నెర వెంకటగిరి కిసునరాయఁడ నీవు
వన్నెలుగ వీధి వీధి వాయించఁగా
మిన్ను దాఁకి లోకానకు మేఁటియైన లకిమమ్మ
నిన్ను సేరి సరుగన నిలుసుండే సొక్కెను
||సిన్న||
అవతారిక:
జానపదుల బాణీలో సాగిన కృష్ణలీలామృతం వినిపిస్తున్నారు. అన్నమాచార్యులవారు. ఈ కీర్తనలో ఆయన వాడిన బాలకిసున రాయడు, సిక్కుసీరై పోయను, సప్పుసారైపోయను వంటి మాటలు జానపద సాహిత్యంలో వుంటాయేమోకాని నేటి తెలుగు పాఠకులకు సుపరిచితాలు కాదు. ఈ బాలకృష్ణుని చిన్నవాడని నమ్మటానికి వీలులేదట. నేడు ఈ వెంకటగిరి కిసునరాయడు వీధివీధిలో కిన్నెర వాయిస్తుంటే లకిమమ్మ ఆయనను సేరి సరుగున నిలుసుండిందట. ఈ పాటికి మీకూ కొంత బుర్రకెక్కింది కదా!
భావ వివరణ:
ఓ కిసునరాయా! (కృష్ణరాయా!) నిన్ను చిన్నవాడవని నమ్మసెల్లదు. (నమ్మకూడదు). సిన్నైన యాటదెల్లా (యుక్తవయసు వచ్చిన ప్రతి ఆడపిల్లా) | నీమూలంగా, సిక్కు సీరై పోయను (సిగ్గుతో చితికిపోయింది).
అవుర బాలకిసునరాయడ (ఔరా! బాలకృష్ణరాయా!) నీవు సంటిపాలు (స్తన్యము) రుచిగావుంటుందని పూతన స్తనము చప్పరించి నెత్తురంతా పీల్చేస్తే అది కవకవ (వికటంగా నవ్వినవ్వి కళ్ళు తేలేసింది. సవరని యాటదెల్ల (అందమైన ఆ యువతి పూతన) సప్పుసారైపోయను (చచ్చి శవమై పోయింది).
ఓ గోపాల కృష్ణరాయా! నీవు అదిగో ఆ గొల్లవాడలో మగువల చూపులు వల్లెవేయగా (చూపులతో చూపులు కలిపి చిలిపి సంకేతాలీయగా), సూరబోయె రేపల్లె (సిగ్గుతో రేపల్లె చితికిపోయింది). గుబ్బలవంటి కుచగిరులున్న గొల్లెతల చేరడేసి కన్నులు ‘సిన్ని సిన్ని సిగ్గులు’ చిమ్మినవి.
ఓ వేంకటగిరి కిసునరాయ (వేంకట కృష్ణరాయా!) నీవు వన్నెలుగ (అందముగా) వీధివీధిలోనూ కిన్నెర (వీణ) వాయించగా అది, మిన్నుదాకి (ఆకాశంలో మారుమ్రోగి) జగదేకసుందరియైన ‘లకిమమ్మ’ (లక్ష్మీదేవి) నిన్ను చేరి సరుగున (నీ పక్కన) నిలుసుండే సొక్కెను (నిలబడి యుండగానే పరవశంతో నిద్రించినది).
నేరు పేదో నేర మేదో నిలిచిన దొకటేదో
వూరకే నీదాసులమై వున్నారము
చేరి నన్నేలినయిట్టె శ్రీవేంకటేశ్వర
గారవించి కరుణించి కావఁగదవే
||తల||368
అవతారిక:
చక్కటి వైరాగ్య దీపికవంటి కీర్తననావిష్కరిస్తున్న అన్నమాచార్యులవారిని ఆలకించండి. “ఓ దైవమా! నీమాయలకు తలతోక వుండవయ్యా! మేము మాత్రం తెలియనివాటిని తెలుసునని, తెలిసినవాటిని తెలియవని తలపోస్తూ తిరుగుతుంటాము. మాకు దేంట్లోనూ నేర్పులేదు. మాకు తెలిసిందల్లా నీ దాసులుగా వుండటం. మమ్మల్ని యెలాగో వొకలాగ ఒడ్డునపడవెయ్యవయ్యా! కరుణించు” అంటున్నారు.
భావ వివరణ:
ఓ దేవదేవా! నీ మాయలకు (లీలలకు) తలలేదు తోకలేదు (ఆరంభం యెప్పుడు జరుగుతుందో తెలియదు. ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు). నీమాయ ఆవరించినంతసేపూ, పిచ్చిపట్టినట్లు తెలిసీ తెలియక యేవేవో భ్రమలలో పడి, తిరుగాడుతూనే వుంటాము.
మా అంత పిచ్చివాళ్ళున్నారా ప్రభూ! మా ఈ శరీరం యెట్లా వచ్చిందో మాకు తెలియదు. దీనికి ఆలోచనలెలావస్తున్నాయో తెలియదు. సంసార సుఖము యెట్లా వుంటుందో తెలియదు. వెనక ముందేటిదో వివేకమెరుగము (పూర్వజన్మలో నేనెవరినో తెలియదు. మళ్ళీ నేను చచ్చాక యేమవుతానో తెలియదు). బ్రతికున్నంతకాలమూ ప్రతిరోజూ యేమో తిరుగుతూనే వుంటాము. ఏమిటి నీమాయ?
తల్లి కడుపులో యెప్పుడు యెలా పడ్డామో తెలియదు. ఏ క్షణాన గుటుక్కుమని కన్ను మూస్తామో తెలియదు. నాకు ధనమెలా వచ్చిందో, యెన్నాళ్ళుంటుందో, వున్నట్లుండి యెప్పుడు పోతాయో తెలియదు. శ్రీహరియొక్క ఈ “నిర్మాణ చక్రములో” మట్టు లేకుండా (పొందిక లేకుండా) తిరుగుతూనే వున్నాము. విచిత్రమేమంటే అట్లా తిరుగుతున్నా మేమే దిట్టలము (సమర్థులము) అని అనుకొంటుంటాము.
నీ కృపతో చివరికి ఒకనాటికి నాకు జ్ఞానోదయమయింది. నేర్వవలసిన దేమిటో తెలిసింది. ఇక నాకు నేర్పుతోను పనిలేదు. నిలిచినది వొక్కటేననే నేర్పు యేదో అది నా స్వంతమయింది. ఇక వూరకనే నీ దాసులమై వున్నారు. ఓ శ్రీవేంకటేశ్వరా! నీవే నన్ను వెదకి చేరుకుని నన్ను యేలినావు. ఇక నన్ను విడువకు. గారవించి కరుణించి కావగదవే (మన్నించి కరుణతో రక్షించుము తండ్రీ!) నాకు నీవే దిక్కు.
దశరథనందనుడైన శ్రీరామచంద్రమూర్తిని అన్నమాచార్యులవారు ఈ కీర్తనలో కూడా రామాయణ ఘట్టములను | వర్ణిస్తూ రాముని నామాలను సన్నుతిస్తున్నారు. అన్నమాచార్య కీర్తనా యజ్ఞంలో ఈ దీక్షితులు సమర్పిస్తున్న ఈ కీర్తన సంఖ్య 1000. సహస్రాక్షుడు, సహస్రబాహువు, సహస్రముఖుడు, సహస్రరూపుడు అయిన ఆ “సాసముఖుని” సహస్రకీర్తనల వివరణతో అర్చించగలుగుతున్నాను. ఈ జన్మకిది చాలు. అన్నమయ్య అన్నట్లు “ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపము మఱి, యిదిగాక వైభవంబికవొకటి కలదే”!
భావ వివరణ:
దశరథనందునడవైన ఓ శ్రీరామచంద్రా! నమో నమో! నీకు వేలకొలది వందనములు. మమ్ము రక్షింపుము తండ్రీ! నీవెవ్వరివి ప్రభూ “కమనీయ శరణాగత వజ్రపంజరుడవు” (నీ శరణార్థులకు మనోజ్ఞమైన వజ్రపు కవచము వంటి రక్షకుడవు).
ఓ రామంచంద్రా! నీవు నీదాసులు రక్షణకై యెప్పుడూ కోదండమును ధరించియే వుంటాను, అనే దీక్ష నిర్వహించిన దీక్షితుడవు. ఆదిత్యకులములో (సూర్య వంశములో) జన్మించిన సకల శస్త్రాస్త్రపారంగతుడవు. మాయలేడివలె వచ్చిన మారీచుని సోదించు (వెదుకునట్టి) తలగుండు గండవు (శిక్షగా తలపై పెట్టుకొని తిరిగే పెద్దబండ వంటి మొనగాడివి). అంటే మారీచునివంటి కపటుల పాలిటి యముడివి అని భావము.
ఖరదూషణుల తలలను ఖండించి పదివేల మంది రాక్షసులను క్షణంలో మట్టుబెట్టావు. శరధిని బంధించి (వారధి నిర్మించి) విభీషణునికి వరదుడవైన ప్రతాపశాలివి. విశ్వామిత్రుని యాగమును సంరక్షించిన | జగజ్జెట్టివి. పుడమియందు జన్మించి, రావణాసురని చంపగలిగి కూడా “నేడుపోయి విశ్రాంతి తీసికొని తిరిగి రేపటికి తేరుకొని రా!” అని వదలివైచి వాడి గర్వాన్ని సమూలంగా హరించిన వీరాధివీరుడవు.
కీర్తితో అయోధ్యాపురాధీశ్వరుడవై యేలిన చక్రవర్తివి. గెలుపుమీరిన (కీర్తికాంత, భూకాంత, శ్రీకాంతలను కూడా గెలిచిన) జానకీరమణుడవు. కపిసేనలో అలఘులైన (ఉద్దండులైన) సుగ్రీవుడు అంగదుడు మొదలైన వారందరిచే సేవించబడినవాడవు. ఇంతే కాదు స్వామీ! నీవు సలలితము (దివ్యసౌందర్యోపేతమైన) శ్రీవేంకటశిఖర నివాసివైన మా దైవము శ్రీవేంకటేశ్వరుడవూ నీవే.
అన్నమాచార్యులవారి ఈ కీర్తన అర్థం కావాలంటే పురాణాలమీద మంచి పట్టు వుండితీరాలి. ఆతడే జగన్మూలమైన శ్రీవేంకటాద్రిమీది దైవము అని కీర్తిస్తున్నారు. ఈ స్వామి కమలాప్తుడైన సూర్యునిలోని వెలుగై దీప్తించువాడు. ఈయన జలధిసుతునకు బావగారు అంటున్నారు. మరి ఆబావమరిది యెవరో? ఈయన కొండవంటి రాకాసిని కొట్టినవాడట. మరి ఆ రాకాసియెవరో? శ్రీవేంకటాద్రి కొండరూపు తానేపో అంటున్నారు. అంటే ఏంటి? భావవివరణ చదివితే అన్నీ పూసగుచ్చినట్లు అర్థమవుతాయి మరి.
ఇంకా చెప్పాలంటే, ఆయన జలధిని బంధించినవాడు (సేతువును సాగరముపై నిర్మించిన శ్రీరాముడు). లంక (లంకిణి) అను రాక్షసిని సంహరించినవాడు (చంపించినవాడు). ఆయనే జలధి జొచ్చిన దైత్యుని | (వేదములను అపహరించి సముద్రంలో దాగిన సోమకాసురుని) చంపిన శ్రీమన్నారాయణుడు కూడా ఆయనే. జలధిసుతునకు (క్షీరసాగర | మథనమున పుట్టిన చంద్రునికి) వరుస బావ (అతని యొక్క సోదరి శ్రీలక్ష్మిని పెండ్లాటుచేత వరుసకు బావ) అయినవాడు. అటువంటి | క్షీరసాగరముపై పవ్వళించు స్వామియే పో మా దైవము.
ఇంతేకాక తన శ్రీకృష్ణావతారమున ఈయనే కొండను (గోవర్ధన పర్వతమును) గొడుగువలె చేతబట్టుకొని గోవులను, గోకులమును రక్షించినాడు. ఈతడే కొండవంటి రాకాసిని (రాక్షసి పూతనని) గొట్టినవాడు | (చనుబాలు త్రాగు నెపముతో సంహరించినవాడు). కొండలకు నెక్కుడైన (కొండలలో అత్యంత శ్రేష్ఠమైన) శ్రీవేంకటాద్రిపైన కొండరూపములో వున్నాడు (ఆ వేంకటాద్రి పడుకొని వున్న స్వామి శిరస్సును స్ఫురింపజేస్తుంది). తానేపో (ఆ శ్రీవేంకటేశ్వరుడే పో) మా దైవము.
ఓ వామనమూర్తి! గోవిందుడా! విష్ణుదేవా! వాసుదేవా! శ్రీహరీ! శ్రీకృష్ణా! దామోదరా! (ఉదరమునకు తల్లి యశోదచే దామముతో కట్టబడినవాడా!) అచ్యుతా! మాధవా! శ్రీధరా! (లక్ష్మీవల్లభా!) నీమహిమను | గాలేము (తెలుసుకొనలేము). నిన్ను ఇటువంటివాడని అంచనావేయలేము. మరి ఇక యేమి చేయగలం? నాలుకకు అతి సులభమైన పని నీ నామమును జపించుట. అది చాలునాకు.
ఓ అనిరుద్ధా! (పరులచేత అడ్డగింపలేనివాడు) పురుషోత్తమా! అధోక్షజా! (ఇంద్రియములను జయించిన వారికి మాత్రమే కనబడువాడు) ఉపేంద్రా! జనార్ధనా! కేశవా! సంకర్షణా! (ప్రళయకాలమందు అందరినీ అంతముజేయువాడు) నిన్ను దలచలేము (నీగురించి ఆలోచించలేము). ఇక నిన్ను యెట్లు తెలియగలము? నునుపైన (పట్టుకోవటానికి తేలికైన) నీ నామము నోటితో సులభముగా పలికెదను ప్రభూ!
ఓ నారాయణుడా! పద్మనాభుడా!, హృషీకేశా! (ఇంద్రియములకు అధిపతి) నారసింహ! మధుసూదనా! త్రివిక్రమా! నీరూపము విశ్వరూపమైనందువలన యెట్లుండునో వూహింపజాలము. కానీ నేడు మాకన్నులయెదుట నిజముగా కనుపించుచున్న నిక్కపు వేంకటేశ్వరుడవు నీవే తండ్రీ! దర్శించి జపించుటకు అతి సులభమైన నీనామజపమును అన్నిటా స్వీకరింతును. ఎందుకంటే సులభమైన తరుణోపాయము ఓం నమో వేంకటేశాయ! అనడమే సుమా!