Sri Vinayaka Vrata Katha In Telugu – శ్రీ వినాయక వ్రత కథ

Sri Vinayaka Vrata Katha

మొట్ట మొదటిగా అందరికి నమస్కారం. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వినాయక వ్రత కథ గురించి తెలుసుకుందాం…

Vinayaka Vrata Katha In Telugu

శ్రీ వినాయక వ్రత కథ

(వ్రతకథ చెప్పుకొనే ముందు కొన్ని అక్షతలు చేతిలో వుంచుకోవాలి.)
కథ పూర్తయిన తరువాత ఆ అక్షతలను శిరసుపై వేసుకోవాలి.

పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంప దలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోను, తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశార ణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి, నమస్కరించి అయ్యా! మేము రాజ్యాధికారము, సమస్త వస్తు వాహనము లను పోగొట్టుకున్నాము. ఈ కష్టాలన్నీ తీరి, పూర్వవైభవము పొందేలా ఏదయినా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది” అని ప్రార్థించాడు. అంత సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగి పోయి,సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు.

“ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ని దర్శించి తండ్రీ! మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది, సమస్త కోరికలూ తీరి, సకల శుభాలను, విజయాలను, వైభవాలనూ పొందగలుగుతారో అటు వంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు శివుడు నాయనా! సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామ్యార్థ సిద్ధి ప్రదమూ అయిన వినాయక వ్రతమనేదొకటుంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి, స్నానంచేసి, నిత్య కర్మలు నెరవేర్చుకుని తమశక్తి మేరకు బంగారంతోగాని, వెండితోగాని, లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మనుచేసి, తమ ఇంటికి ఉత్తర దిక్కుల్లో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి, అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్టించాలి. అనంతరం శ్వేతగంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి, ధూపదీపాలను, వెలగ, నేరేడు, చెరకు మొదలైన ఫలములను, రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్యపురాణ, పఠనాదులతో పూజను ముగించి, యథాశక్తి వేదవిదులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదు లను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్యభోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నానసంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజచేయాలి. విప్రులకు దక్షిణతాంబూ లాలతో తృప్తులను చేయాలి. ఈవిధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదంవలన సకల కార్యములూ సిద్ధిస్తాయి. అన్ని వ్రతములలోకీ అత్యుత్తమ మైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులందరిచేతా ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు.

కనుక ధర్మరాజా నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడ గలిగింది. శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతంచేయడం వల్లనే శ్యమంతకమణితోపాటుగా జాంబవతీ సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు. ఈ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు.

పూర్వకాలమున గజముఖుడయిన గజాననుడు అనే రాక్షసుడు ఒకడు శివుని గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మన్నాడు. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ నీవు నాయుదర మందే నివసించాలి అని కోరాడు. దాంతో భక్తసులభుడగు శివుడు అతడి కుక్షియం దుండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో వున్నాడని తెలుసుకున్నది. ఆయనను దక్కించుకొనే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించినది. అంత శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారమునకు గంగిరెద్దుమేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవత లందరిచే తలకొక వాయిద్యమును ధరింపజేశాడు. మహావిష్ణువు తానును చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురానికి వెళ్ళి జగన్మోహనంబుగా గంగిరెద్దును ఆడించుచుండగా గజాసురుడు విని, వారిని పిలిపించి తనభవనము ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియగునాహరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దు నాడించాడు. గజాసురుడు పరమానందభరితుడై “ఏమి కావాలో కోరుకోండి.. ఇస్తాను” అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుని సమీపించి “ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకు వచ్చింది. శివుడ్ని అప్పగించు” అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకు డగు శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో వున్న పరమేశ్వరుడ్ని ఉద్దేశించి “స్వామీ! నా శిరస్సు త్రిలోక పూజ్యముగ చేసి, నా చర్మము నీవు ధరించు” అని ప్రార్థించాడు. తన గర్భంలో వున్న శివుడ్ని తీసుకోవ చ్చునని విష్ణుమూర్తికి అంగీకారము తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. మహేశ్వరుడు గజాసుర గర్భమునుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తిని స్తుతించాడు. ‘దుష్టాత్ములకు ఇటువంటి వర మును ఇవ్వరాదు. ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లవుతుందని సూచించారు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా, శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళాడు.

మరిన్ని వ్రతాలు:

Evvari Bhagyam Bettunndo In Telugu – ఎవ్వరి భాగ్యంబెట్టున్నదో

ఎవ్వరి భాగ్యంబెట్టున్నదో – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో ఎవ్వరి భాగ్యంబెట్టున్నదో కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

ఎవ్వరి భాగ్యంబెట్టున్నదో – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 2
కీర్తన : ఎవ్వరి భాగ్యంబెట్టున్నదో
సంఖ్య : 43
పుట: 29
రాగం: భైరవి

భైరవి

64 ఎవ్వరిభాగ్యం బెట్టున్నదో
దవ్వు చేరువకు తానే గురుతు

||పల్లవి||

పరమమంగళము భగవన్నామము
సురులకు నరులకు శుభకరము
యిరవుగ నెఱిగిన యెదుటనె ఉన్నది
వరుసల మఱచిన వారికి మాయ

||ఎవ్వరి||

వేదాంత సారము విష్ణుభక్తియిది
ఆదిమునులమత మయినది
సాధించువారికి సర్వసాధనము
కాదని తొలగినకడుశూన్యంబు

||ఎవ్వరి||

చేతి నిధానము శ్రీ వేంకటపతి
యేతల జూచిన నిందరికి
నీతియు నిదియే నిజసేవకులకు
పాతకులకు నది భవసాగరము

||ఎవ్వరి||

అవతారిక:

ఎవరి అదృష్టం యెలావుంటుందో యెవరు చెప్పగలరు? అని పాడుతున్న అన్నమాచార్యులవారిని ఆలకించండి. “దవ్వు చేరువకు తానే గురుతు” అంటే, యెవ్వడు ఆయనకు దూరమైనవాడో, యెవరు దగ్గరవాడో తానే తెలిసినవాడు. ఇంకెవరికీ తెలియదు అని అర్థం. ఆనాడు శిశుపాలుడి తల నరికాడు కాని వాడు ఆయన నమ్మిన ద్వారపాలకుడు. “బావా! యెప్పుడు వచ్చితీవు” అని ధుర్యోధనుణ్ణి ఆప్యాయంగా పలుకరిస్తాడు. కాని తొడలు విరగకొట్టించి చంపించాడు. మరి మనబోటి వారేం చేయాలి? సత్ప్రవర్తనతో, శరణాగతితో, స్థిరభక్తితో, ఆ ఏడుకొండలవాడిని సేవించడం. అట్లా చేయనివారి గతి యేమిటి? భవసాగరంలో కొట్టుమిట్టాడటమే.

భావ వివరణ:

ఓ ప్రజలారా! ఎవ్వరి భాగ్యం (అదృష్టము) యెట్లా వుంటుందో, యెవ్వరు చెప్పగలరు? “దవ్వు చేరువకు తానే గురుతు” (ఆ సర్వేశ్వరునకు ఎవ్వరు దూరమో? ఎవ్వరు దగ్గరవారో? ఎవరు చెప్పగలరు?)

భగవన్నామసంకీర్తనము పరమమంగళకరమైనది. అది నరులకే కాదు సురులకు (దేవతలకు) కూడా శుభప్రదమైనది. ఇరవుతో నెరిగిన (సమూలంగా తెలిసికొంటే), అది యెదుటనే వున్నది. అంటే దాని ఫలితం ప్రత్యక్షంగా కనబడుతుంటుంది. వరుసల మరచిన (దేవుడెవరు జీవుడెవరు అనే క్రమము మరచినచో) వారికి మాయ (వారు మాయకు లోనై తామే అధికులమని హిరణ్యకశిపునివంటి భ్రష్ఠులైపోతారు).

వేదము విష్ణువును కీర్తిస్తుంటే… వేదాంతము యొక్క సారము విష్ణు భక్తిని ప్రతిపాదిస్తున్నది. ఆదికాలమునాటి మునులయొక్క మతము కూడా విష్ణుభక్తియే. సాధనతో విష్ణుభక్తిని పెంపొందించుకొంటే వారికి సర్వమూ సాధ్యమవుతాయి. విష్ణుని కాదని తొలగిన (దుర్యోధనుడు తనకి కృష్ణుడు వద్దు, కాని కృష్ణుని యాదవ సేన కావాలని కోరుకున్నాడు) కడు శూన్యము (ఏదీ దక్కదు) మిగులుతుంది.

శ్రీవేంకటేశ్వరుడు చేతిలోవున్న నిధానము (నిధివంటివాడు.) ఏతలజూచిన (ఏవిధంగా చూచినా) ఇందరికి (ఈ జీవకోటికి) నీతియు (ధర్మవంతమైనది) ఆ దేవదేవుని శరణాగతియే. నిజసేవకులకు (అసలైన హరిదాసులకు) ఇదియే దిక్కు మరి పాతకులకు (పాపాత్ములకు) అది భవసాగరమున (సంసార సాగరంలో) మునక. ఇంతవరకు అందులో మునిగినవాడు తేలలేదు. తేలడు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Shila Sampada In Telugu – శీలసంపద

Shila Sampada

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు నీతికథలు గురించి తెలుసుకుందాం.

నీతికథలు

శ్రీ మహాభారతం లోని నీతికథలలో మనకు బాగా సుపరిచితమైన నీతికథ మీ అందరికోసం. అది ఎమిటంటే… శీలసంపద కథ. 

శీలసంపద

ఖాండవవన దహనమప్పుడు లోకైకవీరుడైన అర్జునుడు తనను రక్షించినందుకు కృతజ్ఞతగా మయాసురుడు మయసభను నిర్మించి ధర్మరాజుకివ్వాలని సంకల్పించుకున్నాడు. మయాసురుడు ఆ భవ్య మయసభను పవిత్ర హిమాలయాలలో నిర్మించి తన మాయశక్తితో ఇంద్రప్రస్థానికి తెచ్చాడు. మయసభలోని అద్భుతాలను పొగడటానికి మాటలుచాలవు. మయసభ అంతా కనక రత్న మణిమయము. మయసభలోని స్తంభాలు ద్వారాలు తోరణాలు వనాలు తటాకాలు అన్నీ మణిమయాలే. రాజసూయ యాగానికి వచ్చిన ఎందఱికీ సంభ్రమాశ్చర్యాలు కలిగించి నభూతో నభవిష్యతి అని పొగడబడినది ఆ మయసభ. మయసభ విభవం పాండవుల అదృష్టం చూసి దుర్యోధనుని అసూయామాత్సర్యాలు మరింత చెలరేగాయి. పాండవుల కీర్తి సంపదలను తలచుకొని తీవ్రంగా దుఃఖిస్తూ తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి తన బాధను చెప్పుకున్నాడు దుర్యోధనుడు. మత్సరమనే ఘోరసర్పముచే కాటువేయబడ్డ తన కొడుకుకి ఇలా హితవు చెప్పాడు ధృతరాష్ట్రుడు

“కుమారా! నీకు మాత్రం తక్కువ ఐశ్వర్యమున్నదా? ఈ లోకంలో సంతృప్తి ఉన్నవాడే ధనవంతుడు. సంతృప్తి లేకుండా కుబేర సంపద ఉన్నా వాడు సంతోషముగా ఉండలేడు. నాయనా! శీలవంతుడైన ధర్మనందనుని శ్రీలక్ష్మి ఎన్నడూ విడువదు. శీలవంతుని ఆశ్రయించే సకల సంపదలు సుగుణములు ఉంటాయి. కాబట్టి నీవు కూడా ధర్మాత్ములైన పాండవులవలె శీలవంతుడవు కమ్ము. తానుతో సిరిసంపదలు వాటంతట అవే వస్తాయి”. కుమారునికి ఒక ఇతిహాసం చెప్పాడు

“ప్రహ్లాదుడు సర్వగుణ సంపన్నుడు విద్యా పారంగతుడు పరమ విష్ణుభక్తుడు. ధర్మం తప్పకుండా తన ప్రజలను పాలించేవాడు. తన సౌశీల్య ప్రభావం చేత త్రిలోకాధిపత్యం ఇంద్రత్వం ప్రాప్తించింది ప్రహ్లాదునికి. చతుర్భువనాలను జనరంజకముగా పాలించసాగాడు ఆ ప్రహ్లాదుడు. ఇలా ప్రహ్లాదుని వలన పదవీ భ్రష్టుడైన శచీపతి గురువైన బృస్పతులవారిని తనకు మళ్ళీ ఇంద్రపదవి సిద్ధించే ఉపాయం చెప్పమని ప్రార్థించాడు. బృహస్పతి విష్ణు అవతారుడైన పరశురాముని ఆశ్రయించమని చెప్పాడు. గురు ఆజ్ఞపాటించి ఇంద్రుడు భార్గవరాముని శరణుజొచ్చి ఉపాయం బోధించమని ప్రార్థించాడు. “అతనికి అంత శక్తి ఎలా వచ్చిందో అతనినే అడుగు. ఆ శక్తిని అతనివద్దనుండే పుచ్చుకో” అని చెప్పాడు భార్గవుడు.

విద్యార్జన గురుసుశ్రూష వలనే సాధ్యం అని తెలిసిన దేవేంద్రుడు విప్రవేషం ధరించి ప్రహ్లాదునికి శిష్యుడై అతనిని భక్తితో సేవించటం మొదలుపెట్టాడు. అలా ఎంతో కాలం ప్రహ్లాదుని సేవించినాడు వజ్రి. ప్రసన్నుడైన ప్రహ్లాదుడు “నాయనా! ఏమి కోరి నన్ను సేవిస్తున్నావు?” అని విప్రవేషంలో ఉన్న ఇంద్రుని అడిగాడు. శచీపతి తన అభీష్టం వ్యక్త పఱచినాడు. అప్పుడు ప్రహ్లాదుడు

“కుమారా! నేనెప్పుడూ రాజునని గర్వించను. ఎవఱినీ నొప్పించను. వారికి హితమేచేస్తాను. ఈర్ష అసూయ ద్వేషం పగ మొదలైనవి నా దరి చేరనివ్వను. అడిగినవాడికి లేదనకుండా సంతోషపెడతాను. నా పురాకృత పుణ్యం వలన నాకీ సౌశీల్యం అబ్బినది” అని చెప్పాడు. “ఓ దయామయా! దానశీలా! నీ శీలం నాకు ప్రసాదించు” అని అడిగాడు ఇంద్రుడు. “అయ్యో పాపం!” అని ప్రహ్లాదుడు తన శీలాన్ని దేవేంద్రునికి దానం ఇచ్చి పంపివేశాడు.

ఇంద్రుడు వెళ్ళాడో లేదో ప్రహ్లాదునిలోనుండి ఒక దివ్య తేజఃపుంజము పురుషాకృతిదాల్చి బయటికి వచ్చింది. “నీవెవరు?” అని ఆశ్చర్యాముగా అడిగాడు ప్రహ్లాదుడు.

“నేను నీ శీలాన్ని. ఆ విప్రునికి నన్ను దానం ఇచ్చావు కదా. వెళుతున్నాను” అని చెప్పి వెళిపోయింది శీలము. ఒకతేజస్సు తరువాత ఒకటి ప్రహ్లాదుని వీడిపోయినాయి. ఒక తేజస్సు అన్నది “నేను సత్యమ్. శీలాన్ని ఆశ్రయించి ఉంటాను. శీలంతో పాటూ నేను నిన్ను విడుస్తున్నాను”. మరొక తేజస్సు అన్నది “రాజా! నేను ఋజుప్రవర్తనమ్. సత్యము లేని చోట నేనుండలేను”. “నేను బలమ్. సత్ప్రవర్తన లేనివాడి వద్ద నేనుండను” అని వెళ్ళిపోయింది బలమ్. చివరికి ఆదిలక్ష్మి బయటికి వచ్చి “నేను శ్రీలక్ష్మిని. బలం ఉన్నచోటే నేనుంటాను. వెళుతున్నాను” అని అన్నది. అప్పుడు ప్రహ్లాదుడు “అమ్మా! లోకమాతా! నీవూ నన్ను విడిచిపోతున్నావా? ఈ అభాగ్యునిపై దయ చూపవా? వెళ్ళద్దు తల్లీ! ఆ విప్రుడు ఎవఱు తల్లీ?” అని ప్రార్థించాడు. “అతడు దేవేంద్రుడు. పోగొట్టుకున్న రాజ్యమును సంపాదించడనికి నీవద్దకు వచ్చాడు. అన్ని సంపదలకూ మూలమైన శీలమును నీవు అతనికి దానమిచ్చావు కావున శీలాన్ని అనుసరించి మేమందఱమూ వెళుతున్నాము” అని సర్వాణి చెప్పింది. నిజమైన శ్రీహరి భక్తులకు సాధ్యం కానిదేమున్నది? ప్రహ్లాదుడు మళ్ళీ తన సద్గుణాలను సంపదలను అచిరకాలంలోనే సంపాదించుకున్నాడు. కనుక నీవెల్లప్పుడూ సౌశీల్యుడవై వర్ధిల్లు నాయనా!” అని కుమారునికి హితవు చెప్పాడు ధృతరాష్ట్రుడు.

ఈ కథలోనితి మరొక్కమాణు మీ అందరికోసం

సౌశీల్యం యొక్క ప్రాముఖ్యత మనకీ కథ ద్వారా తెలిసినది. శీలమున్న వాడి వద్దనే సకల సంపదలుంటాయి. కాబట్టి మొదట శీలవంతులము కావడం ముఖ్యము.

మరిన్ని నీతికథలు మీకోసం:

Vedavatti Yika Nemi Vedakeru Chadiveru In Telugu – వేదవట్టి యిక నేమి వెదకేరు చదివేరు

వేదవట్టి యిక నేమి వెదకేరు చదివేరు – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో వేదవట్టి యిక నేమి వెదకేరు చదివేరు కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

వేదవట్టి యిక నేమి వెదకేరు చదివేరు – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన: వేదవట్టి యిక నేమి వెదకేరు చదివేరు
సంఖ్య : 535
పుట: 359
రాగం: సాళంగనాట

సాళంగనాట

40 వేదవట్టి యిఁక నేమి వెదకేరు చదివేరు
వేదాంతవేద్యుఁడైన విష్ణుని నెఱఁగరా.

||పల్లవి||

తోలె నదె గరుడనిఁ దొడఁగి బాణునిమీఁద
వాలెను కంసునిమీఁద వడి నెగసి
కేలుచాఁచి చక్రమునఁ గెడపె శిశుపాలు
వేలుపుల రాయఁడైన విష్ణుని నెఱఁగరా.

||వేద||

తొక్కెను బలీంద్రునిఁ దొల్లి పాతాళానఁ గుంగ
మొక్కలాన జల ధమ్ము మొనకుఁ దెచ్చె
పక్కన బ్రహ్మాండము పగులించెఁ బెనువేల
వెక్కనపుదైవమైన విష్ణుని నెఱఁగరా.

||వేద||

భేదించె రావణాదిభీకరదైత్యులనెల్ల
నాదించె శంఖమున నున్నతజయము
సేదదేర నిపుడును శ్రీవేంకటాద్రిమీఁద
వీది వీది మెరసేటి విష్ణుని నెఱఁగరా.

||వేద||535

అవతారిక:

“వేదవట్టు” అంటే వేద ప్రవచనము చేయటం. ఈ కీర్తనలో అన్నమాచార్యులవారు వేదము తెలిసిన పండితులతో అంటున్నారు ‘ఇంకా యేమి వేదప్రవచనాలు చేస్తారు? యేమి వెదుకుతారు? యేమేమి చదువుతారయ్యా! మీకీ మాత్రం తెలియదా? వేదాంత వేద్యుడు విష్ణువుగాక వేరెవరున్నారు?’. ఈ కీర్తనలో జలధమ్ము అంటే ‘జలధియమ్ము’ అని భావించాలి. పెనువేలు అంటే బొటనవ్రేలని అర్థం. అనంతకోటి బ్రహ్మాండాలను తన బొటన వేలికింద నొక్కివేయగలడట ఈ విశ్వరూపుడు మరేమనుకొన్నారు?

భావ వివరణ:

ఓ అయ్యలారా! యిక వేదవట్టి (వేద ప్రవచనములు చేసి) యేమి వెదకెదరయ్యా! యేమి చదివేరు? వేదాంతము వేదాంతము ద్వారా, వేద్యుడు (తెలియదగినవాడు) యెవరు? విష్ణువే కదా! ఈ సంగతినెరుగరా? ఏమి వింత!!

మీరు ఆయన కృష్ణావతారం గురించి వినలేదా? ఆ శ్రీకృష్ణుడు అదె గరుత్మంతునిపైనెక్కి తోలె (వెడలినాడు). బాణాసురనెదుర్కొని చిత్తుచేశాడు. వడి (వేగముగా) కంసునిపై నెగసి (దండెత్తి) వాలెను (మీదపడ్డాడు). కేలుచాచి (చేయిచాచి) చక్రాయుధాన్ని అందుకొని శిశుపాలుని కెడపె (పడవేసెను). అట్టి లీలలు చేసిన వేలుపులరాయుడు (దైవశిఖామణి) యైన విష్ణువునెరుగరా? ఏమి ఆశ్చర్యము!

ఈయన తొల్లి (కృతయుగంలో) బలీంద్రుని (బలి అను దానవేంద్రుని) పాతాళమునకు క్రుంగునట్లు తలపై కాలుంచి త్రొక్కెను. ఈయన త్రేతాయుగములో మొక్కలా (శౌర్యముతో) జలధిని (సాగరమును) అమ్ముమొనకు దెచ్చే (బాణముయొక్క మొనకు తెచ్చి శరణాగతుని చేసెను. పక్కన భవిష్యత్తులో ఈయన తన పెనువేల (బ్రొటనవేలితో) బ్రహ్మాండమునే పగులించె బ్రద్దలు కొడతాడు. ఓ అయ్యలారా! వెక్కసపు దైవమైన (సర్వాధికుడైన దేవుడు) విష్ణువునెరుగరా?

ఈయనే శ్రీరాముడై రావణుడు మొదలైన భయంకర దైత్యులను సంహరించాడు. తన పాంచజన్యశంఖమును వున్నతముగ పూరించి జయధ్వానములు చేసెను. యుగయుగాలలో ఇవన్నీ చేసి అలసిన శ్రీమహావిష్ణువు ఈ కలియుగంలో సేదతీరుటకు (విశ్రాతికి) శ్రీవేంకటాద్రిమీద శ్రీ వేంకటేశ్వరుడై నిలిచినాడు. అదిగో తిరు వీధులలో మెరసేటి (కాంతులు వెదజల్లుతున్న) ఈ విష్ణుదేవుని ఎరుగరా? ఏమి విచిత్రం!!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Molanuli Golleta Muriyucunu In Telugu – మొలనూలి గొల్లెత మురియుచును

మొలనూలి గొల్లెత మురియుచును – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో మొలనూలి గొల్లెత మురియుచును కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

మొలనూలి గొల్లెత మురియుచును – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 5
కీర్తన: మొలనూలి గొల్లెత మురియుచును
సంఖ్య : 372
పుట: 252
రాగం: శుద్ధదేశి

శుద్ధదేశి

82 మొలనూలి గొల్లెత మురియుచును
వలవంతఁ దిరిగీని వాడవాడలను

||పల్లవి||

సంపెఁగలతురుముతో చల్లలమ్మీనిదివొ
వంపుమోము గొల్లెత వాడలను
యింపులకోరికె తో నిందిరాపతి యెదుట
జంపుల నటనలతో సాళగింపుచును

||మొలనూ||

నొసలికస్తూరితోఁ గన్నుల నవ్వీనిదివో
వసివాడు గొల్లెత వాడలను
కసరుచు హరిమీఁదికాఁకల కోపముతో
యెసరుఁజెమట గోర యెమ్మెలఁ జిమ్ముచును

||మొలనూ||

చెలవంపుటుంగరాల చెయి వీచీనిదివో
వలపుల గొల్లెత వాడలను
కలికియై తిరువేంకటవిభుకౌఁగిట
అలసిన నటనల నల్లంతనేఁగుచును.

||లలల||

అవతారిక:

ఆ గొల్లెత మొలనులు (స్త్రీలు ప్రత్యేకముగా ధరించు మొలత్రాడు) ధరించినదై మురిపెముతోనున్నదట. ద్విగుణీకృతమైన అందంతో ఆమె వాడవాడలా విరహవేదనతో తిరుగుతున్నదట. ఆమె సంపెంగపూలు కొప్పులో తురిమింది. నొసటిమీద కస్తూరీ తిలకం ధరించింది. ఉంగరాల చేతిని విలాసంగా వూపిందట. తరువాత వేంకటపతి సందిట నర్తించి అలసినదట. ఇది సరస శృంగార కీర్తన. అన్నమాచార్యులవారి శృంగార భక్తి నభూతో నభవిష్యతి.

భావ వివరణ:

మొలనూలు (స్త్రీలు ధరించునట్టి మొలత్రాడు) ధరించిన ఆ గొల్లెత (గొల్లభామ) మురియుచును (సంతోషంతో మురిసిపోతూ) వాడవాడలా (పల్లెలోని తన పేటంతా) వలవంత దిరిగీని (మదనవేదనతో తిరుగుచున్నది).

ఆ గొల్లెతవంపు మోము గొల్లెత (గుండ్రని ముఖముగల గొల్ల భామ). ఆమె చల్లలమ్ముతుంది. ఆమె తలలో సంపెంగపూలు ధరించినది. ఆమె ఇందిరాపతియైన శ్రీకృష్ణుని వలచినది. మధురమైన కోరికలతో రగులుచున్న ఆమె కదలాడుచున్న ‘చెంపసరాలు’ ధరించి కలివిడిగా ఆ గొల్లవాడంతా తిరుగుచున్నది.

ఆమె తన నొసట (నుదురుపై) కస్తూరి తిలకమును ధరించినది. తన కన్నులతోనే ఆమె మనోహరంగా నవ్వుతున్నది. వాడ అంతా కలియతిరుగటచే వసివాడిన (అలసిన). ఆమె ముఖము నీరసముగానున్నది. హరిమీద (కృష్ణునిపై కసరుచు (విసుగుకొనుచు) కాకకోపముతో (మండించే క్రోధముతో) ఆ గొల్లెత, యెసరుజెమట (వేడిచెమటను) చిమ్ముచున్నది.

వలపులను చిందిచుచున్న ఆ గొల్లెత వాడ అంతా కలయతిరుగుచున్నది. చెలువంపుటుంగరములను (సొగసైన అంగుళీయకములను) వేళ్ళకు ధరించిన ఆమె తన చేయి (చేతిని) ఇదిగో ఎలా వీచుచున్నదో చూడండి. ఆమె కలికియై (అందాలరాసియై) శ్రీవేంకటేశ్వరుని కౌగిట కరిగి నర్తించుచు అటూఇటూ యేగుచు (నడచుచు) మిక్కిలి అలసినది.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sutuni Narakuni Jampa Jucinadavu Summi In Telugu – సుతుని నరకుని జంప జూచినాడవు సుమ్మీ

సుతుని నరకుని జంప జూచినాడవు సుమ్మీ – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో సుతుని నరకుని జంప జూచినాడవు సుమ్మీ కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

సుతుని నరకుని జంప జూచినాడవు సుమ్మీ – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 5
కీర్తన: సుతుని నరకుని జంప జూచినాడవు సుమ్మీ
సంఖ్య : 66
పుట: 45
రాగం: పాడి

పాడి

81 సుతుని నరకునిఁ జంపఁ జూచినాఁడవు సుమ్మీ
మతి నన్నుఁ దలఁచక మానిన నీకాన

||పల్లవి||

ఎత్తుక నీతోడఁబట్టు హిరణ్యకశిపుని
నెత్తురు దాగితి సుమ్మీ నేఁడే రాకుంటే
ఉత్తలాన నేడనైనా నుండుదువో యని భీతి
బిత్తరముగాఁ బెట్టితి పెట్టరాని యాన

||సుతుని||

కప్పుక మేనమామ కంసుని ప్రాణానకు
తప్పినవాఁడవు సుమ్మీ తడసితేను
ఇప్పుడిట్టే నీవు రాని యీరసానఁ బ్రియములు
చెప్పలేక పొడిచితి చెడుగైన యాన

||సుతుని||

సిరుల మేన మరఁది శిశుపాలు నీ విట్టే
పొరిగొంటివి సుమ్మీ పోయితే నీవు
తిరువేంకటేశ నిన్నుఁ దివిరి కూడి (డే?) వని
కరుణఁ బెట్టితి నీకుఁ గపటాన నాన

||సుతుని||

అవతారిక:

పరంధాముని నిందాస్తుతితో ప్రార్థించిన భక్తాగ్రేసరులు కోకొల్లలు. బాధతాళలేక నిందించినా అది స్తుతితోనే ముగుస్తుంది. ఈ కీర్తన ప్రత్యేకత యేమంటే అన్నమయ్య. వ్యావహారిక దృష్టిలో ‘కొడుకు’ను చంపిన క్రూరుడు, ‘అన్నను’ చంపిన అతి జిత్తులమారి, మేనమరిదిని చంపిన కఠినుడు నన్ను కాపాడతాడో లేదోనని యేవేవో ఒట్లు పెట్టి నన్ను కాపాడమని వేడుతున్నాను ఇవన్నీ ‘కపటపు ఆనలే’ ప్రభూ! ఎలాగైనా నీదయ పొందాలనే నా ‘ప్రయత్నం’ అంటున్నారు పరమాత్మతో. ఇటువంటి కీర్తన మనసును కరిగిస్తుంది.

భావ వివరణ:

ఓ దేవదేవా! నీవు కఠినాత్ముడవు. నీసుతుడైన నరకుని (వాడు శ్రీహరికీ భూదేవికి, హిరణ్యాసుర వధానంతరం పుట్టిన కొడుకు) చంపజూచి, వాడిచావు వాడి తల్లి అంశతో జన్మించిన సత్యభామ చేతితో జరిపించావు). నన్ను దయతలచక మానితే నీకు ‘ఆన’ (ఒట్టే సుమా!)

నీవు నరసింహుడవై హిరణ్యకశిపుని చీల్చి చంపి వాడినెత్తురు నేలరాలరాదని వాడి నెత్తురు త్రాగినావు. ఇంతాజేసి వాడు నీతోడబుట్టిన అన్నయే కదా! వాడు చెల్లెలుదితి కొడుకైతే, నీవు అక్క అదితి కొడుకువి. ఉత్తలాన (తొందరపాటుతో) యెక్కడైనా నాకోసం పొంచివున్నావేమోనని భీతిచే బిత్తరజెంది పెట్టరాని ‘ఆన’ బెట్టితినయ్యా! నన్ను క్షమించు. నీవు నన్ను చంపితే అంతకంటే నేకోరునదేమున్నది తండ్రీ!

నీవు మేనమామను చంపిన గొప్ప మేనల్లుడవని అందరూ యెరిగినదే కదా! మామూలుగా చంపవచ్చును కదా! వాడిని (కంసుని) ఆకాశవాణిద్వారా హెచ్చరికపంపి మేనల్లుళ్ళని చంపిన క్రూరుడన్న పాపం అంటగట్టి, వాడిని ప్రాణానకు తప్పినవాడవు (ప్రాణాలు తీసినవాడవు). ఈరసార (కొద్దిగా ఈర్ష్యతో) ప్రియములు చెప్పలేక, తొందరపడి ఇప్పుడు నేను యేవేవో ‘ఆన’లు (ఒట్లు) పెట్టేను. అంతే స్వామీ! వాటిని లెక్కజేయకు.

స్వయముగ నీ మేనమరిది శిశుపాలుని సుదర్శన చక్రంతో పొరిగొంటివి (తలనరికేవు). సభలో తరిమితరిమి చంపినావు. అందుకు నూరుతిట్లు నిన్ను తిట్టినపాపము వాడి చేత చేయించావు. పోయితే నీవు (ఇకపోతే నీవు) తిరువేంకటేశ్వరుడవై తివిరి (ప్రయత్నముతో నన్ను కూడేవని (అనుగ్రహింతువని) నీకు కపటపు ఆనలు పెట్టాను స్వామీ! నన్ను కరుణతో చూస్తే చాలు తండ్రీ! నీకు ఆనలు పెట్టే ధైర్యం నాకెక్కడిది ప్రభూ!

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Atani Nammale Ralpamatulu Bhuvi In Telugu – అతని నమ్మలే రల్పమతులు భువి

అతని నమ్మలే రల్పమతులు భువి – అన్నమయ్య కీర్తనలు

ఈ పోస్ట్ లో అతని నమ్మలే రల్పమతులు భువి కీర్తన దాని భావము ఇవ్వబడి మరిన్ని అన్నమయ్య కీర్తనలు.

అతని నమ్మలే రల్పమతులు భువి – అన్నమయ్య కీర్తనలు

సంపుటి: 3
కీర్తన: అతని నమ్మలే రల్పమతులు భువి
సంఖ్య : 533
పుట: 358
రాగం: వసంతవరాళి

వసంతవరాళి

79 అతని నమ్మలే రల్పమతులు భువి
నతఁ డాద్యుఁడు పరమాత్ముఁడు

||పల్లవి||

సకలలోకపతి సర్వేశ్వరుఁడట
వొకఁడిఁక దొర మరి వున్నాఁడా
ప్రకటించఁగ శ్రీపతియే దాతట
వెకలి నియ్యఁ గొన వేరేకలరా.

||అత||

దివిజవందితుఁడు దిక్కుల హరియట
యివల మొక్క సురలిఁక వేరీ
కవ నంతర్యామి కరుణాకరుఁడట
వివిధభంగులను వెదకఁగనేలా.

||అత||

వేదాంగుఁడు శ్రీవేంకటపతియట
ఆదిమతము లిఁక నరసేదా
యేదెస నెవ్వరి కెప్పుడుఁ గలఁ డితఁ-
డీదేవుఁడె మన కిహపర మొసఁగ.

||అత||533

అవతారిక:

శ్రీహరి పరమాత్మ, ఆదిదేవుడు. కొందరు అల్పమతులు. ఈ సత్యమును నమ్మలేక చెడిపోతున్నారు. సర్వలోకపతి శ్రీపతియేనని తెలియకున్నారు. అందరి దిక్కూ ఆ దివిజవంద్యుడేనని అరయలెకున్నారు. వేదాంగములచే నేర్చి భావించవలసిన శ్రీవేంకటేశ్వరుని శరణని ఇహపరములను సాధించలేకున్నారు. కనుక మొదటి మెట్టు నమ్మం, చివరిమెట్టు శరణాగతి మధ్యలో అన్నీ నమ్మకాన్ని సడలించే జారుడుమెట్లే. కానీ భయపడకండి… కరివరదుని శరణని పరమునెరిగే దారి నరయండి.

భావ వివరణ:

భువిని (ఈభూమిమీద) అల్పమతులు (తెలివితక్కువవారు) ఆతని (ఆ శ్రీహరిని) నమ్మలేరు, (లేనేలేడంటారు). నిజమేమిటంటే అతడు ఆద్యుడు (అన్నిటికి ఆదియైనవాడు), పరమాత్ముడు.

ఆయన సకలలోకపతి, సర్వేశ్వరుడూ అతడేనట. ప్రకటించగ (వెల్లడిజేయగా) మరి దొర (మరివేరొక అధిపతి) వొకడిక (ఇంకావొకడు) వున్నాడా? శ్రీపతి యొక్కడే దాతట. వెకవినియ్యగా (ప్రత్యక్షమీయగ వేరొకరు కొనన్ (చిట్టచివర) కలరా?

అన్ని దిక్కులయందును మొక్కుటకు ఆదిక్పాలకులుంటారు. ఆ దివిజులందరికీ వంద్యుడు (పూజింపదగినవాడు) శ్రీహరియే. ఇవల (ఇటువైపున) ఇంకా అన్యులైన సురలేరీ? ఆక్రమించిన అంతర్యామి యెల్లరకు హరియే. ఆయన కరుణాకరుడట. మనలోనేవుండు వానిని, వివిధ భంగులను (రకరకములైన మార్గములలో) వెదకగనేలా (వెదుకుటెందులకు?)

శ్రీవేంకటేశ్వరుడు వేదాంగుడు (వేదములే అంగములుగా గలవాడు). ఆయన శరణాగతితో నేను ఆయన నాశ్రయించితిని (విశిష్టాద్వైతినైతిని). అటువంటప్పుడు “ఆది మతములికనరసేదా? (తొల్లిటి మతములను గురించి ఆలోచించుటెందులకు?) ఏదెస నెవ్వరి కెవ్వడుగలడు? (ఏ దిక్కుయైనా ఈ లోకంలో యెవ్వరికెవరున్నారు? అందరూ మధ్యలోవచ్చి మధ్యలో పోయేవారే కదా!) మనకు ఇహము, పరమునొసగెడివాడు ఈ దేవుడే. ఇంకెవ్వరూ లేరు, వుండరు.

మరిన్ని అన్నమయ్య కీర్తనలు:

Sri Vinayaka Pooja Vidhanam In Telugu – శ్రీ వినాయక పూజా విధానము

Sri Vinayaka Pooja Vidhanam

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు శ్రీ వినాయక పూజా విధానం గురించి తెలుసుకుందాం. శ్రీ వినాయక పూజ అనేది భక్తులు వినాయకుడు దేవుడిని ఆరాధించడానికి విధానము. ఈ పూజలో వినాయకుడిని ఆవాహన, ప్రణామం, ఆరతి, నైవేద్యం, మంత్రార్చన మరియు ఆయుధాల అర్పణ ఉంటుంది.

Sri Ganapathi Pooja Vidhanam

శ్రీ వినాయక పూజా విధానము

ముందుగా బొట్టుపెట్టుకుని, నమస్కరించుకుని ఈ విధంగా ప్రార్థించుకోవాలి.

ప్రార్థన:

శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే ||
అయం ముహూర్తస్సుముహూర్తోస్తు ||

శ్లో॥ తదేవలగ్నం, సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ |
విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతేతేంఘ్రి యుగంస్మరామి ||
సుముహూర్తోస్తు ||

లాభస్తేషాం, జయస్తేషాం, కుతస్తేషాం పరాభవ |
శ్యామో హృదయస్థో జనార్థనః ||
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాంత
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం ||
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపతః |
ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో, హేరంబః స్కంధ పూర్వజః |
అష్టావష్టా చ నామాని యః పఠేచ్ఛృణుయాదపి |
విద్యారంభే వివాహేచ ప్రవేశ నిర్గమేతథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే |
అభీప్సితార్థ సిద్ధ్యర్థం, పూజితో యస్సురైరపి,
సర్వవిఘ్నచ్ఛి దేతస్మై గణాధిపతయే నమః ||

(నమస్కరించుకుని ఆచమనము ప్రాణాయామము చేసి ఈవిధంగా సంకల్పము చెప్పుకోవాలి)

సంకల్పం:

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యః శుభేశోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య…ప్రదేశే… (శ్రీశైలానికి ఏ దిక్కులో వుంటే ఆ దిక్కు పేరు చెప్పుకోవాలి.) మధ్యప్రదేశే శోభనగృహే సమస్త బ్రాహ్మణ హరి హర గురుచరణసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన.. నామసంవత్సరే… దక్షిణాయనే వర్షఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్ధ్యాం తిధౌ… వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ శ్రీమాన్…గోత్రోద్భవస్య…. నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థయిర్య విజయా యురారోగ్యైశ్వరాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, మనోవాఞ్ఛాఫలసిద్ధ్యర్థం, సమస్త దురితోప శాంత్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం, వర్షేవర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థీ ముద్దిశ్య, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశో పచార పూజాం కరిష్యే. (అంటూ కుడిచేతి మధ్యవేలితో నీళ్ళు ముట్టుకోవాలి.) అదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణాధిపతి పూజాం కరిష్యే | తదంగ కలశపూజాం కరిష్యే ||

కలశ పూజ:

కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య | తస్యోపరి హస్తం నిధాయ (కలశంలో గంధం, పుష్పాలు, అక్షతలు వుంచి దానిని చేతితో తాకుతూ ఈ మంత్రం చదవాలి)
కలశస్యముఖే విష్ణుః కణేరుద్రస్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యేమాతృగణాస్మృతాః
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా ॥
ఋగ్వేదో2ధ యజుర్వేద స్సామవేదో హ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశామ్బు సమాశ్రితాః
ఆయాంతు దేవపూజార్థం దురితక్షయకారకాః (మనవద్ద వున్న నీటిపాత్ర చుట్టూ గంధం రాసి బొట్లుపెట్టి అందులో తమలపాకు వుంచుకోవాలి. ఈ శ్లోకం చదువుతూ ఆకును నీటిలో సవ్యపద్ధతిలో తిప్పాలి.)

శ్లో॥ గంగే చ యమునే కృష్ణ గోదావరి సరస్వతి,
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

తమలపాకుతో కలశంలోని నీటిని పూజాద్రవ్యముల మీదా, దైవము మీదా, తమ మీదా కొద్దిగా చిలకరించుకోవాలి. అనంతరం పసుపు గణపతిని పూజించాలి.

విఘ్నేశ్వర పూజ:

గణానాంత్వాం గణపతిగ్ం హవామహే, కవిం కవీనా ముపమశ్ర వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ్యస్పత్యః ఆనశృణ్వన్నూతిభిస్సీద సాదనం || శ్రీమహాగణాధిపతయే నమః ||
ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే (మధ్య వేలితో నీటిని తాకాలి)

ధ్యానం:

శుక్లాంబరధర విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

అనే శ్లోకం చదువుతూ పూవులూ, అక్షతలూ కలిపి పసుపు గణపతి పాదాలచెంత వుంచాలి. పూజను దేవుని పాదాలవద్ద మాత్రమే చేయాలి. శిరసుపైన పూలు కానీ అక్షతలు కానీ చల్లరాదు.)

ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి (అని చెబుతూ ఉద్దరిణతో నీటిని పసుపు గణపతికి చూపించి ఆ నీటిని పళ్లెం లేదా పాత్రలో వేయాలి.

పసుపు గణపతిని గంధం, అక్షతలు, పసుపు, కుంకుమ, పూలతో పూజించాలి. అగరువత్తులు వెలిగించి, బెల్లం లేదా పండు నైవేద్యంపెట్టి షోడశోప చారపూజచేయాలి. యధాభాగం గుడం నివేదయామి || శ్రీ మహాగణాధిపతి స్సుప్రసన్నో సుప్రీతో, వరదోభవతు॥ గణాధిపతి ప్రసాదం శిరసాగృష్ణమి అంటూ పూజచేసిన అక్షతలు రెండు తీసుకొని తలపై వుంచుకోవాలి. మరలా ఆచమనంచేసి పైన సూచించిన విధంగా సంకల్పం చెప్పుకోవాలి. అథ శ్రీ వరసిద్ధి వినాయక పూజాం కరిష్యే. తదంగ ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే అంటూ కుడిచేతి మధ్య వేలితో నీటిని తాకాలి.

మరిన్ని పూజా విధానాలు మీ అందరి కోసం:

Gayatri Mantram In Telugu | గాయత్రి మంత్రము

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. ఈ రోజు మన అంతర్జాల స్థలం అనగా వెబ్‌సైట్ నందు గాయత్రీ మంత్రము విశిష్టత, గాయత్రీ మంత్రమును ఎందుకు పఠించాలి, మరియు గాయత్రీ మంత్రమును గురించి తెలుసుకుందాం.

Gayatri Mantram In Telugu Lyrics

మంత్రం ఒక అద్భుత శక్తితో ఉన్నది. అది మనస్సును శుద్ధి చేస్తుంది, మానసిక సంతృప్తిని అందిస్తుంది, మనస్సును శాంతిగా చేస్తుంది. మంత్రము చదివితే, అందరికీ అనంత ప్రేమ మరియు శాంతి కలిగి వస్తుంది.

గాయత్రీ మంత్రము విశిష్టత

భారతదేశమున పూర్వకాలములో ముఖ్యముగా ఐదు విధములైన దేవతారాధనలు ఉండెడివి. అవి 1) గాణాపత్యము 2) సౌరము 3) శాక్తేయము 4) శైవము 5) వైష్ణవము. గాణాపత్యులు- గణపతిని; సౌరులు – సూర్యుని; శాక్తేయులు – శక్తిని; శైవులు – శివుని; వైష్ణవులు – విష్ణువును ఆరాధించెడివారు. వీరిమధ్య పరస్పర అవగాహన కన్న పరస్పరవిద్వేషమే అధికముగా ఉండెడిది. ఒకరి దేవతను ఇంకొకరు ఆరాధించరు. కాని, వీరందరూ ఆరాధించుటకు అభ్యంతరము లేని ఒకే ఒక దేవత “గాయత్రి”. అట్టి వైశిష్ట్యము గాయత్రీ మాతకు ఉన్నది.

గాయత్రీ మంత్రమును ఎందుకు పఠించాలి?

బుద్ధులు పెడత్రోవ త్రొక్కకుండా ప్రచోదనము చేయునది గాయత్రి కాబట్టి, ముందుగా ఈ సద్భుద్ధికై “గాయత్రి” పఠించి అటు పైన పొందిన సద్భుద్ధితో మిగిలిన ఇతర మంత్రములను పఠించిన ఫలితము చేకూరును. ఈ కారణము వలన మిగిలిన మంత్రములకన్న ముందుగా గాయత్రి చేయవలెనని చెప్పుట జరిగినది. అంతేగాని ‘గాయత్రి ఒక్కటియే మంత్రము, మిగిలిన మంత్రములు పనికిరానివి’ అని అర్థము కాదు.

గాయత్రీ మంత్రము

గానము చేయదగిన గాయత్రీ మంత్రములో రెండు విధములైన మంత్రములు గలవు. 1) విశిష్ట గాయత్రి 2) జప గాయత్రి. ఇందులో జప గాయత్రిలో ప్రణవము (ఓంకారము), మూడు పాదములు మాత్రమే ఉండును. ఈ జపగాయత్రినే సాధారణముగా గాయత్రీ మంత్రముగా వ్యవహరింతురు. ఈ జపగాయత్రి ఈ క్రింద తెలిపిన విధముగా నుండును.

Gayatri Mantram In Words

పైన తెలుపబడిన జప గాయత్రీ మంత్రములో మొత్తము 29 అక్షరములు లెక్కకు వచ్చును. మరి గాయత్రీ మంత్రములో 24 అక్షరములు (చతుర్విగ్ ంశత్యక్షరా) వుండును అందురు గదా! మరి 29 వచ్చినవేమి ? పైన తెలిపిన మంత్రములో మూడు వ్యాహృతులు అనగా భూః, భువః, సువః, (కొందరు ‘సువః’ కు బదులు ‘స్వః’ అందురు. అయినను అర్థము మారదు.)

గాయత్రీ మంత్రపద విభాగము

ఓం, తత్, సవితుః, వరేణ్యమ్, భర్గః, దేవస్య. ధీమహి, ధియః, యః, నః, ప్రచోదయాత్.

పదక్రమము:

వరేణ్యమ్, నః, ధియః, ప్రచోదయాత్ యః
తత్, ఓం సవితుః, దేవస్య, భర్గః, ధీమహి.

వరేణ్యమ్                      =   (అందరికినీ శ్రేయస్సును కలుగజేయుటలో కోరదగినదియు)
నః                                 =   మన
ధియః                           =   బుద్ధులను
ప్రచోదయాత్                =  ప్రేరేపించునదియు
యః                              =   ఎవరో
ఓం                               =   ప్రణవ ప్రతీకమైన
తత్                              =   ఆ
సవితు:దేవస్య              =  వెలుగుల సవితృమూర్తి యొక్క
భర్గః                             =  (స్వయంప్రకాశ ప్రాసర గుణ సమన్వితమైన) తేజస్సును
ధీమహి                         =   ధ్యానించుదము (గాక)

తాత్పర్యము:

అందరికిని శ్రేయస్సును కలుగజేయుటలో కోరదగినదియు, మన బుద్దులను ప్రేరేపించునదియు ఎవరో – ప్రణవ ప్రతీకమైన ఆ వెలుగుల సవితృమూర్తి యొక్క (స్వయం ప్రకాశ ప్రసార గుణ సమన్వితమైన) తేజస్సును ధ్యానించెదము (గాక!) (ఈ గాయత్రీ మంత్రమునకు బహువచనములోనే గాక ఏకవచనములో గూడా అర్థ తాత్పర్యాదులు చెప్పుకొనవచ్చును.) ఇది ఒక వర్గమునకు, వర్ణమునకు, కులమునకు, మతమునకు, జాతికి, సంబంధించిన మంత్రము కాదనియు, సమస్త మానవాళి శ్రేయస్సును కోరు సహృదయులందరూ ఈ మంత్రమును ఒంటిరిగానైననూ, సామూహికముగా నైననూ ఉచ్చరించవచ్చుననియు ఈ మంత్ర తాత్పర్యమును బట్టి తేట తెల్లమగుచున్నది. ఇది సూర్యుని నుండి సౌరశక్తిని సూటిగా పొందుటకు భారతీయ ఋషులు దర్శించిన మంత్రము. భారతీయుల ప్రార్థనలు, మంత్రములు అన్నియు ఇదే విధముగా స్వార్థ రహితముగా సర్వజన శ్రేయోదాయకములుగా ఉండునని గ్రహించవలెను.

లోకాస్సమస్తాః సుఖినోభవన్లు ! ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః, 

(సర్వలోక జీవులకు సుఖశాంతులు కలుగుగాక!)

హరిః ఓం తత్సత్

శ్రీ కృష్ణార్పణమస్తు

సంబందిత ప్రశ్నలు:

1. ప్రశ్న
గాయత్రీ మంత్రమును బాహాటముగా గొంతెత్తి ఉచ్చరించవచ్చునా?

సమాధానము :
“గాయంతాం త్రాయతే – ఇతి గాయత్రి” అనగా పాడిన కొలది రక్షించు మంత్రము గాయత్రి అని నిర్వచనములోనే ఉండగా ఈ సందేహము కలుగవలసిన పనిలేదు. మరియు, గాయత్రి వేదములోని మంత్రము. వేదమంతయు స్వరయుక్తము. బయటకు ఉచ్చరించినపుడే స్వర భేదము స్ఫుటముగా తెలియును గాని, లోపల నసిగినపుడు, గొణగినపుడు కాదు. అందుచేతనే స్వరయుక్త మంత్రములన్నియు బయటకు ఉచ్చరించుట తప్పుకాదు.

2. ప్రశ్న
అందఱూ కలసి సామూహికముగా ఉచ్చరించవచ్చునా ?

సమాధానము :
“థియోయోనః ప్రచోదయాత్’ అనుటలో “థియః” అనగా బుద్ధులు అని, “నః” అనగా “మమ్ము” లేదా “మా యొక్క” అను పదములతో బహువచనములు ఉండగా అందరూ కలసి చేయవచ్చుననియే తెలుపును గదా!

3. ప్రశ్న
ఈ ఉపదేశము ఎప్పుడు జరుగవలెను?

సమాధానము:
ఏ విద్యనైనను, ఏ మంత్రము నైనను నేర్చుకొనవలెనని అభిలాష, శ్రద్ధ, పట్టుదల కలిగిన వారు వాటిని చేర్చుకొనుటకు అర్హులే. ఆసక్తి, శ్రద్ధ కలుగుట అనగా బుద్ధి దానిపట్ల ప్రచోదనమగుట అనియే కదా! నిజమునకు ఆ మంత్రమును నేర్చుకొనవలెనని బుద్ధి పుట్టినపుడు మంత్రోపదేశము (Initiation) జరిగినట్లు లెక్క. ఆ తరువాత భౌతికముగా గురువు వద్ద ఉపదేశము పొందుట దానిని సమర్ధించుచు (Ratify) చేయు ప్రక్రియయే!

4. ప్రశ్న
వేరువేరు వర్ణములకు వేరు వేరు గాయత్రీ మంత్రములు వున్నవా?

సమాధానము:
అన్ని వర్ణములవారు గాయత్రిని చేసుకొనవచ్చును. ఆ మంత్రమును చేయుట తప్పనుకొనువారికి – వేరు, వేరు గాయత్రీ మంత్రములు గూడ కలవు. బ్రాహ్మణులకు అనుష్టుప్ ఛందస్సులో పై మంత్రము ఈయబడినది. (అనుష్టుప్ అనగా 8 అక్షరముల ఛందస్సు.

5. ప్రశ్న
స్త్రీలు యీ మంత్రమును పఠించవచ్చునా?

సమాధానము:
స్త్రీ, పురుషులందఱూ జీవాత్మలే ! అనగా జీవాత్మకు లింగభేదము లేదు. మైత్రేయి, గార్గి, అనసూయ మొదలగు వారు వేద శాస్త్రాదులు చదివిన వారే ! గాయత్రీ మంత్రమును జపించిన వారే ! చేయు పద్ధతిలో స్వల్ప భేదము ఉండునేమో గాని, సంధ్యా వందనము గూడ స్త్రీలకు నిషిద్ధము కాదు.

మరిన్ని పోస్ట్లు:

Mantra – మంత్రా

Mantra

మొట్ట మొదటిగా అందరికి నమస్కారము. మంత్రం అంటే ఒక ఆధ్యాత్మిక అలంకారం. ఇది జీవనంలో సంతోషం, శాంతి, మనస్సుకి సంతృప్తి, మానసిక తృప్తి లభించడానికి వాడే విధానం. మంత్రం చదువుట, గానం చేయుట, మంత్రాలను జపించుట, ధ్యానం చేయుట ద్వారా మన మాధుర్యం, భక్తి, ఆత్మీయత వంటి గుణాలను పెంచవచ్చు. మంత్రం ఒక అద్భుత శక్తితో ఉన్నది. అది మనస్సును శుద్ధి చేస్తుంది, మానసిక సంతృప్తిని అందిస్తుంది, మనస్సును శాంతిగా చేస్తుంది. మంత్రము చదివితే, అందరికీ అనంత ప్రేమ మరియు శాంతి కలిగి వస్తుంది. మొదలగు మంత్ర విషయముల గురించి ఈ క్రింద ఇచ్చిన లింకులు ద్వారా తెలుసుకుందాం…

Mantralu – మంత్రాలు